breaking news
Rahu Ketu Puja
-
రాహు - కేతువులనూ మింగేస్తున్నారు!
సూర్య, చంద్రులను గ్రహణం రోజున రాహువు లేదా కేతువు కొంత సమయం పాటు మింగేస్తారనేది పురాణ ప్రశస్తి. అంతటి రాహు కేతువులనూ శ్రీకాళహస్తిలో టీడీపీ కూటమి శ్రేణులు మింగేస్తున్నారు. వెండి ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో నాగ పడగల రూపంలో ఆలయానికి దక్కాల్సిన వెండిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదు. పాలకమండలికి చెప్పినా వినిపించుకోవడం లేదు.సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు పూజలకు ఉపయోగించే వెండి నాగ పడగలను టీడీపీ కూటమి నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొంతకాలంగా వెండి ధరలు పెరిగిపోతుండటంతో ఆలయంలో రూ.500 పూజా టికెట్లు కొని.. తద్వారా వచ్చే నాగ పడగలను బయట మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో నిత్యం రాహు–కేతు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పూజలు చేయించుకునే భక్తుల కోసం ఆలయంలోనే రూ.500, రూ.750, రూ.2,500, రూ.5,000 డినామినేషన్లలో టికెట్లు విక్రయిస్తారు. రూ.500, రూ.750 టికెట్లు తీసుకునే భక్తులకు టెంకాయ, నల్లగుడ్డ, ఎర్రగుడ్డ, మినుములు, ఉద్దులు, పసుపు, కుంకుమ, తమలపాకు, వక్కతోపాటు 5 గ్రాముల బరువు గల రెండు (రాహు–కేతు) వెండి నాగపడగల్ని కూడా ఆలయ కౌంటర్లో భక్తులకు అందజేస్తారు. రూ.2,500, రూ.5 వేల టికెట్లు కొన్నవారికి పూజా సామగ్రితోపాటు ఒక్కొక్క టికెట్‌పై 10 గ్రాముల బరువైన రెండు వెండి నాగపడగల్ని ఇస్తారు. భక్తుల ముసుగులో రూ.500 టికెట్లు కొనుగోలు చేస్తున్న టీడీపీ కూటమి నేతలు ఆలయ కౌంటర్లలో ఇచ్చే నాగపడగల్ని జ్యూవెలరీ వ్యాపారులకు, పూజాసామగ్రిని ఆలయం బయట ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ఆగడాల కారణంగా ఆలయానికి దక్కాల్సిన వెండి పక్కదారి పడుతుండగా.. కూటమి శ్రేణుల జేబులు నిండుతున్నాయి. ఇలా కొట్టేస్తున్నారు: కొన్ని రోజులుగా వెండి ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.3.18 లక్షలు పలుకుతోంది. గ్రాము రూ.300 దాటింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కూటమి శ్రేణులు రూ.500 రాహు–కేతు పూజల టికెట్ కొనుగోలు చేసి, దానితోపాటు కౌంటర్లో ఇచ్చే రెండు నాగపడగల (ఒక్కొక్కటి రెండున్నర గ్రాములు) 5 గ్రాముల వెండిని బయట విక్రయించడం ప్రారంభించారు. ప్రస్తుతం గ్రాము వెండికి రూ.300 చొప్పున 5 గ్రాముల్ని జ్యూవెలరీ వ్యాపారులకు విక్రయించి రూ.1,500 పొందుతున్నారు. అంటే రూ.500 టికెట్‌పై ఇచ్చే నాగపడగలకు రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ప్రతి టికెట్‌పై వచ్చే నాగపడగలకు రూ.1,000 చొప్పున ఆదాయం పొందుతున్నారు. రోజుకు ఒక్కొక్క నాయకుడు కనీసం 10 నుంచి 20 వరకు టికెట్లు కొనుగోలు చేసి తద్వారా వచ్చే నాగపడగల్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కొక్క నాయకుడు రోజుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. దీంతోపాటు టికెట్లపై ఇచ్చే పూజా సామగ్రిని తక్కువ ధరకు ఆలయం వెలుపల వ్యాపారులకు విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా నాగపడగల ద్వారానే టీడీపీ కూటమి శ్రేణులు రోజుకు రూ.6–7 లక్షల వరకు వెనకేసుకుంటున్నారు. సుమారు మూడు నెలలుగా ఈ దందా సాగుతోంది.తరిగిపోతున్న వెండి కొండలుశ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు పూజలు చేసుకుంటే సకల దోషాలు, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సుమారు 2 వేల కిలోల వెండి ఉంది. ప్రస్తుతం దీని విలువ సుమారు రూ.60 కోట్లు. ఈ వెండితోనే క్షేత్రంలోని మింట్‌లో వెండి పడగలు తయారు చేస్తారు. భక్తులు పూజలో ఉంచిన వెండి పడగల్ని పూజ ముగిసిన అనంతరం ఆలయ హుండిలోనే వేసేస్తారు. అలా వచ్చిన వెండి పడగల్ని ఏరోజుకారోజు సేకరించి 6 నెలలకు ఒకసారి హైదరాబాద్ తరలించి అక్కడ కరిగిస్తారు. తరుగు పోగా మిగిలిన వెండిని కడ్డీల రూపంలోకి మారుస్తారు. తిరిగి ఆ వెండి కడ్డీలను ఆలయంలోని మింట్‌కు తీసుకొచ్చి నాగపడగల్ని తయారు చేసి టికెట్ తీసుకున్న భక్తులకు కౌంటర్ల ద్వారా ఇస్తారు. భక్తులు పూజలో వినియోగించిన అనంతరం హుండీలో వేయడం ద్వారా తిరిగి ఆలయానికే వస్తుంది. కాగా.. కూటమి నేతలు భక్తుల ముసుగులో టికెట్లు తీసుకుని.. వాటిపై ఇచ్చే నాగపడగల్ని ప్రస్తుత మార్కెట్ ధరకు వ్యాపారులకు విక్రయిస్తుండటంతో ఆలయానికి చెందిన వెండి క్వింటాళ్ల కొద్దీ బయటకు పోతోంది. ఇప్పుడు వెండి ధర రోజురోజుకూ పెరిగిపోతుండటంతో కూటమి నేతలు దీనిపై దృష్టి సారించారు. ఆలయానికి రావాల్సిన వెండిని కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు.టికెట్ కౌంటర్లను మార్చడంతోగతంలో ఆలయ ఆవరణలోని టికెట్ కౌంటర్ల వద్ద రాహు–కేతు పూజల టికెట్లు విక్రయించేవారు. వీటిపై అక్కడి సిబ్బంది, సెక్యూరిటీ నిఘా ఉండేది. కానీ.. ఇటీవల ఆలయ రెండో గేటు, సన్నిధి వీధి వద్ద ఓ టికెట్ల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ సుమారు 10 కౌంటర్లు ఉన్నాయి. టీడీపీ నేతలకి ఇదే ప్రధాన కేంద్రమైంది. కౌంటర్లలో టికెట్ మాత్రమే ఇచ్చి వెండి పడగలు, పూజా సామగ్రి పూజా మండపాల్లోనే ఇచ్చి, వాటిని మండపాల్లోనే హుండీలో వేయిస్తే తప్ప ఈ చోరీని అరికట్టడం కష్టమని చెబుతున్నారు. దళారుల దోపిడీ అధికారులకు తెలిసిందా?!శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజల కోసం కొందరు దళారులు పూజా సామగ్రి తీసుకుని.. పూజలు నిర్వహించకనే వెండి నాగ పడగలను బయట మార్కెట్లో విక్రయిస్తున్నారన్న సమాచారం అధికారుల దృష్టికి వచ్చినట్టుంది. ఈ క్రమంలో బుధవారం రాహుకేతు పూజా టికెట్లను కౌంటర్లో విక్రయించి, వెండి నాగపడగలను మాత్రం రాహు కేతు పూజా మండపాల్లోనే భక్తులకు అందజేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఒక్కరికి ఒక పూజా టికెట్ మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. దీంతో బుధవారం రూ.500 టికెట్ల రాహు కేతు పూజలు అతి తక్కువగా జరిగాయి. వెయ్యి లోపే రాహు కేతు పూజలు జరిగినట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. గడచిన రెండు నెలల్లో రూ.500 టికెట్ల రాహు కేతు పూజలు అతి తక్కువగా నిర్వహించింది బుధవారమే. మరోవైపు, బుధవారం మొదటిసారి రాహు కేతు పూజా టికెట్లను కౌంటర్లో విక్రయించి, పూజా సామాగ్రిని మండపాల్లో అందజేశారు. -
శ్రీకాళహస్తిలో హీరోయిన్ పూజలు
