స్టీల్‌ప్లాంట్‌ వేతన చర్చల్లో ప్రతిష్టంభన 

Stalemate in steelplant wage negotiations - Sakshi

29న తప్పని సమ్మె.. కార్మిక సంఘాల్లో విభేదాలు? 

ఉక్కు నగరం (విశాఖ): స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల వేతన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆరు రోజులుగా జరుగుతున్న చర్చల్లో కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యం మొండి వైఖరి అవలంబించడంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. చర్చల్లో కార్మిక సంఘాల్లో విభేదాలు వచ్చాయని, వాటిని యాజమాన్యం ఉపయోగించుకుని డిమాండ్లు నెరవేర్చడంలో అలసత్వం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016 డిసెంబర్‌ 31తో ఉక్కు కార్మికులకు గత వేతన ఒప్పందం గడువు ముగిసింది. 2017 జనవరి 1 నుంచి జరగాల్సిన వేతన సవరణ నాలుగున్నరేళ్లు కావస్తున్నా జరగకపోవడంతో కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. కార్మిక సంఘాలు తొలుత ఈ ఏడాది మే 6న సమ్మె చేయాలని సంకల్పించగా సెయిల్‌ చైర్మన్‌ వేతన సవరణకు హామీ ఇవ్వడంతో దాన్ని వాయిదా వేశారు.

ఆ తర్వాత జరిగిన సమావేశాల్లో కూడా యాజమాన్యం కార్మిక సంఘాల డిమాండ్లకు పొంతన లేని ప్రతిపాదనలు చేసింది. దీంతో ఆగ్రహించిన కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మె చేస్తామని యాజమాన్యానికి నోటీసిచ్చాయి. సమ్మె నివారణా చర్యల్లో భాగంగా నేషనల్‌ జాయింట్‌ కమిటీ ఫర్‌ స్టీల్‌ (ఎన్‌జేసీఎస్‌) ఆధ్వర్యంలో ఆరు రోజులుగా వేతన చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కార్మిక సంఘాలు 15% ఎంజీబీ డిమాండ్‌ చేయగా యాజమాన్యం 13% ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ప్రధానంగా పెర్క్స్‌ అంశంపై ఇరువర్గాల మధ్య పీటముడి బిగిసింది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వలే రివైజ్డ్‌ బేసిక్‌పై 35% పెర్క్స్‌ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేయగా యాజమాన్యం 15% ఇస్తామని ప్రతిపాదించింది. 15% అంగీకరిస్తే జూనియర్‌ కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని కార్మిక సంఘాలు చెప్పినప్పటికీ యాజమాన్యం వైఖరిలో మార్పు రాలేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top