వెండి ధరలు పెరుగుతున్న వేళ నాగ పడగల మాయ
శ్రీకాళహస్తీశ్వరాలయంలో టీడీపీ కూటమి శ్రేణుల ఇష్టారాజ్యం
భక్తుల మాదిరిగా వెళ్లి ఆలయంలో విక్రయించే పూజా టికెట్ల కొనుగోలు
టికెట్లు కొన్నవారికి పూజా సామగ్రితోపాటు 5–10 గ్రాముల
రాహు–కేతు పడగల్ని సమకూరుస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయం
ఆ పడగల్ని జ్యూవెలరీ వ్యాపారులకు విక్రయిస్తున్న కూటమి శ్రేణులు
ఇంత జరుగుతున్నా చూడనట్టే వదిలేస్తున్న ఆలయ అధికారులు
పట్టించుకోని పాలకమండలి
సూర్య, చంద్రులను గ్రహణం రోజున రాహువు లేదా కేతువు కొంత సమయం పాటు మింగేస్తారనేది పురాణ ప్రశస్తి. అంతటి రాహు కేతువులనూ శ్రీకాళహస్తిలో టీడీపీ కూటమి శ్రేణులు మింగేస్తున్నారు. వెండి ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో నాగ పడగల రూపంలో ఆలయానికి దక్కాల్సిన వెండిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదు. పాలకమండలికి చెప్పినా వినిపించుకోవడం లేదు.
సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు పూజలకు ఉపయోగించే వెండి నాగ పడగలను టీడీపీ కూటమి నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొంతకాలంగా వెండి ధరలు పెరిగిపోతుండటంతో ఆలయంలో రూ.500 పూజా టికెట్లు కొని.. తద్వారా వచ్చే నాగ పడగలను బయట మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో నిత్యం రాహు–కేతు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పూజలు చేయించుకునే భక్తుల కోసం ఆలయంలోనే రూ.500, రూ.750, రూ.2,500, రూ.5,000 డినామినేషన్లలో టికెట్లు విక్రయిస్తారు.
రూ.500, రూ.750 టికెట్లు తీసుకునే భక్తులకు టెంకాయ, నల్లగుడ్డ, ఎర్రగుడ్డ, మినుములు, ఉద్దులు, పసుపు, కుంకుమ, తమలపాకు, వక్కతోపాటు 5 గ్రాముల బరువు గల రెండు (రాహు–కేతు) వెండి నాగపడగల్ని కూడా ఆలయ కౌంటర్‌లో భక్తులకు అందజేస్తారు. రూ.2,500, రూ.5 వేల టికెట్లు కొన్నవారికి పూజా సామగ్రితోపాటు ఒక్కొక్క టికెట్‌పై 10 గ్రాముల బరువైన రెండు వెండి నాగపడగల్ని ఇస్తారు.
భక్తుల ముసుగులో రూ.500 టికెట్లు కొనుగోలు చేస్తున్న టీడీపీ కూటమి నేతలు ఆలయ కౌంటర్లలో ఇచ్చే నాగపడగల్ని జ్యూవెలరీ వ్యాపారులకు, పూజాసామగ్రిని ఆలయం బయట ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ఆగడాల కారణంగా ఆలయానికి దక్కాల్సిన వెండి పక్కదారి పడుతుండగా.. కూటమి శ్రేణుల జేబులు నిండుతున్నాయి.
ఇలా కొట్టేస్తున్నారు: కొన్ని రోజులుగా వెండి ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.3.18 లక్షలు పలుకుతోంది. గ్రాము రూ.300 దాటింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కూటమి శ్రేణులు రూ.500 రాహు–కేతు పూజల టికెట్ కొనుగోలు చేసి, దానితోపాటు కౌంటర్‌లో ఇచ్చే రెండు నాగపడగల (ఒక్కొక్కటి రెండున్నర గ్రాములు) 5 గ్రాముల వెండిని బయట విక్రయించడం ప్రారంభించారు.
ప్రస్తుతం గ్రాము వెండికి రూ.300 చొప్పున 5 గ్రాముల్ని జ్యూవెలరీ వ్యాపారులకు విక్రయించి రూ.1,500 పొందుతున్నారు. అంటే రూ.500 టికెట్‌పై ఇచ్చే నాగపడగలకు రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ప్రతి టికెట్‌పై వచ్చే నాగపడగలకు రూ.1,000 చొప్పున ఆదాయం పొందుతున్నారు.
రోజుకు ఒక్కొక్క నాయకుడు కనీసం 10 నుంచి 20 వరకు టికెట్లు కొనుగోలు చేసి తద్వారా వచ్చే నాగపడగల్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కొక్క నాయకుడు రోజుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. దీంతోపాటు టికెట్లపై ఇచ్చే పూజా సామగ్రిని తక్కువ ధరకు ఆలయం వెలుపల వ్యాపారులకు విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా నాగపడగల ద్వారానే టీడీపీ కూటమి శ్రేణులు రోజుకు రూ.6–7 లక్షల వరకు వెనకేసుకుంటున్నారు. సుమారు మూడు నెలలుగా ఈ దందా సాగుతోంది.
తరిగిపోతున్న వెండి కొండలు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు పూజలు చేసుకుంటే సకల దోషాలు, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సుమారు 2 వేల కిలోల వెండి ఉంది. ప్రస్తుతం దీని విలువ సుమారు రూ.60 కోట్లు. ఈ వెండితోనే క్షేత్రంలోని మింట్‌లో వెండి పడగలు తయారు చేస్తారు. భక్తులు పూజలో ఉంచిన వెండి పడగల్ని పూజ ముగిసిన అనంతరం ఆలయ హుండిలోనే వేసేస్తారు. అలా వచ్చిన వెండి పడగల్ని ఏరోజుకారోజు సేకరించి 6 నెలలకు ఒకసారి హైదరాబాద్ తరలించి అక్కడ కరిగిస్తారు.
తరుగు పోగా మిగిలిన వెండిని కడ్డీల రూపంలోకి మారుస్తారు. తిరిగి ఆ వెండి కడ్డీలను ఆలయంలోని మింట్‌కు తీసుకొచ్చి నాగపడగల్ని తయారు చేసి టికెట్ తీసుకున్న భక్తులకు కౌంటర్ల ద్వారా ఇస్తారు. భక్తులు పూజలో వినియోగించిన అనంతరం హుండీలో వేయడం ద్వారా తిరిగి ఆలయానికే వస్తుంది.
కాగా.. కూటమి నేతలు భక్తుల ముసుగులో టికెట్లు తీసుకుని.. వాటిపై ఇచ్చే నాగపడగల్ని ప్రస్తుత మార్కెట్ ధరకు వ్యాపారులకు విక్రయిస్తుండటంతో ఆలయానికి చెందిన వెండి క్వింటాళ్ల కొద్దీ బయటకు పోతోంది. ఇప్పుడు వెండి ధర రోజురోజుకూ పెరిగిపోతుండటంతో కూటమి నేతలు దీనిపై దృష్టి సారించారు. ఆలయానికి రావాల్సిన వెండిని కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు.
టికెట్ కౌంటర్లను మార్చడంతో
గతంలో ఆలయ ఆవరణలోని టికెట్ కౌంటర్ల వద్ద రాహు–కేతు పూజల టికెట్లు విక్రయించేవారు. వీటిపై అక్కడి సిబ్బంది, సెక్యూరిటీ నిఘా ఉండేది. కానీ.. ఇటీవల ఆలయ రెండో గేటు, సన్నిధి వీధి వద్ద ఓ టికెట్ల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ సుమారు 10 కౌంటర్లు ఉన్నాయి. టీడీపీ నేతలకి ఇదే ప్రధాన కేంద్రమైంది. కౌంటర్లలో టికెట్ మాత్రమే ఇచ్చి వెండి పడగలు, పూజా సామగ్రి పూజా మండపాల్లోనే ఇచ్చి, వాటిని మండపాల్లోనే హుండీలో వేయిస్తే తప్ప ఈ చోరీని అరికట్టడం కష్టమని చెబుతున్నారు.
దళారుల దోపిడీ అధికారులకు తెలిసిందా?!
శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజల కోసం కొందరు దళారులు పూజా సామగ్రి తీసుకుని.. పూజలు నిర్వహించకనే వెండి నాగ పడగలను బయట మార్కెట్లో విక్రయిస్తున్నారన్న సమాచారం అధికారుల దృష్టికి వచ్చినట్టుంది. ఈ క్రమంలో బుధవారం రాహుకేతు పూజా టికెట్లను కౌంటర్లో విక్రయించి, వెండి నాగపడగలను మాత్రం రాహు కేతు పూజా మండపాల్లోనే భక్తులకు అందజేసినట్లు తెలిసింది.
అంతేకాకుండా ఒక్కరికి ఒక పూజా టికెట్ మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. దీంతో బుధవారం రూ.500 టికెట్ల రాహు కేతు పూజలు అతి తక్కువగా జరిగాయి. వెయ్యి లోపే రాహు కేతు పూజలు జరిగినట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. గడచిన రెండు నెలల్లో రూ.500 టికెట్ల రాహు కేతు పూజలు అతి తక్కువగా నిర్వహించింది బుధవారమే. మరోవైపు, బుధవారం మొదటిసారి రాహు కేతు పూజా టికెట్లను కౌంటర్లో విక్రయించి, పూజా సామాగ్రిని మండపాల్లో అందజేశారు.


