ఎగుమతులకు ప్రత్యేక ప్రణాళిక

Special plan for exports CM YS Jagan Vanijya Utsav - Sakshi

వాణిజ్య ఉత్సవ్‌లో విడుదల చేయనున్న సీఎం జగన్‌ 

నేడు, రేపు విజయవాడలో ఏపీ ట్రేడ్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ కార్నివాల్‌ 

రాష్ట్రంలో ఎగుమతి అవకాశాలు, రంగాలపై చర్చ 

ప్రతిభ చూపిన ఎగుమతిదారులకు సీఎం సత్కారం

సాక్షి, అమరావతి: ఎగుమతులను 2030 నాటికి రెట్టింపు చేసే విధంగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వాణిజ్య ఉత్సవ్‌ పేరుతో విజయవాడలో రెండు రోజులు నిర్వహిస్తున్న ట్రేడ్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ కార్నివాల్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎగుమతుల కార్యాచరణ ప్రణాళికను సీఎం విడుదల చేయనున్నారు. ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్‌పోర్ట్‌ ట్రేడ్‌ పోర్టల్, వైఎస్సార్‌ వన్‌ బిజినెస్‌ అడ్వైజరీ సర్వీసులను కూడా ఆయన ప్రారంభిస్తారు. రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎగుమతిదారులను ముఖ్యమంత్రి సత్కరించనున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్లాస్టిక్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ వాణిజ్య ఉత్సవ్‌ నిర్వహిస్తోంది.

100 మందికిపైగా ఎగుమతిదారులు, రాయబారులు 
కోవిడ్‌ తర్వాత తొలిసారిగా బహిరంగంగా నిర్వహిస్తున్న వాణిజ్య సదస్సు కావడంతో కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో 100 మందికిపైగా ఎగుమతిదారులు, వివిధ దేశాల రాయబారులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా సముద్ర ఉత్పత్తులు, పెట్రో కెమికల్స్, వ్యవసాయం, వైద్య పరికరాల తయారీ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఎగుమతిదారులకు కల్పిస్తున్న అవకాశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సదస్సు సందర్భంగా ఎగుమతిదారులు 20కి పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చివరిరోజున అత్యుత్తమ స్టాల్‌కు అవార్డులు ఇస్తారు. రాష్ట్రస్థాయి సదస్సు ముగిసిన తర్వాత ఈనెల 24 నుంచి 26 మధ్యలో జిల్లాల్లో స్థానిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే విధంగా జిల్లాస్థాయిలో వాణిజ్య ఉత్సవ్‌ సదస్సులు నిర్వహిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top