
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు సోమవారం నిష్క్రమించనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహరాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కింతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాలుగు రోజుల్లో దేశం నుంచి నైరుతి నిష్క్రమణ పూర్తికానుందని పేర్కొంది.
మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో 1.5 నుంచి 3.1 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.