సబ్సిడీ ట్రాక్టర్ల పేరుతో రైతులకు కుచ్చుటోపీ

Subsidy Tracker Fraud To Farmers Three People Arrested In Dwaraka Tirumala - Sakshi

రైతులకు తెలియకుండా వారిపేరున 34 ట్రాక్టర్లకు ఫైనాన్స్‌

అనంతరం పలు ప్రాంతాల్లో వాటి విక్రయాలు 

బ్యాంకు నోటీసులతో వెలుగులోకొచ్చిన మోసం 

ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు 

ద్వారకాతిరుమల: సబ్సిడీపై ట్రాక్టర్లు ఇప్పిస్తానని కొందరు రైతులను నమ్మించి, వారిపేరున ఫైనాన్స్‌ ద్వారా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను వేరే వ్యక్తులకు అమ్మి సొమ్ము చేసుకున్న కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు నోటీసులు అందడంతో బాధిత రైతులు పోలీసుల్ని ఆశ్రయించగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఎస్‌.ఐ. వెంకటసురేష్‌ రైతులను మోసగించిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు కేసు వివరాలను వెల్లడించారు. ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన ఈదల శ్రీధర్‌.. సొంత గ్రామంలోని రైతులతో పాటు మండలంలోని ఎం.నాగులపల్లి, దొరసానిపాడు, ద్వారకాతిరుమల, దేవినేనివారిగూడేనికి చెందిన 34 మంది రైతులను రూ.6 లక్షల ట్రాక్టర్‌ను సబ్సిడీపై రూ.4 లక్షలకు ఇప్పిస్తానని చెప్పాడు.

అది నమ్మిన రైతులు గతేడాది శ్రీధర్‌ చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టారు. తరువాత వారు రెండుమూడుసార్లు అడిగినా.. త్వరలో వస్తాయని చెప్పాడు. తరువాత ఏలూరులోని శ్రీ ప్రసన్నలక్ష్మీ మోటార్స్‌ స్వరాజ్‌ ట్రాక్టర్‌ షోరూమ్‌ యజమాని నెక్కలపు మనోజ్‌కుమార్, షోరూమ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ దేవులపల్లి మోహన్‌కుమార్, హెచ్‌డీఎఫ్‌సీ ఫైనాన్స్‌ ఏజెంట్‌ సహాయంతో బాధిత రైతుల పేరున శ్రీధర్‌ 34 ట్రాక్టర్లకు ప్రైవేట్‌ బ్యాంకుల ద్వారా ఫైనాన్స్‌ చేయించాడు. డౌన్‌పేమెంట్‌ కట్టాడు. షోరూమ్‌ యజమాని సహాయంతో మోహన్‌కుమార్, శ్రీధర్‌ ట్రాక్టర్లను డెలివరీ తీసుకుని లబ్ధిదారులకు తెలియకుండానే చుట్టుపక్కల రైతులతో పాటు, తెలంగాణలోని పలువురికి విక్రయించారు. ఫైనాన్స్‌ తీరిపోయిందని, త్వరలో రికార్డులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని నమ్మబలికి ఒక్కో ట్రాక్టర్‌ను రూ.4 లక్షలకు అమ్మి సొమ్ముచేసుకున్నారు. వచ్చిన సొమ్ములో కొంతభాగాన్ని.. బాధిత రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, కొన్ని వాయిదాలకు వారి ఖాతాల్లో సొమ్ము ఉండేలా జాగ్రత్తపడ్డాడు. 

5 ట్రాక్టర్ల స్వాధీనం
ఇటీవల రైతుల ఖాతాల్లో డబ్బు లేక వాయిదాలు వసూలుకాకపోవడంతో పోవడంతో ఫైనాన్స్‌ కంపెనీల వారు రైతులకు నోటీసులిచ్చారు. అప్పుడు అసలు విషయం తెలిసిన బాధిత రైతులు ఈ నెల 7న ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన ఎస్‌.ఐ. వెంకటసురేష్‌..  ట్రాక్టర్లు తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్లాలని వాటిని కొనుగోలు చేసినవారికి చెప్పారు. దీంతో శ్రీధర్‌ వద్దకు చేరిన 5 ట్రాక్టర్లను ఎస్‌.ఐ. స్వాధీనం చేసుకుని.. శ్రీధర్, మనోజ్‌కుమార్, మోహన్‌కుమార్‌లను అరెస్టు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top