వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌.. పోలీసులపై వైఎస్‌ జగన్‌ సీరియస్‌ | SP Manikanta Over At YS Jagan Convoy In Bangarupalyam | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌.. పోలీసులపై వైఎస్‌ జగన్‌ సీరియస్‌

Jul 9 2025 12:15 PM | Updated on Jul 9 2025 5:42 PM

SP Manikanta Over At YS Jagan Convoy In Bangarupalyam

సాక్షి, చిత్తూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అభిమానులు, రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు తరలివచ్చారు. వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడి కోసం తరలివచ్చారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈనేపథ్యంలో పోలీసుల ఓవరాక్షన్‌, లాఠీచార్జ్‌పై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బంగారుపాళ్యంలో పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో వైఎస్సార్‌సీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రగిరి యువజన విభాగం కార్యదర్శిపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో అతడి తలకు బలమైన గాయమై.. రక్తస్రావం జరిగింది. ఈ విషయం తెలిసి.. బంగారుపాళ్యం వద్ద కారు దిగేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను కొట్టారని కారు దిగేందుకు వైఎస్‌ జగన్‌కు తెలియడంతో కారును ఆపారు. లాఠీచార్జ్‌లో గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లేందుకు జగన్‌ ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ను కారు దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకుని ఓవరాక్షన్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ కారు దిగకుండా.. అక్కడి నుంచి పంపించేశారు.

దీంతో, చిత్తూరు పోలీసులపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌పై వైఎస్‌ జగన్‌ సీరియస్‌ అయ్యారు. గాయపడిన పార్టీ నేతను పరామర్శించనివ్వరా అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు. 

మరోవైపు.. బంగారుపాళ్యంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు చేస్తూ.. వైఎస్ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతున్నారు. హెలిప్యాడ్ నుండి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా చెక్  పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీల్లో భాగంగా ఒక ఎస్కాట్ వాహనాన్ని కూడా పోలీసులు ఆపేశారు. వైఎస్సార్‌సీపీ నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేశారు. హైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement