మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో...‘నవయుగ’కు ఎదురుదెబ్బ 

Supreme Court Of India On Navayuga Port Limited - Sakshi

మధ్యవర్తిని నియమించాలన్న అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు  

హైకోర్టునే ఆశ్రయించాలని నవయుగ పోర్ట్‌ లిమిటెడ్‌కు తేల్చిచెప్పిన ధర్మాసనం 

నవయుగ తీరువల్లే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం 

పోర్టును వీలైనంత త్వరగా పూర్తిచేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం  

సుప్రీంకోర్టుకు నివేదించిన ఏపీ ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ   

సాక్షి, న్యూఢిల్లీ: మచిలీపట్నం పోర్టు కాంట్రాక్ట్‌ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న నవయుగ పోర్ట్‌ లిమిటెడ్‌కు ఇప్పుడు సుప్రీంకోర్టులోను అదే పరిస్థితి ఎదురైంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం నిమిత్తం తమతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిన నేపథ్యంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిని నియమించాలన్న నవయుగ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

తాము మధ్యవర్తిని నియమించ­బోమని స్పష్టంచేసింది. మధ్యవర్తి నియామక అభ్య­ర్థనతో హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధనుంజయ్‌ చంద్రచూడ్, న్యాయ­మూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 

ఇదీ నేపథ్యం.. 
నవయుగ పోర్ట్‌ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో జీవో 66 జారీచేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ నవయుగ పోర్ట్‌ లిమిటెడ్‌ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన   సింగిల్‌ జడ్జి ఆ జీవోను సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ నవయుగ పోర్ట్‌ లిమిటెడ్‌ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది.

అదే సమయంలో ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు పలు అభ్యర్థనలతో అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేసింది. వాటిని న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి కొట్టేసింది. అలాగే తమతో ఒప్పందం రద్దుచేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలన్న అనుబంధ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది.

ఒప్పందం రద్దుచేసుకుంటూ ప్రభుత్వం జారీచేసిన జీవో 66, ప్రాజెక్టును పీపీపీ నుంచి ఈపీసీ విధానంలోకి మారుస్తూ జారీచేసిన జీవో 9 అమలును నిలిపేయాలంటూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సైతం జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం కొట్టేసింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం విషయంలో నవ­యుగ కోరిన విధంగా ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు సాధ్యంకాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. తుది విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసింది.  

హైకోర్టు ధర్మాసనం ఆదేశాలపై సుప్రీంకోర్టులో నవయుగ పిటిషన్‌  
జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం ఆదేశాలపై నవయుగ పోర్ట్‌ లిమిటెడ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై సీజే జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం గురువారం విచారించింది. నవయుగ పోర్ట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ నవయుగ విజ్ఞప్తిపై స్పందించాలంటే రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి అవసరమని తెలిపారు. ఒప్పందం రద్దులో తమ తప్పేమీ లేదన్నారు.

ఒప్పందం చేసుకుని భూమి కేటాయించినా నిర్మాణ పనుల్లో నవయుగ అసాధారణ జాప్యం చేసిందని చెప్పారు. అందుకే విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దుచేసుకోవాల్సి వచ్చిందన్నారు.

వీలైనంత త్వరగా మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని పూర్తిచేయడమే ప్రభుత్వ లక్ష్యమ­ని తెలిపారు. రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసి ప్రాజెక్టు పనులను ముందుకెళ్లకుండా అడ్డుకునేందుకు నవయుగ ప్రయత్నించిందని, అయితే హైకోర్టు  స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top