విపత్తుల నుంచి రక్షణకు ఆర్థికసాయం చేయాలి 

Taneti Vanitha request to central govt for Financial assistance - Sakshi

కేంద్రానికి ఏపీ హోంమంత్రి వనిత వినతి 

సాక్షి, న్యూఢిల్లీ: విపత్తుల నుంచి రక్షించుకోవడానికి తీరప్రాంత రాష్ట్రాలకు ఆర్థికసాయం చేయాలని ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైన అన్ని జిల్లాల్లోనూ మల్టీపర్పస్‌ సైక్లోన్‌ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన నేషనల్‌ ప్లాట్‌ఫామ్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (ఎన్‌పీడీఆర్‌ఆర్‌) సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ ఏటా ఒకటి, అంతకన్నా ఎక్కువ విపత్తులు ఎదుర్కొంటోందని చెప్పారు. తమ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో ఆలోచించడంతో విపత్తు నిర్వహణ శాఖ విపత్తులు ఎదుర్కోవడంలో విజయం సాధిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి కరవు లేదని చెప్పారు.

ప్రతి సంవత్సరం తీర ప్రాంతాలను తుపానులు అతలాకుతం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2020వ సంవత్సరం నవంబర్‌ నెలలో నివర్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. తుపానుల ప్రభావం నుంచి కోలుకోవడానికి సహాయం కోరుతున్నట్లు చెప్పారు. ప్రపంచబ్యాంకు నిధులతో నేషనల్‌ సైక్లోన్‌ రిస్క్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టు (ఎన్‌సీఆర్‌ఎంపీ) సహాయంతో తొమ్మిది తీరప్రాంత జిల్లాల్లో 219 మల్టీ పర్పస్‌ సైక్లోన్‌ షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మరికొన్ని జిల్లాల్లో కూడా వాటి ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తానేటి వనిత  విజ్ఞప్తి చేశారు. తమ సీఎం రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ వలంటీర్లకు శిక్షణ ఇవ్వడంతో విపత్తులు వచ్చినప్పుడు తగిన సేవలు అందిస్తున్నారని తెలిపారు.

తీరప్రాంతాల్లో మడ తోటలు, షెల్టర్‌ బెల్ట్‌ ప్లాంటేషన్, ఇతర నిర్మాణాత్మక చర్యలు ఎంతో అవసరమన్నారు. ఎన్‌సీఆర్‌ఎంపీ మౌలిక సదుపాయాల కింద వంతెనల ఏర్పాటు, తుపాను షెల్టర్లకు అనుసంధానించే రహదారుల నిర్మాణం వంటివి చేపట్టాలని ఆమె కోరారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top