సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు 

Srinivasa Rao as CPM state secretary of Andhra Pradesh - Sakshi

15 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం 

50 మందితో రాష్ట్ర కమిటీ, 12 మంది ఆహ్వానితులు 

సాక్షి, అమరావతి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ప్రకాశం జిల్లా వాసి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వంకాయలపాటి శ్రీనివాసరావు (వీఎస్సార్‌) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇద్దరు ఆహ్వానితులు సహా 15 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గం, ఏడుగురు ఆహ్వానితులు, ఐదుగురు ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 62 మందితో పార్టీ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. జాలా అంజయ్య అధ్యక్షతన ఐదుగురితో కంట్రోల్‌ కమిషన్‌ ఏర్పాటైంది.

పార్టీ మహాసభల్లో చివరిరోజైన బుధవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఎంఏ గఫూర్, వై.వెంకటేశ్వరరావు, సీహెచ్‌ నరసింగరావు, సీహెచ్‌.బాబూరావు, కె.ప్రభాకర్‌రెడ్డి, డి.రమాదేవి, మంతెన సీతారాం, బి.తులసీదాస్, వి.వెంకటేశ్వర్లు, పి.జమలయ్య,కె.లోకనాథం, మూలం రమేష్, ఆహ్వానితులుగా కె.సుబ్బరావమ్మ, సురేంద్ర కిల్లో ఎన్నికయ్యారు.  

వీఎస్సార్‌ ప్రస్థానం ఇలా.. 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లిలో ఓ సామాన్య రైతు కుటుంబంలో 1960లో జన్మించారు. ప్రాథమిక, ఉన్నత విద్యను ప్రకాశం జిల్లాలోనే అభ్యసించారు. నెల్లూరు జిల్లా కావలి జవహర్‌ భారతి కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివిన ఆయన ఆ సమయంలోనే విద్యార్ధి ఉద్యమాల వైపు ఆకర్షితులై ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. యువజనోద్యమాలకు సారధ్యం వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడి వరకు వివిధ బాధ్యతల్లో పనిచేశారు. రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ రైతువాణి పత్రికను రైతుల్లోకి తీసుకెళ్లారు.

ప్రజాశక్తి దినపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. దళిత్‌ సోషన్‌ ముక్తిమంచ్‌ (డీఎస్‌ఎంఎం) ఏర్పాటుచేసి వ్యవస్థాపక కన్వీనర్‌గా దేశవ్యాప్తంగా విస్తరించారు. కొంతకాలం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పనిచేశారు. ఆయన సతీమణి 1998లో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు. బీవీ రాఘవులు తరువాత ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన రెండో వ్యక్తి శ్రీనివాసరావు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top