పాణిగ్రహణం.. దేశానికో సంప్రదాయం.. ఐశ్వర్యారాయ్‌ మొదట పెళ్లి చేసుకుంది చెట్టునే.. ఎందుకంటే?

Some of the Strange Traditions in Abroad - Sakshi

ఫ్రెంచ్‌ వివాహంలో వధూవరులకు ‘బౌల్‌’లో పడేసిన ఆహారం 

స్కాట్లాండ్‌లో వధువులను కట్టేసి సాస్, చేపలు, గుడ్లు, పిండి పోసే ఆచారం 

చైనాలో వరుడు వధువును బాణంతో కొట్టడం తప్పనిసరి 

మారిషస్‌లో పెళ్లి కుదిరాక వధువు ఎంత బరువు పెరిగితే అంత ధనవంతులవుతారని నమ్మకం 

కెన్యాలో పెళ్లి రోజున వధువుకు గుండు చేసి గొర్రె కొవ్వుతో రుద్దే పద్ధతి 

స్వీడన్‌లో వరుడిని, వధువుని అబ్బాయిలు, అమ్మాయిలు ముద్దాడే అవకాశం 

ఆచారం ఏదైనా.. సంప్రదాయం ఎలా ఉన్నా బంధాన్ని దృఢంగా మార్చడమే వివాహాల లక్ష్యం

వధువు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం

భారతదేశంలో వివాహం అనేది ఓ పవిత్ర కార్యం. రెండు హృదయాలను ఆలుమగలుగా మలిచే మనోహర ఘట్టం. వధూవరులు జీవితాంతం కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఒకరికొకరు హామీ ఇచ్చుకునే వివాహ సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా బలంగా ఉన్నాయి. వీటిలో కొన్ని పురాతనమైనవి కాగా.. మరికొన్ని ఆధునికమైనవి. కొన్ని తెగల్లో ఇప్పటికీ బహుభార్యత్వం కొనసాగుతోంది. కొన్ని తెగల్లో బహుభర్తృత్వం కూడా ఉంది. కొన్నిచోట్ల వివాహానికి ముందే కాపురం చేసి పిల్లల్ని కూడా కనడం.. ఆ తరువాత నచ్చితే పెళ్లి లేదంటే మరొకరితో సహజీవనం వంటి పద్ధతులూ ఉన్నాయి. కాగా.. విదేశాల్లో అమలులో ఉన్న కొన్ని వింత సంప్రదాయాలివీ...

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ వివాహ సంప్రదాయా­న్నీ, వివాహ వ్యవస్థను గౌరవిస్తుంటారు. అంత గొప్పది మన సంస్కృతి. అయితే జాతకాలను విశ్వసించే మన దేశంలో వధూవరులు పుట్టిన జాతకం (చార్ట్‌ మ్యాచింగ్‌) ఆధారంగా వివాహాలను నిశ్చయిస్తారు. వధువుకు కుజ దోషం ఉంటే.. భర్త చనిపోతాడనే నమ్మకం భారతదేశంలో ఉంది. దీనికి పరిహారంగా అమ్మాయికి చెట్టుతో పెళ్లి చేసి.. ఆ తరువాతే వరుడితో ముడిపెట్టడం ఆచారం.

ఈ ప్రకారమే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ అభిషేక్‌ బచ్చన్‌ను వివాహం చేసుకునే ముందు ఆమె మొదట ఒక చెట్టును వివాహం చేసుకుంది.  ఒకవేళ వధువు ‘మంగ్లిక్‌’ అయితే శపించబడుతుందని నమ్ముతారు. కాగా.. వరుడి పాదరక్షల్ని దొంగిలించే (షూ గేమ్‌) విధానం భారతీయ వివాహ వేడుకల్లో ఒక సరదా. వధువు తరఫున యువతులు వరుడి పాదరక్షల్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. వరుడి సహచరులు వాటిని కాపాడతారు.

ఒకవేళ వధువు సోదరీమణులు పాదరక్షల్ని దొంగిలించడంలో విజయం సాధిస్తే.. వాటిని తిరిగి పొందడానికి వరుడు డబ్బులివ్వాలి. భారతీయ వివాహాల్లో హెన్నాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వధువు చేతికి ఎర్రగా పండే హెన్నా ఆమె భర్త ప్రేమను, ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది. భారతీయ పెళ్లి తంతులో జీలకర్ర, బెల్లం ఒకరి తలపై ఒకరు ఉంచుకోవడం.. వధువు మెడలో వరుడు తాళి కట్టడం అనే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

వధువును విడిపించాలి 
రొమేనియాలో కొన్ని వివాహాల్లో వధువును స్నేహి­తులు, కుటుంబ సభ్యులు దాచడానికి ప్లాన్‌ చేస్తారు. భర్తను బెదిరించడానికి.. వధువును విడిపించడానికి డబ్బు డిమాండ్‌ చేస్తారు. వరుడు ఆ మొత్తం చెల్లిస్తాడు. 

‘టై’ ముక్కల వేలం 
స్పానిష్‌ వివాహ రిసెప్షన్‌ పార్టీలో వరుడి టైని ముక్కలుగా కోయడం కొందరు సంప్రదాయంగా పాటిస్తా­రు. ఆ ముక్కలను వేలం వేస్తారు. వాటిని పాడుకున్న వ్యక్తి ఆ క్షణం నుంచి అదృష్టవంతుడవుతాడని భావిస్తారు.

ముద్దాడాలి మరి 
స్వీడన్‌లో కొన్ని పెళ్లిళ్లలో వధువు గది నుంచి బయటకు వచ్చిన వెంటనే వరుడిని ముద్దాడటానికి ఒంటరి మహిళలు క్యూలో ఉంటారు. వరుడు గదిని వధువు విడి­చిపెట్టినప్పుడు యువకులు ముద్దాడుతారు.

తెల్లటి డ్రెస్‌తో.. 
జపాన్‌లో అయితే.. పెళ్లి రోజున పైనుంచి కింది వరకు వధువు తెల్లటి డ్రెస్‌ ధరిస్తుంది. మహిళలు తెల్లని కిమోనోస్‌ ధరించి.. మేకప్‌ వేసుకుని.. వైట్‌ హుడ్‌ ధరిస్తారు. 

బరువు పెరిగితేనే.. 
పెళ్లికి ముందు అమ్మాయిలు స్లిమ్‌గా, ట్రిమ్‌గా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేయడం సాధారణం. కానీ.. మారిషస్‌లో మాత్రం కొందరు బరువు తగ్గడానికి బదులుగా.. లావు పెరగాలి. వధువు ఎంత లావుగా కనిపిస్తే అంత ధనవంతులుగా కనిపిస్తారని నమ్ముతారు. అలాంటి వారినే వరుడు వరిస్తాడు. 

ఫ్రెంచ్‌ పద్ధతి ఇలా.. 
ఫ్రెంచ్‌ దేశస్తుల్లో కొందరు వివాహ విందులో టాయిలెట్‌ బౌల్‌ నమూ­నా ఏర్పాటు చేస్తారు. బంధుమిత్రులు తాము తినగా మిగిలిన ఆహారాన్ని అందులో పడేస్తే.. వధూవరు­లు ఆ ఆహారాన్నే ఆల్కహాల్‌ కలు­పుకుని విందు భోజనంగా తినాలి. 

గుండుగీసి.. 
కెన్యా దేశస్తుల్లో కాబోయే భార్యను వరుడు ఎంచుకోవడానికి కొందరి కుటుంబ సభ్యులు అంగీకరించరు. అతని కుటుంబమే అన్ని నిర్ణయాలూ తీసుకుంటుంది. పెళ్లి రోజున వధువు జుట్టు పూర్తిగా తీసేసి గుండుగీసి, తలపై గొర్రె కొవ్వుతో రుద్దుతారు. 

స్కాట్లాండ్‌లో ఇదీ పద్ధతి 
కొత్తగా వివాహం చేసుకున్న స్కాటిష్‌ వధువులను బంధువులు కట్టేసే సంప్రదాయం కొందరు పాటిస్తారు. సాస్, చేపలు, గుడ్లు, పిండి మొదలైన వాటిని వారికి పూసి స్నానం చేయిస్తారు. 

శుభ్రం చేయాలి మరి.. 
జర్మనీలో అయితే.. కొన్ని పెళ్లిళ్లలో స్నేహితులకు బ్యాచిలర్‌ పార్టీ ఏర్పాటు చేస్తారు. దీనికి హాజరైన వారు నేలపై పింగాణీ పాత్రల్లో ఉన్న వంటకాలను నాశనం చేసి ప్లేట్లు పగులగొడతారు. వధూవరులిద్దరూ కలిసి దానిని శుభ్రం చేయాలి.

నెలపాటు ఏడవాలి మరి 
వధువును బాణంతో కొట్టడం చైనా వివాహ సంప్రదాయంలో ఒకటి. పెళ్లి కూతుర్ని కొట్టడానికి పెళ్లికొడుకు మూడుసార్లు బాణా­లను ప్రయోగిస్తాడు. పెళ్లిలో కాకున్నా వరుడు జీవితకాలంలో ఒకసారి వధువును ఇలా కొట్టవ­చ్చు. మరో ఆచారం ఇక్కడ ఉంది. పెళ్లి కుదిరిన తరువాత వధువు ఒక నెల పాటు క్రమం తప్పకుండా రోజూ ఓ గంటపాటు ఏడవాలి. మూడు వారాల ముందు ఆమె తల్లి, వారం గ్యాప్‌లో సోదరి, అమ్మమ్మ ఏడుపు మొదలు పెడతారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top