తల్లడిల్లిన మాతృ హృదయాలు 

Students Missing in Pudimadaka Beach - Sakshi

విశాఖపట్నం: తీరంలో గల్లంతైన విద్యార్థుల్లో మండలంలోని చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్, మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ ఉన్నారు. వీరిలో గణేష్‌ మృతిచెందాడు.  ఈ రోజు(శనివారం) ఉదయం గణేశ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. ఇక ప్రాణాలతో బయటపడిన తేజ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.చూచుకొండ గ్రామానికి చెందిన పెంటకోట ఆదినారాయణ, నాగమణి దంపతులకు కుమార్తె, కుమారుడు గణేష్‌ ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని జీవనం సాగిస్తున్నారు. 

కుమారుడు గణేష్‌ అనకాపల్లిలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గణేశ్‌ మృతి వార్త తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.  

ఈత రావడంతో.. 

మునగపాక పల్లపు వీధిలో నివాసం ఉంటున్న సూరిశెట్టి కన్నబాబు,హేమ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో రెండవ కుమారుడు తేజ. వీళ్లది కూడా రైతు కుటుంబమే. తేజ అనకాపల్లిలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి పూడిమడక సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. ఈత రావడంతో ఏదొలా ఒడ్డుకు చేరుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని స్థానికులు అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు తరలించారు. తేజ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

యలమంచిలి: తీరంలో గల్లంతైన విద్యార్థుల్లో పట్టణ పరిధి ఎర్రవరం గ్రామానికి చెందిన పూడి రామచంద్రశేఖర్‌ ఉన్నాడు. గ్రామానికి చెందిన పూడి శ్రీను, సుజాత దంపతులకు రామచంద్రశేఖర్, పూజ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను వడ్రంగి పని చేసుకుంటూ పిల్లలను బాగా చదివించాడు. కుమార్తె విజయవాడలో నర్సింగ్, రామచంద్ర శేఖర్‌ అనకాపల్లి డైట్‌ కళాశాలలో ఈసీఈ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తన స్నేహితులతో కలిసి పూడిమడక బీచ్‌కు స్నానానికి వెళ్లాడు. తీరంలో కుమారుడు గల్లంతయ్యాడన్న వార్తలో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని అదుపుచేయడం ఎవరితరం కావడం లేదు.    

తల్లడిల్లిన మాతృ హృదయాలు 
రోలుగుంట: రోలుగుంటకు చెందిన విద్యార్థి జశ్వంత్‌కుమార్‌ తీరంలో గల్లంతు వార్త తెలుసుకున్న మాతృహృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇదే గ్రామానికి చెందిన సుర్ల గిరిగోవర్దనరావు, అమ్మాజీకి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిని కష్టపడి శక్తిమేర చదివిస్తున్నారు. వీరిలో కుమారుడు జశ్వంత్‌కుమార్‌ ఎల్‌కేజీ నుంచి టెన్త్‌ వరకు నర్సీపట్నం శారదా ఇంగ్లీష్‌ మీడియంలో, ఇంటర్‌ విశాఖ శ్రీచైతన్యం చదివించారు. ప్రస్తుతం అనకాపల్లి దాడి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి అనకాపల్లిలో ఉంటూ కళాశాలకు వెళ్తున్నాడు. తీరంలో గల్లంతైన విషయం తల్లిదండ్రులకు చేరడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top