'మాయాజాలం' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై.. తర్వాత నాగార్జున సరసన 'గగనం' సినిమాలో చేసి ప్రస్తుతం కోలీవుడ్‌లో మాంచి బిజీగా కనిపిస్తున్న పూనమ్ కౌర్.. తనకున్న దోషాలను తొలగించుకోడానికి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించిందట. తెలుగులో ఆమెకు పెద్ద ఆఫర్లు రాకపోయినా.. అడపాదడపా ఏవో ఒకటి చేస్తూనే ఉంది. ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, శౌర్యం, వినాయకుడు, గణేశ్ జస్ట్ గణేశ్, నాగవల్లి, పయనం, బ్రహ్మిగాడి కథ.. ఇలా పలు సినిమాల్లో ఆమె నటించినా ఇక్కడ పెద్దగా పేరు మాత్రం తెచ్చుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో తన హవా చూపించేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో 'రణం' అనే సినిమాలో నటిస్తున్న ఆమె.. అందులో ఒక్క పాట కోసం ఏకంగా 400 కాస్ట్యూమ్స్‌ని మార్చింది. ఇప్పటి వరకూ తమిళంలో ఏ హీరో/ హీరోయిన్ ఇలా చేయ్యకపోవడంతో ఇదొక రికార్డని చెబుతున్నారు. -
పెళ్లి కోసం సినీనటి పూజలు
శ్రీకాళహస్తి : 'ఐ లవ్ యూ రస్నా' అంటూ అందరినీ అలరించి...అనంతరం నటిగా మారిన అంకిత ప్రస్తుతం వివాహం కోసం పూజలు చేస్తోంది. మంగళవారం ఆమె తన కుటుంబ సభ్యలుతో కలిసి శ్రీకాళహస్తిశ్వరాలయానికి విచ్చేసింది. ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేయించుకుంది. ఈ సందర్భంగా వేదపండితులు అంకితతో ప్రత్యేక పూజలు చేయించి అనంతరం స్వామివారి దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందచేశారు. స్వామివారి దర్శనం అనంతరం అంకిత విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి శివయ్య ఆశీస్సులతోనైనా వివాహం జరుగుతుందనే ఆశతో ఆయన సన్నిధిలో రాహుకేతు పూజలు చేయించుకున్నట్లు తెలిపింది. తాను అమెరికాలో చదువుకుంటున్నానని ప్రస్తుతం వివాహం చేసుకునే పనిలో ఉన్నానని... వివాహం తర్వాత సినిమాలు చేయాలా వద్దా...? అనేది చెబుతానని అంకిత తెలిపింది. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో తెరంగేట్రం చేసిన అంకిత... ఆ సినిమా తరువాత పెద్ద హీరోలతో పలు సినిమాలలో నటించినా తెలుగునాట అంతగా ఆదరణ లభించలేదు. దాంతో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఆమె తమిళనాట అడుగు పెట్టింది. అక్కడ కూడా అవకాశాలు లేకపోవటంతో అంకిత అమెరికాలో పలు స్టేజీ షోలు చేసింది. -
భక్తుల నిలువుదోపిడీ
రాహు-కేతు పూజల్లో బలవంతపు వసూళ్లు పనిచేయని సీసీ కెమెరాలు అధికారులకూ వాటాలు! శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా అర్చకులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వాటా అందుతున్న కారణంగానే ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయం రాహు-కేతు పూజలకు పేరుగాంచింది. ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో భక్తులు అనేక మోసాలకు గురవుతున్నారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పూజారులు అందినకాడికి దోచుకుంటున్నారు. అడుగడుగునా దోపిడీ పట్టణంలోని దేవస్థానం సమాచారకేంద్రం నుంచి ఆలయం వరకు, సన్నిధివీధిలో నేతి దీపాలు, కొబ్బరికాయలు, గరిక, జిల్లేడు మాలలు విక్రయించే దుకాణాలు అనేకం ఉన్నాయి. వీటిని ఆలయంలోకి అనుమతించరు. రాహు-కేతు పూజలు చేయించుకునే భక్తులు వీటిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దేవస్థానం వారే పూజా సామగ్రిని అందజేస్తారు. అయినా రాహు-కేతు టికెట్లు