
దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం
త్వరలో విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన
రాష్ట్ర స్థాయి ఎంఎస్‌ఓ–లోకల్ కేబుల్ ఆపరేటర్ల రౌండ్ టేబుల్ సమావేశం వెల్లడి
సాక్షి, అమరావతి: ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని కేబుల్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో గురువారం రాష్ట్రస్థాయి ఎంఎస్‌ఓ–లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్‌సీవో) అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్, ఏపీ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ తరఫున రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిళ్లతో పాటు తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే విజయవాడలో భారీ నిరసన చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. అనంతరం గాందీనగర్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. ఎవరేమన్నారంటే..
» సాక్షి టీవీ ఆపేయడం వల్ల కస్టమర్లు డీటీహెచ్‌లకు వెళ్లిపోతున్నారని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీ టు ఎయిర్ ఛానళ్లను ప్రభుత్వానికి సంబంధం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
» పే ఛానళ్ల వ్యవస్థ, ప్రభుత్వం తమకు సహకరించకపోగా ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
» ఏపీలో పే ఛానళ్ల రేట్ల పెంపుదలతో కేబుల్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కృష్ణ తెలిపారు. ట్రాయ్‌లో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకుని తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాడ్ కాస్టర్ల వ్యవస్థ ఎంఎస్‌ఓలను సైతం బ్లాక్ మెయిల్ చేసి తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. బ్రాడ్ కాస్టర్లు దిగిరాకపోతే పే ఛానళ్లను అవసరమైతే నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.