
సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డిపై దాడికి యత్నిస్తున్న టీడీపీ గూండాలు
పంచాయతీ సర్పంచ్‌పై టీడీపీ కార్యకర్త దాడి
వత్తాసు పలికిన పోలీసులు
సర్పంచ్‌నే స్టేషన్‌కు తరలించి, నిర్బంధించిన డీఎస్పీ
తీవ్ర ఒత్తిడిలో స్టేషన్‌లోనే కుప్పకూలిన వైఎస్సార్‌సీపీ నేత
తిరుపతి జిల్లాలో దారుణం
చంద్రగిరి: స్వాతంత్య్ర దినోత్సవంనాడు తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. జాతీయ పతాకం ఆవిష్కరణకు వచ్చిన పంచాయతీ సర్పంచ్‌పై ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ‘‘జెండా ఎగరేస్తే నిన్ను ఇక్కడే పాతేస్తా నా.. ’’ అంటూ దాడికి పాల్పడ్డాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు, రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ జెండా ఎగురవేయనీయకుండా అడ్డుకుని సర్పంచ్‌నే బలవంతంగా స్టేషన్‌కు తరలించడంతో, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వైఎస్సార్‌సీపీ నేత అక్కడికక్కడే కుప్పకూలారు.
వివరాల్లోకి వెళితే, 2024 ఎన్నికల అనంతరం టీడీపీ నాయకుల తీవ్ర హింసాకాండ నేపథ్యంలో మండల పరిధిలోని రామిరెడ్డిపల్లి పంచాయతీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి గ్రామం విడిచి వెళ్లిపోయి, ప్రస్తుతం చంద్రగిరిలో ఉంటున్నారు. హైకోర్టు రూలింగ్ నేపథ్యంలో ఆయన గ్రామంలోకి అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నా.. పూర్తిగా గ్రామంలో ఉండలేని దారుణ పరిస్థితి. ఈ నేపథ్యంలో పంచాయతీ ప్రథమ పౌరునిగా ఆగస్టు 15న గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణకు చంద్రశేఖర్‌రెడ్డి రామిరెడ్డిపల్లికి వెళ్లారు.
ఈ సందర్భంలో పంచాయతీ పరిధిలోని కూచువారిపల్లికి చెందిన మురళీనాయుడు కొంత మంది అల్లరి మూకలను తీసుకొచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకున్నాడు. ‘‘ఈ ఊర్లోకి వచ్చేందుకు నీకు ఎంత ధైర్యం రా.. జెండా ఎగరేస్తే నిన్ను ఇక్కడే పాతేస్తా నా...’’ అంటూ బూతుపురాణం ఎత్తుకుని సర్పంచ్‌పై దాడికి యత్నించాడు.
స్టేషన్‌లో తీవ్ర అవమానం
సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసాద్ తన సిబ్బందితో కలసి సచివాలయం వద్దకు చేరుకున్నాడు. సర్పంచ్ జెండా ఆవిష్కరణలో పాల్గొనకుండా బలవంతంగా స్టేషన్‌కు తరలించాడు. 12.15 గంటల వరకూ రెండు గంటలకుపైగా స్టేషన్‌లోనే నిర్బంధించాడు. ఈ సందర్భంగా డీఎస్పీ టీడీపీ కార్యకర్త మురళీనాయుడు ఎదుటే సర్పంచ్‌ని అగౌరవపరుస్తూ మాట్లాడాడు. దీనితో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు లోనై అక్కడే కుప్పకూలి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు.
వెంటనే సీఐ ఇమ్రాన్ బాషా తన సిబ్బందితో కలసి పోలీసు వాహనంలో ఆయనను తిరుపతి రుయాకు తరలించారు. ఈ సమాచారంతో చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రుయాకు చేరుకున్నాయి. ఆయనను మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని నారాయణాద్రి ఆసుపత్రికి తరలించారు.
ఐసీయూలో అత్యవసర వైద్య సేవలు అందించడంతో చంద్రశేఖర్‌రెడ్డి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ రెడ్డిని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తదితర పార్టీ నాయకులు పరామర్శించారు. టీడీపీ రెడ్‌బుక్, ప్రజావ్యతిరేక చర్యలపై పోరులో వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.