AP Assembly Session 2022: ఇది గౌరవ సభ.. రౌడీల్లా ప్రవర్తించొద్దు

Speaker Tammineni Sitaram Serious On Behavior Of TDP MLAs - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారలేదు. జంగారెడ్డిగూడెంలో మద్యం మరణాలంటూ అసత్య ఆరోపణలతో సోమవారమూ గందరగోళం సృష్టించారు. వారి నిరసనలు శృతి మించడంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్‌ చేశారు. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు పోడియం చుట్టిముట్టి నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. పది నిమిషాల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, అనగాని సత్యప్రసాద్‌ స్పీకర్‌కు రక్షణగా ఉన్న సిబ్బందిని తోసేశారు.

ఇది సరైన పద్థతి కాదని, వారి స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్‌ హితవు చెప్పారు. అయినా వినకపోవడంతో మార్షల్స్‌ వచ్చి టీడీపీ సభ్యులను వారి స్థానాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వారు వీరంగం సృష్టించారు. ఖాళీ వాటర్‌ బాటిళ్లు, పుస్తకాలతో బల్లలను చరుస్తూ, స్పీకర్‌ను నిందిస్తూ నినాదాలు చేశారు. దీనిపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది గౌరవ శాసన సభ. బజారు కాదు. మీరు వీధి రౌడీలు కారు. ఇలా ప్రవర్తించడం సరికాదు. సభకు, స్పీకర్‌ స్థానానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. సంస్కారం, మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. మత్స్యకారుల సమస్యలు, మహిళా సంక్షేమం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుంటే ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులందరినీ ఒక రోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిన అనంతరం స్పీకర్‌ మాట్లాడుతూ.. ‘ప్రతి రోజూ సభను అడ్డుకోవడమే లక్ష్యంగా వస్తున్నారు. గత వారం రోజులుగా మంచి అంశాలపై చర్చలో పాల్గొనలేకపోయారు. కనీసం గౌరవ సభకైనా గౌరవం ఇవ్వాలిగా. గవర్నర్‌కు, స్పీకర్‌కు, ప్రజలు ఎన్నుకున్న సీఎంకు కూడా గౌరవం ఇవ్వడంలేదు. ఇలాంటి ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాల్సిందే. స్పీకర్‌కు ఉన్న విచక్షణాధికారాలు ఉపయోగించడం చాలా చిన్న పని. కానీ సభను గౌరవంగా నడపాలని చూస్తుంటే అల్లరి మూకలు మాదిరిగా బాటిళ్లు, పుస్తకాలు చించుతూ ఇష్టం వచ్చినట్లు కేకలు వేయడం సహించలేనిది. ఎన్ని రూలింగ్స్‌ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. ఇటువంటి ప్రవర్తన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి సభ్యులు ఎథిక్స్‌ కమిటీకి సూచనలు ఇవ్వాలి’ అని కోరారు. 

చదవండి: ఏపీ ప్రభుత్వ చొరవ.. అమూల్‌ రాకతో పాలకు మంచి ధర

కఠిన చర్యలు తీసుకోండి
టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని, సభ ఔన్నత్యాన్ని కాపాడాలని మంత్రి కన్నబాబు కోరారు. ‘చంద్రబాబు సభను అకారణంగా బాయ్‌కాట్‌ చేసి  ఎక్కడో కూర్చొని సభలో రాజకీయాలు చేస్తున్నారు. బాబులాంటి దిగజారుడు రాజకీయాలు చేసే నాయకుడు ఎవరూ ఉండరు. దుర్మార్గంగా సభా సమయాన్ని అడ్డుకుంటున్నారు. ఎథిక్స్‌ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. టీడీపీ సభ్యులను కంట్రోల్‌ చేయకపోతే సభ ఔన్నత్యం దెబ్బతింటుంది’ అని కన్నబాబు అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ భక్తులు అయ్యప్పమాల వేసుకుంటే ప్రభుత్వం ఆదాయం పడిపోతుందంటూ బహిరంగంగా భాదపడిన వ్యక్తికి లిక్కర్‌ అమ్మకాలపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా కొత్త బ్రాండ్లు, డిస్టలరీలకు అనుమతినిచ్చి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిందని, ఇప్పుడు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top