మిషన్‌ బిల్డ్‌ ఏపీ కేసు: సుప్రీంకోర్టు స్టే

Supreme Court Stay On Justice Rakesh kumar Judgement - Sakshi

జస్టిస్‌ రాకేష్‌ ఉత్తర్వులపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే

సాక్షి, అమరావతి : మిషన్‌ బిల్డ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. పదవీ విరణమణకు ఒక్కరోజు ముందు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు, తీర్పుపై స్టే విధిస్తూ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. జస్టిస్‌ రాకేష్‌ తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి. ఆ తర్వాత అవి వ్యక్తిగత అభిప్రాయాలుగా న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. కాగా డిసెంబర్‌ 30న తీర్పును వెలువరించి, డిసెంబర్‌ 31న జస్టిస్‌ రాకేష్‌ పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై తేలుస్తామంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్‌ దాఖలు చేసింది.

రాజ్యాంగ వైఫల్యంపై అధికరణ 356 కింద రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చే కానీ న్యాయస్థానాలు కాదని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీల్‌లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు ఏ మాత్రం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు నివేదించారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లలో రాజ్యాంగ వైఫల్యంపై విచారణ జరుపుతామన్న హైకోర్టు ఉత్తర్వులు సహేతుకం కాదన్నారు. ఈ అప్పీల్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అక్టోబర్‌ 1న హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ గతంలోనే న్యాయస్థానం​ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమ వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ కొందరు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లు దాఖలు చేస్తే ఆ వ్యాజ్యాల్లో ఓ న్యాయస్థానం ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఎప్పుడైనా, ఎక్కడైనా మనం చూశామా? అంటూ విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆ న్యాయమూర్తులు భావించడానికి అంతగా ప్రభావితం చేసిన అంశాలేమున్నాయో అంతుబట్టడం లేదని వ్యాఖ్యానించింది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top