contracting agency
-
ఖజానాకు రూ.91.55 కోట్లు గండి
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో మరోసారి లాలూ‘ఛీ’పర్వం బట్టబయలైంది. ముఖ్య నేత ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ల సిండికేట్‌లోని సంస్థలు అధిక ధరలకు పనులు దక్కించుకున్నాయి. కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కవడంతో కేవలం ఆరు ప్యాకేజీల టెండర్లలోనే ప్రభుత్వ ఖజానాపై రూ.91.55 కోట్ల మేర భారం పడింది. ఈ సంస్థలు 4.41, 4.40, 4.39 శాతం అధిక ధరకు పనులను పొందడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. » గెజిటెడ్, నాన్ గెజిటెడ్, టైప్–1, టైప్–2, క్లాస్–4 ఉద్యోగులకు నివాసాలు, మౌలిక సదుపాయాల కల్పన పనులకు నాలుగు ప్యాకేజీల కింద రూ.1,659.30 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఈ–13, ఈ–15 రహదారుల పొడిగింపు పనులకు రూ.454.78 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) నిర్వహించిన టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. » మొత్తం టెండర్ల అంచనా వ్యయం రూ.2,114.08 కోట్లు కాగా.. రూ.2,205.63 కోట్లకు సిండికేట్‌లోని మూడు కాంట్రాక్టు సంస్థలకు తలా రెండు ప్యాకేజీల చొప్పున ప్రభుత్వం పనులను అప్పగించింది. షాపూర్జీ పల్లోంజీ (రూ.709.12 కోట్లు), ఎల్అండ్టీ (రూ.1023.18 కోట్లు), మేఘా (రూ.473.33 కోట్లు) సంస్థలకు పనులను కట్టబెట్టింది. అధిక ధరలకు అప్పగించడంతో ఈ 6 ప్యాకేజీల పనుల వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.91.55 కోట్ల భారం పడింది. » ఆరు ప్యాకేజీల పనుల టెండర్లను ఆమోదిస్తూ, వాటిని కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడానికి అనుమతిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. » పనులు అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నాక కాంట్రాక్టు విలువలో పది శాతం ( రూ.220.56 కోట్లు) మేర మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పనున్నారు. ఇందులో ఎనిమిది శాతం ముఖ్య నేత.. రెండు శాతం కాంట్రాక్టు సంస్థలు పంచుకోవడం బహిరంగ రహస్యమని కాంట్రê క్టు వర్గాలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఇవీ.. » నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు నేలపాడు వద్ద ఎస్+12 విధానంలో 12 టవర్లలో 1,140 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిన పనుల పూర్తికి రూ.495.31 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించారు. టెండర్లలో 4.40 శాతం అధికం (రూ.517.10 కోట్లు) కోట్ చేసి ఎల్అండ్టీ ఎల్–1గా నిలిచి పనులను దక్కించుకుంది. » గెజిటెడ్ ఆఫీసర్లు, టైప్–1, టైప్–2, క్లాస్–4 అధికారులకు ఎస్+12 విధానంలో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిన పనుల పూర్తికి రూ.492.77 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించారు. 4.39 శాతం అధిక ధరకు (రూ.514.40 కోట్లు) టెండర్లు కోట్ చేసిన షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఎల్–1గా వచ్చి పనులను దక్కించుకుంది. » నేలపాడు వద్ద నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు ఎస్+12 విధానంలో 9 టవర్లలో 855 ఫ్లాట్ల నిర్మాణంలో మిగిలిపోయిన పనుల పూర్తికి రూ.484.69 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచారు. 4.41 శాతం అధిక ధరకు (రూ.506.06 కోట్లకు) కోట్ చేసి ఎల్–1గా నిలిచి ఎల్అండ్టీ సంస్థ పనులను చేజిక్కించుకుంది. » టైప్–1, టైప్–2 గెజిటెడ్ ఆఫీసర్లు, గ్రూప్–డి ఆఫీసర్లకు ఎస్+12 విధానంలో 14 టవర్లలో నిరి్మస్తున్న 1,440 ఫ్లాట్లకు తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ సీవరేజీ సిస్టమ్, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేపట్టిన పనుల్లో మిగిలినవాటిని పూర్తి చేయడానికి రూ.186.53 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి పిలిచిన టెండర్లలో 4.39 శాతం అధిక ధరకు (రూ.194.72 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా షాపూర్జీ పల్లోంజీ సంస్థ పనులను దక్కించుకుంది. » ఈ–13 రహదారిని ఎన్‌హెచ్–16 వరకు పొడిగించేందుకు 7.29 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల నిర్మాణానికి రూ.384.78 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్లలో 4.10 శాతం అధిక ధరకు (రూ.400.55 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా నిలిచి మేఘా సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీవరేజీ వంటి పన్నుల రూపంలో అదనంగా రూ.81.92 కోట్లు ఏడీసీఎల్ ఇవ్వనుంది. దీంతో కాంట్రాక్టు విలువ రూ.482.47 కోట్లకు చేరుకుంది. ఈ లెక్కన కి.మీ.కు రూ.66.18 కోట్ల చొప్పున రోడ్డు నిర్మాణ పనులను అప్పగించినట్లు స్పష్టమవుతోంది. కాగా.. ఇదే పద్ధతిలో జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల వ్యయంతోనే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్మిస్తుండడం గమనార్హం. » ఈ–15 రహదారిని పొడిగించే పనులకు రూ.70 కోట్ల వ్యయంతో నిర్వహించిన టెండర్లలో 3.98 శాతం అధిక ధరకు (రూ.72.78 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా నిలిచిన మేఘా సంస్థ వాటిని దక్కించుకుంది. -
‘ఔట్ సోర్సింగ్’ను రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్/లింగోజిగూడ: రాష్ట్రంలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకున్న కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తూ, రాష్ట్రంలోని 2.5 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పొట్టకొట్టుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అరకొరగా వచ్చే జీతాలను సైతం మూడు, నాలుగు నెలలకోసారి చెల్లిస్తున్నారని, కొన్ని సార్లు ఆరేడు నెలలైనా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక అనేక మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో జిల్లాల నుంచి వ చ్చిన ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పులి లక్ష్మయ్య, కె.సంతోష్, వినోద్, అరుణ్‌కుమార్, నారాయణ, బిందు తదితరులు మాట్లాడారు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్దికరించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పే–స్కేలు, ఇతర ప్రయోజనాలను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల సర్విసు పూర్తి కాని ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేసి ఆదుకోవాలని అన్నారు. అలాగే 2023 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలు అన్యాయం చేస్తున్నాయి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా, మూడు, నాలుగు నెలలకోసారి ఒకటి, రెండు నెలల జీతాలు చెల్లిస్తున్నారని, మిగిలిన జీతాలను కాంట్రాక్టు ఏజెన్సీలు స్వాహా చేస్తున్నాయని జేఏసీ నేతలు ఆరోపించారు. కొత్త ఏజెన్సీలు వచ్చి అప్పటికే ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయని, రూ.లక్షలు వసూలు చేసి కొత్త వారిని నియమించుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత వాళ్లు కొనసాగలంటే మళ్లీ కొత్త ఏజెన్సీలకు భారీ మొత్తంలో లంచాలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. వీఆర్ఏల కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు? వీఆర్ఏల క్రమబద్దికరణలో భాగంగా వారిని పెద్ద సంఖ్యలో తమ శాఖకు కేటాయించారని, దాంతో ఇకపై మీరు విధులకు రావాల్సిన అవసరం లేదని.. నాలుగైదు జిల్లాల్లో పశుసంవర్థక శాఖ ఆఫీస్ సబార్డినేట్లకు స్థానిక అధికారులు తేల్చి చెప్పారని ఈ సమావేశానికి హాజరైన పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఈ నెల 20 డెడ్‌లైన్
ఆలోగా ఎస్కలేషన్ ప్రతిపాదనలు ఇవ్వకుంటే అగ్రిమెంట్ రద్దు ♦ కాంట్రాక్టు ఏజెన్సీలకు ♦ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక ♦ జీవో 146పై సుదీర్ఘంగా చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పరిధిలో పనులు చేస్తు న్న కాంట్రాక్టు ఏజెన్సీలు తమ ఎస్కలేషన్ ప్రతి పాదనలను ఈ నెల 20 నాటికి సమర్పించాలని ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టింది. వారం రోజుల్లోగా సమర్పించని పక్షంలో టెండర్ అగ్రిమెంట్‌ను సైతం రద్దు చేయాలని నిర్ణయించింది. ఎస్కలేషన్ ప్రతిపాదనలపై ఇప్పటివరకు ఏజెన్సీల నుంచి స్పందన లేకపోవడంతో సీరియస్‌గా తీసుకున్న నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు... అధికారులు, ఏజెన్సీలతో శుక్రవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్‌లు హాజ రయ్యారు. జీవో 146 ప్రతిపాదనలను ప్యాకేజీల వారీగా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం జీవో 146ను తెచ్చిందని, అయితే ఏజెన్సీలు, అధికారులు ఈ జీవో అమలు విషయంలో అలసత్వం వహిస్తున్నారని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. పాలేరు ఎత్తిపోతలకు ‘భక్త రామదాసు’ పేరు ఖమ్మం జిల్లా ప్రాజెక్టులనూ మంత్రి సమీక్షించా రు. దీనికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా, పాలేరు ఎత్తిపోతల పథకం పేరును భక్త రామదాసు ఎత్తిపోతలుగా పేరు మారుస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని హరీశ్ ఆదేశించారు. అలాగే కరీంనగర్ జిల్లా రాయపట్నం దగ్గర ఆర్అండ్బీ శాఖ నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆ శాఖ మంత్రి తుమ్మలను హరీశ్ కోరారు. స్పందించిన తుమ్మల... జూన్ వరకు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుపైనా సమీక్షించారు. త్వరగా సర్వేలు పూర్తిచేసి నల్లగొండ జిల్లాలోని రిజర్వాయర్ల వరకు టెండర్లు పిలవాలని సూచించారు. 15న బడ్జెట్‌పై సమావేశం కాగా ఈ నెల 15న నీటి పారుదల శాఖ బడ్జెట్‌పై సమావేశం కావాలని మంత్రి నిర్ణయించారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఆచరణ సాధ్యమయ్యేలా ఉండాలని, శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేయాలన్నారు. -
‘ఎస్కలేషన్’కు డెడ్ లైన్!
► వారంలోగా ప్రతిపాదనలు ► ఇవ్వకుంటే కఠిన చర్యలే ► ప్రాజెక్టుల నిర్మాణ ఏజెన్సీలకు ► నీటిపారుదల శాఖ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పరిధిలో పనులు చేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టింది. ఎస్కలేషన్ ప్రతిపాదనలను వారం రోజుల్లో సమర్పించని యెడల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. టెండర్ అగ్రిమెంట్‌ను రద్దు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించింది. ఎస్కలేషన్ ప్రతిపాదనలపై ఇప్పటివరకు ఏజెన్సీల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ వ్యవహారాన్ని నీటి పారుదల శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, ఏజెన్సీలతో హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని జలసౌధలో వర్క్‌షాప్ నిర్వహించారు. దీనికి ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)లు మురళీధర్, విజయ్‌ప్రకాశ్ హాజరయ్యారు. 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లోని 111 ప్యాకేజీల్లో స్టీలు, సిమెంట్, ఇంధన ధరలకు తోడు కార్మికుల కూలీ, యంత్ర పరికరాల ధరలకు అదనంగా చెల్లించడానికి జీవో 146లో ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. ఎస్కలేషన్ ప్రతిపాదనలు నవంబర్ 30 నాటికే ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉన్నా ఇంతవరకు ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో డిసెంబర్ 30వరకు ఒకమారు, జనవరి 15 వరకు మరోమారు గడువు పొడగించారు. అయినా స్పందన లేకపోవడంతో తాజాగా ఏజెన్సీలతో అధికారులు సమావేశం నిర్వహించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలు లేవనెత్తిన అంశాలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న 19 ప్యాకేజీలు, కరీంనగర్ 20 ప్యాకేజీలు, ఆదిలాబాద్ జిల్లాలోని 6 ప్యాకేజీలపై సమీక్ష జరిగింది. ప్రాజెక్టుల పనులు ముందుకు కదలకపోవడంతో ఆయకట్టు లక్ష్యాలు దెబ్బతింటున్నాయని, రూ.10 వేల కోట్ల పనులు ఆగిపోయాయని జోషి వారి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు చేరుకోవాలంటే కాంట్రాక్టర్లు సహకరించాలని, పనులు త్వరగా మొదలు పెట్టాలని సూచించారు. వారం లోగా ప్రతిపాదనలు సమర్పించాలని, లేనియెడల టెండర్ అగ్రిమెంట్‌ను రద్దు చేసి కాంట్రాక్టర్లపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. అయితే, దీనిపై మెజార్టీ ఏజెన్సీలు సానుకూలత వ్యక్తం చేసినట్టుగా, ప్రతిపాదనలు సమర్పిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. గురువారం మరిన్ని ప్యాకేజీల పరిధిలోని ఏజెన్సీలతో సమావేశం కొనసాగే అవకాశం ఉంది.