గీత దాటితే వేటే! | Tammineni Sitaram says behavior of TDP members was deeply offending | Sakshi
Sakshi News home page

గీత దాటితే వేటే!

Mar 16 2022 3:56 AM | Updated on Mar 16 2022 3:56 AM

Tammineni Sitaram says behavior of TDP members was deeply offending - Sakshi

సాక్షి, అమరావతి: ఇక నుంచి శాసనసభ గౌరవానికి భంగం కలిగించిన సభ్యులు వారంతట వారే ఆటోమేటిగ్గా సస్పెన్షన్‌కు గురవుతారని స్పీకర్‌ తమ్మినేని సీతారాం మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన రూలింగ్‌ ఇచ్చారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వారు తనపట్ల అవమానకరంగా వ్యవహరించారని, ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించేలా వ్యవహరించారన్నారు. కాగితాలు చించి తనపై విసిరారని అయినా సంయమనం పాటించానని.. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని పదేపదే కోరినా తన మాట వినలేదని.. దీనివల్ల సభ నుంచి ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని స్పీకర్‌ తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తాను సభా నియమాలు, సంప్రదాయాలను హుందాగా కొనసాగిద్దామని ప్రయత్నించినా అడ్డంకులు కల్పించారని తెలిపారు. అందుకే ఇకపై సభా హక్కులకు భంగం కలిగించినా, సభకు ఆటంకం కలిగించినా నిర్ద్వంద్వంగా సస్పెండ్‌ అవుతారని తమ్మినేని తేల్చిచెప్పారు.

గతంలో విధానం తిరిగి అమలు
ఈ అంశంపై మాట్లాడాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డిని స్పీకర్‌ కోరారు. దీంతో స్పీకర్‌ అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నట్లు చీఫ్‌విప్‌ తెలిపారు. సభా హక్కులు ఉల్లంఘిస్తే ఆటోమేటిగ్గా సస్పెండ్‌ అయ్యే విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. గతంలో యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉన్నప్పుడు ఇదే విధానాన్ని అమలుచేశారని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉందని.. దీనిపై ప్రతిపాదనలు పెట్టాలని స్పీకర్‌గా యనమల అప్పట్లో ప్రతిపాదించారని గుర్తుచేశారు. మిజోరం అసెంబ్లీలో 332/1 నిబంధన ప్రకారం సభ సజావుగా జరగనప్పుడు సభ్యులు ఆటోమేటిగ్గా సస్పెండ్‌ అయ్యే విధానం అమలవుతోందని తెలిపారు.

ఇందుకు కారణమైన సభ్యులు మూడు సిట్టింగ్‌లు (రోజులు) లేదా సెషన్‌ అయ్యే వరకు (ఏది తక్కువ రోజులైతే అన్ని రోజులు) వారంతట వారే సస్పెన్షన్‌కు గురవుతారన్నారు. అలాగే, 2001లో లోక్‌సభలో 374ఏ రూల్‌ తీసుకువచ్చారని.. దీని ప్రకారం ఐదు సిట్టింగ్‌లు లేదా సెషన్‌ పూర్తయ్యే వరకు (ఏది తక్కువైతే అన్ని రోజులు) సస్పెండ్‌ అవుతారని.. అదే తరహాలో రూల్‌ 340ని శాసనసభ నిబంధనావళిలో కలపాలని శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దీనికి సభ ఆమోదం తెలిపింది.

ఈ నియమం ప్రకారం.. స్పీకర్‌ పోడియం, సభ్యుల సీట్ల మధ్య తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు గీతలు ఉంటాయని, సభ్యులెవరైనా ఎరుపు రంగు గీత దాటితే ఆటోమేటిగ్గా సస్పెండ్‌ అయినట్లేనని తెలిపారు. ఇకపై శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రతిపాదించడం వంటివేమీ ఉండవని స్పష్టంచేశారు. ఈ తీర్మానాన్ని రూల్స్‌ కమిటీకి పంపాలని చీఫ్‌విప్‌ను స్పీకర్‌ తమ్మినేని కోరారు. అనంతరం.. ఏపీ విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు–2022ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement