సోనూ.. నువ్వు సూపర్‌

Sonu Sood Helps Poor Former Family in Chittoor - Sakshi

చిత్తూరు జిల్లా రైతు కష్టానికి చలించిన సోనూసూద్‌

ట్రాక్టర్‌ బహూకరించి దాతృత్వాన్ని చాటుకున్న రియల్‌ హీరో

మదనపల్లె: ప్రముఖ నటుడు సోనూసోద్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తండ్రి వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారి తమవంతు సాయం చేస్తున్న ఇద్దరు కూతుళ్ల వీడియోను చూసి చలించిపోయారు. గంటల వ్యవధిలోనే ఆ కుటుంబానికి రూ. రూ.8 లక్షల విలువైన ట్రాక్టర్, రొటావేటర్‌ను బహూకరించి రియల్‌ లైఫ్‌ హీరో అనిపించుకున్నాడు. (గంటల వ్యవధిలోనే సోనూసూద్‌ సాయం)

అసలు ఏం జరిగిందంటే.. 
మదనపల్లెకు చెందిన పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు పట్టణంలో టిఫిన్‌ హోటల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని స్వగ్రామం పీలేరు నియోజకవర్గం కేవీ పల్లె మండలం మహల్‌ రాజుపల్లె. కరోనా విపత్తు కారణంగా హోటల్‌ వ్యాపారం నిలిచిపోవడంతో స్వగ్రామానికి వెళ్లి వ్యవసాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వర్షాలు పుష్కలంగా కురవడంతో తమ పొలంలో దుక్కులు దున్నేందుకు ఎద్దులు లేకపోవడంపై తన బాధను కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. దీంతో ఇద్దరు కూతుళ్లూ తామే ఆ పనులు చేస్తామన్నారు. దీంతో కాడెద్దుల పాత్రలోకి మారిపోయారు. కుమార్తె సాయంతో పొలాన్ని దున్నారు. దీనిని కొందరు వీడియో తీసి సామాజిక, ప్రసార మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో విపరీతమైన స్పందన లభించింది. దీనిని చూసిన కృష్ణమూర్తి రైతు నాగేశ్వరరావు, కూతుళ్ల సహాయంపై సోనూసూద్‌కు ట్విటర్‌లో ట్యాగ్‌ చేశారు. 

రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ ఇస్తున్న సోనాలికా కంపెనీ ప్రతినిధులు
స్పందించిన సోనూసూద్‌
దీంతో చలించిన సోనూసూద్‌ తానున్నానంటూ వారికి సాయం చేయడానికి ముందుకొచ్చారు. మొదట రేపు ఉదయానికల్లా ఆ కుటుంబానికి రెండు ఎద్దులు ఇవ్వబోతున్నట్లు ట్విటర్‌లో ప్రకటించారు. కాసేపటికే ఆయన మనసు మార్చుకున్నారు. వారికి కావాల్సింది ఎద్దులు కాదు...ట్రాక్టర్‌. అది సోమవారం సాయంత్రానికి వారి పొలంలో ఉంటుంది. ఇకపై ఆ అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకోవచ్చంటూ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆదివారం సాయంత్రం మదనపల్లె నుంచి సోనాలికా కంపెనీకి చెందిన సుమారు రూ.8 లక్షల విలువైన ట్రాక్టర్, రొటావేటర్‌ను ఆ కంపెనీ ప్రతినిధులు తీసుకొచ్చారు.

సోనాలికా కంపెనీ ప్రతినిధి మహమ్మద్‌ ఫయాజ్‌ ట్రాక్టర్‌ను రైతు నాగేశ్వరరావుకు అందజేశారు. వైరల్‌ అయిన వీడియోపై సినీ నటులు సోనూసూద్‌ స్పందించి అండగా నిలవడంపై పేదరైతు నాగేశ్వరరావు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ కష్టం సోనూసూద్‌ను కదిలించడం, తమ కుటుంబంపై ఔదార్యం కనపరచడంపై స్పందిస్తూ జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని, ఆయన పెద్దమనస్సుకు కుటుంబం మొత్తం పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు. తమ కష్టాన్ని మాధ్యమాల్లో ప్రసారం చేసి ట్రాక్టర్‌ వచ్చేందుకు కారణమైన మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందించారు. సోనూసూద్‌ స్పందన స్ఫూర్తిదాయకమని పేర్నొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top