తీసుకున్న భక్తులకు దుకాణదారులు వీటిని బలవంతంగా అంటగడుతున్నారు. బలవంతంగా దక్షిణ రూ.300, రూ.750, రూ.1500, రూ.2,500 టికెట్లపై రాహు-కేతు పూజలు జరుగుతున్నాయి. పూజలు చేయించుకున్న భక్తులు చివర్లో తప్పనిసరిగా దక్షిణ(డబ్బు) సమర్పించుకోవాల్సి ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత దోషం పోవాలంటే బ్రాహ్మణులకు గోదానం, భూదానం, సువర్ణదానం చేయాల్సిఉంటుందని పూజారులు బాహాటంగానే చెబుతుం టారు. వాటిని ఇవ్వడం వీలుకాదు కాబట్టి దక్షిణ ఇవ్వాలని వారే సలహా ఇస్తుంటారు. ఏమవుతుందో ఏమోనని భక్తులు తోచినంత ఇచ్చి వెళుతున్నారు. పూజకో రేటు రాహు-కేతు పూజా టికెట్లు మూడు రకాలుగా ఉన్నా యి. మూడు ప్రాంతాల్లో పూజలు జరుగుతున్నాయి. ఒక్కో పూజ చేసుకునే భక్తులు ఒక్కో రకమైన దక్షిణ సమర్పించుకోవాలి. రూ.300 పూజ చేసుకునే భక్తులు రూ.50, రూ.750 పూజ వారు రూ.100, రూ.1500 పూజ చేసుకునే భక్తులు రూ.200 నుంచి 300 వరకు దక్షిణ ఇవ్వాలి. పనిచేయని సీసీ కెమెరాలు మృత్యుంజయ మండపంలోని సీసీ కెమెరాలు మాత్రమే పనిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా రూ.300, రూ.1500 టికెట్లు కొని రాహుకేతు పూజలు చేయించుకుంటుంటారు. వీటిని ఆలయంలోని మృత్యుంజయ మండపంలో చేస్తారు. ఇక్కడే ప్రధానంగా ఆలయ కిందిస్థాయి సిబ్బంది, దళారులు, అర్చకులు భక్తుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. భక్తుల నుంచి అధికమొత్తంలో దక్షిణ రూపంలో, దానధర్మం పేరిట వసూలు చేస్తున్నారు. దీనిపై ఆలయ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకూ వాటాలు ఆలయంలోని స్వామి అమ్మవార్ల సన్నిధిలోనే కాకుండా పరివార దేవతల వద్ద పూజారులు, పరిచారకులు ఉన్నారు. హారతి పళ్లాలను నిషేధించారు. దీనివల్ల భక్తులకు దక్షిణలు ఇచ్చే బాధ తప్పిందని భావించారు. అయితే మళ్లీ ఈ తంతు సాధారణమై పోయింది. హారతి పళ్లాలు, రాహు-కేతు పూజల్లో వచ్చే వసూళ్లు కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు వెళుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ఆలయంలోని మృత్యుంజయ మండపంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఇటీవల నా దృష్టికి వచ్చింది. వాటిని త్వరలో బాగు చేయిస్తాం. ఆలయంలో జరిగే రాహుకేతు పూజల్లో భక్తుల నుంచి దక్షిణ వసూలు చేయరాదని అర్చకులను ఆదేశించాం. ఎక్కడైనా దక్షిణ వసూలు చేస్తుంటే భక్తులు ఫిర్యాదు చేయవచ్చు. విచారించి చర్యలు తీసుకుంటాం. - పూర్ణచంద్రరావు, ఇన్చార్జి ఈవో -
పాపం చేసి ఉంటేనే పూజలకు వస్తారు: ఎమ్మెస్సార్
శ్రీకాళహస్తి: పాపం చేసినవాళ్లు విముక్తి కోసం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేయించుకుంటారని, తాను ఏదో పాపం చేసి ఉంటేనే పూజల కోసం వచ్చానని ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణ రావు అన్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయానికి గురువారం ఆయన కుటుంబ సమేతంగా విచ్చేశారు. రూ.2500ల రాహుకేతు పూజలు చేయించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెస్సార్ ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ పాపం చేసిన వారికి శివయ్య తన చెంత రాహుకేతు పూజలు చేయించుకుని విముక్తి కలిగిస్తాడని, తనకా అదృష్టం ఇప్పడు లభించిందన్నారు.


