సింగిల్‌ జడ్జి ఆదేశాలను రద్దు చేయండి

State Election Commissioner appeals to High Court on Parishad elections - Sakshi

పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అప్పీల్‌

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను గతంలో ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించాలని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి గత నెల 21న ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ధర్మాసనం ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అప్పీల్‌ దాఖలు చేశారు. సింగిల్‌ జడ్జి ఆదేశాలను రద్దు చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరపనుంది.

కేసుతో సంబంధం లేని అంశాల ప్రస్తావన
సింగిల్‌ జడ్జి తన తీర్పులో ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని అంశాలను ప్రస్తావించారని, అంతర్జాతీయ ఒడంబడికలు, అవసరానికి మించి తీర్పులను ప్రస్తావించారని ఎస్‌ఈసీ నివేదించారు. టీడీపీ నేత వర్ల రామయ్య, జనసేన దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సింగిల్‌ జడ్జి, జనసేన పిటిషన్‌ ఆధారంగా తీర్పు వెలువరించారన్నారు. ఎన్నికల తేదీకి 4 వారాల ముందు నియమావళి  అమలు చేయాలని జనసేన తన పిటిషన్‌లో ఎక్కడా కోరలేదని, అయినా సింగిల్‌ జడ్జి ఆ అంశం ఆధారంగా ఎన్నికలను రద్దు చేశారని  ఎస్‌ఈసీ పేర్కొన్నారు. 4 వారాల ముందు నియమావళి అమలు చేయాలని వర్ల రామయ్య కోరితే సింగిల్‌ జడ్జి ఆ పిటిషన్‌ను కొట్టివేశారన్నారు. సింగిల్‌ జడ్జి తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలనేకం ఉన్నాయన్నారు.

సింగిల్‌ జడ్జి వ్యాఖ్యలు సరికాదు..
సింగిల్‌ జడ్జి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే కాకుండా తనపై వ్యాఖ్యలు చేశారని  పేర్కొన్నారు. సింగిల్‌ జడ్జి అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు. ఓ రాజ్యాంగ సంస్థగా హైకోర్టు స్వతంత్రంగా విధులు నిర్వహిస్తున్న మాదిరిగానే ఎన్నికల కమిషనర్‌ కూడా బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. సింగిల్‌ జడ్జి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలని కోరారు. 

ఉమ్మడిగా వర్తిస్తుంది..
స్థానిక సంస్థల కాలపరిమితి 2018–19లోనే ముగిసిందని, వాటికి సత్వరమే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్న విషయాన్ని సింగిల్‌ జడ్జి విస్మరించారన్నారు. సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు అని తన ఉత్తర్వుల్లో చెప్పిందే కానీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ అంటూ వేర్వేరుగా చెప్పలేదన్నారు. అందువల్ల 4 వారాల ఎన్నికల నియమావళి అమలు అన్ని ఎన్నికలకు ఉమ్మడిగా వర్తిస్తుందన్నారు. కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల నియమావళి అమలు చేయలేదన్న వాదన చెల్లదన్నారు.

సుప్రీం ఎన్నోసార్లు చెప్పింది..
ఎన్నికల ప్రక్రియ ఒకసారి మొదలయ్యాక అందులో జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులిచ్చిందని,  సింగిల్‌ జడ్జి అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఎన్నికలను రద్దు చేశారని ఎస్‌ఈసీ వివరించారు. ఎన్నికల నిర్వహణకు రూ.150 కోట్ల ప్రజాధనం ఖర్చు అయిందన్న విషయాన్ని సింగిల్‌ జడ్జి పరిగణలోకి తీసుకోలేదన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top