
రాజధాని నిర్మాణ టెండర్లలో లాలూచీపర్వం మరోసారి బట్టబయలు
రూ.2,114.08 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచిన సీఆర్‌డీఏ, ఏడీసీఎల్
వాటిని రూ.2,205.63 కోట్లకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన కూటమి ప్రభుత్వం
షాపూర్‌జీ పల్లోంజీకి రూ.709.12 కోట్లు, ఎల్‌అండ్‌టీకి రూ.1023.18 కోట్లు,మేఘాకు రూ.473.33 కోట్ల విలువైన పనులు అప్పగింత
కి.మీ.కు రూ.66.18 కోట్ల చొప్పున రోడ్డు నిర్మాణ పనులు మేఘాకు..
కాంట్రాక్టు విలువలో పది శాతం రూ.220 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సు
ఇందులో ఎనిమిది శాతం ముఖ్య నేత.. రెండు శాతం కాంట్రాక్టు సంస్థలకు
ఏడీసీఎల్ పద్ధతిలోనే కి.మీ.కు కేవలం రూ.20 కోట్ల వ్యయంతోనే రహదారులు నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో మరోసారి లాలూ‘ఛీ’పర్వం బట్టబయలైంది. ముఖ్య నేత ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ల సిండికేట్‌లోని సంస్థలు అధిక ధరలకు పనులు దక్కించుకున్నాయి. కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కవడంతో కేవలం ఆరు ప్యాకేజీల టెండర్లలోనే ప్రభుత్వ ఖజానాపై రూ.91.55 కోట్ల మేర భారం పడింది. ఈ సంస్థలు 4.41, 4.40, 4.39 శాతం అధిక ధరకు పనులను పొందడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
» గెజిటెడ్, నాన్ గెజిటెడ్, టైప్–1, టైప్–2, క్లాస్–4 ఉద్యోగులకు నివాసాలు, మౌలిక సదుపాయాల కల్పన పనులకు నాలుగు ప్యాకేజీల కింద రూ.1,659.30 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఈ–13, ఈ–15 రహదారుల పొడిగింపు పనులకు రూ.454.78 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) నిర్వహించిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
» మొత్తం టెండర్ల అంచనా వ్యయం రూ.2,114.08 కోట్లు కాగా.. రూ.2,205.63 కోట్లకు సిండికేట్‌లోని మూడు కాంట్రాక్టు సంస్థలకు తలా రెండు ప్యాకేజీల చొప్పున ప్రభుత్వం పనులను అప్పగించింది. షాపూర్‌జీ పల్లోంజీ (రూ.709.12 కోట్లు), ఎల్‌అండ్‌టీ (రూ.1023.18 కోట్లు), మేఘా (రూ.473.33 కోట్లు) సంస్థలకు పనులను కట్టబెట్టింది. అధిక ధరలకు అప్పగించడంతో ఈ 6 ప్యాకేజీల పనుల వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.91.55 కోట్ల భారం పడింది.
» ఆరు ప్యాకేజీల పనుల టెండర్లను ఆమోదిస్తూ, వాటిని కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడానికి అనుమతిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
» పనులు అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నాక కాంట్రాక్టు విలువలో పది శాతం ( రూ.220.56 కోట్లు) మేర మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పనున్నారు. ఇందులో ఎనిమిది శాతం ముఖ్య నేత.. రెండు శాతం కాంట్రాక్టు సంస్థలు పంచుకోవడం బహిరంగ రహస్యమని కాంట్రê క్టు వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఇవీ..
» నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు నేలపాడు వద్ద ఎస్+12 విధానంలో 12 టవర్లలో 1,140 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిన పనుల పూర్తికి రూ.495.31 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించారు. టెండర్లలో 4.40 శాతం అధికం (రూ.517.10 కోట్లు) కోట్ చేసి ఎల్‌అండ్‌టీ ఎల్–1గా నిలిచి పనులను దక్కించుకుంది.
» గెజిటెడ్ ఆఫీసర్లు, టైప్–1, టైప్–2, క్లాస్–4 అధికారులకు ఎస్+12 విధానంలో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిన పనుల పూర్తికి రూ.492.77 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించారు. 4.39 శాతం అధిక ధరకు (రూ.514.40 కోట్లు) టెండర్లు కోట్ చేసిన షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ఎల్–1గా వచ్చి పనులను దక్కించుకుంది.
» నేలపాడు వద్ద నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు ఎస్+12 విధానంలో 9 టవర్లలో 855 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిపోయిన పనుల పూర్తికి రూ.484.69 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచారు. 4.41 శాతం అధిక ధరకు (రూ.506.06 కోట్లకు) కోట్ చేసి ఎల్–1గా నిలిచి ఎల్‌అండ్‌టీ సంస్థ పనులను చేజిక్కించుకుంది.
» టైప్–1, టైప్–2 గెజిటెడ్ ఆఫీసర్లు, గ్రూప్–డి ఆఫీసర్లకు ఎస్+12 విధానంలో 14 టవర్లలో నిరి్మస్తున్న 1,440 ఫ్లాట్లకు తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ సీవరేజీ సిస్టమ్, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేపట్టిన పనుల్లో మిగిలినవాటిని పూర్తి చేయడానికి రూ.186.53 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి పిలిచిన టెండర్లలో 4.39 శాతం అధిక ధరకు (రూ.194.72 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ పనులను దక్కించుకుంది.
» ఈ–13 రహదారిని ఎన్‌హెచ్–16 వరకు పొడిగించేందుకు 7.29 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల నిర్మాణానికి రూ.384.78 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్లలో 4.10 శాతం అధిక ధరకు (రూ.400.55 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా నిలిచి మేఘా సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీవరేజీ వంటి పన్నుల రూపంలో అదనంగా రూ.81.92 కోట్లు ఏడీసీఎల్ ఇవ్వనుంది. దీంతో కాంట్రాక్టు విలువ రూ.482.47 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన కి.మీ.కు రూ.66.18 కోట్ల చొప్పున రోడ్డు నిర్మాణ పనులను అప్పగించినట్లు స్పష్టమవుతోంది. కాగా.. ఇదే పద్ధతిలో జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల వ్యయంతోనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మిస్తుండడం గమనార్హం.
» ఈ–15 రహదారిని పొడిగించే పనులకు రూ.70 కోట్ల వ్యయంతో నిర్వహించిన టెండర్లలో 3.98 శాతం అధిక ధరకు (రూ.72.78 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా నిలిచిన మేఘా సంస్థ వాటిని దక్కించుకుంది.