Sakshi News home page

ఎంటెక్‌ చదివి.. టిక్‌టాక్‌తో మొదలెట్టి..

Published Thu, Jun 22 2023 9:32 AM

Social Media Star Prashanth Interview   - Sakshi

అతను ఎంటెక్‌ చదివాడు. ప్రయత్నిస్తే సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి ఉద్యోగమే వచ్చేది. కానీ అందరూ నడిచే దారిలో వెళ్లాలనుకోలేదు. తనకంటూ ప్రత్యేక ‘మార్గం’ ఉండాలని భావించాడు. ఆ మార్గంలో వెళ్లే క్రమంలో మొదట అందరూ హేళన చేశారు. అయినా నిరుత్సాహపడలేదు. ఎంచుకున్న రంగం ఏదైనా పట్టుదల, చిత్తశుద్ధితో కృషి చేస్తే విజయం సాధించవచ్చునని నిరూపించాడు. ఇంటిల్లిపాదీ ఆనందించే వీడియోలను సొంతంగా రూపొందిస్తూ..అందులో తానే నటిస్తూ సోషల్‌ మీడియా స్టార్‌గా ఎదిగాడు. అతనే ప్రశాంత్‌ అలియాస్‌ ప్రసూబేబీ. 

సాక్షి, అనంతపురం డెస్క్‌ : సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తమకున్న నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రశాంత్‌ ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా నటనలో సత్తా చాటుతూ.. అనతికాలంలోనే సోషల్‌ మీడియా సూపర్‌ స్టార్‌గా ఎదిగాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో స్టైలిలుగా కని్పంచే ప్రశాంత్‌ చక్కటి నటన, వైవిధ్యమైన డైలాగ్‌ డెలివరీతో అందరినీ అలరిస్తున్నాడు. ప్రశాంత్‌    అంటే ఎవరూ గుర్తు పట్టరు కానీ..  ‘ప్రసూబేబీ’ అంటే మాత్రం  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా    ఉండే వారు ఇట్టే గుర్తు పట్టేస్తారు.  

ప్రసూబేబీ ( (prashu_baby)) పేరిట ప్రశాంత్‌ ప్రారంభించిన యూట్యూబ్‌ చానల్‌కు ఏకంగా 8.24 మిలియన్ల సబ్‌స్రై్కబర్లు ఉన్నారు. సంస్థలను మినహాయిస్తే వ్యక్తిగత విభాగానికి సంబంధించి  రాష్ట్రంలో హర్షసాయి తర్వాత అత్యధిక  సబ్‌స్రై్కబర్లు ఉన్నది ఈ చానల్‌కే. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటు వీడియోలను రెగ్యులర్‌గా రూపొందించి ఇందులో అప్‌లోడ్‌ చేస్తున్నా  . వీడియో పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి. ప్రశాంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంటుకు కూడా 1.4 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు.  భాషతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల వారు, కువైట్, అమెరికా,సౌదీ తదితర దేశాల ప్రజలు సైతం ప్రశాంత్‌ వీడియోలను వీక్షిస్తున్నారు.  ధరణి, శిశిర, ప్రసూ కాంబినేషన్‌లో వచ్చిన వీడియోలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.  

ఎంటెక్‌ చదివేందుకు అనంతపురం వచ్చిన ప్రశాంత్‌ ఇక్కడి నుంచే సీరియస్‌ ‘యాక్టింగ్‌’ మొదలుపెట్టాడు. నటనపై ఆసక్తి ఉన్న తనలాంటి వారితో కలిసి వీడియోలు రూపొందిస్తున్నాడు. యాక్టింగ్‌ మొదలుకుని స్క్రిప్టు వరకు అన్నీ తానే చూసుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 30 మందికి పైగా తనతో కలసి నటించారు. వారిలో చాలామందికి సొంత యూట్యూబ్‌ చానళ్లు, ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్లు ఏర్పాటు చేయించి..వారూ తగిన ఆదాయం పొందేలా చూస్తున్నాడు. సోషల్‌ మీడియాలో ప్రశాంత్‌ పాపులారిటీని గుర్తించిన పెద్ద పెద్ద సంస్థలు సైతం అతనితో వ్యాపార ప్రకటనలు చేయిస్తున్నాయి. సినిమా ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. ఇటీవలే దసరా, విరూపాక్ష సినిమాలకు ప్రమోషన్‌ చేశాడు. ఓటీటీ, సినిమా ఆఫర్లు సైతం వస్తున్నాయి. పెద్దసంస్థలతో కలసి ఇతర భాషల్లో సోషల్‌ మీడియా వేదికగా వినోదాత్మక వీడియోలు రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. 

ఎంటెక్‌ చదివి.. టిక్‌టాక్‌తో మొదలెట్టి.. 
ప్రశాంత్‌ సొంతూరు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని గారబురుజు గ్రామం. తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారులు కాగా..ప్రశాంత్‌ చిన్నోడు. మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివాడు. జేఎన్‌టీయూ (అనంతపురం)లో ఎంటెక్‌  చేశాడు. ఇంజినీరింగ్‌ చదువుతుండగానే నటనపై ఆసక్తితో చిన్నచిన్న వీడియోలు సొంతంగా రూపొందించి ‘టిక్‌టాక్‌’లో పెట్టేవాడు. ప్రేమ, మానవత్వం, కుటుంబం ఇతివృత్తంగా వీడియోలు రూపొందించేవాడు. అవి బాగా ట్రెండింగ్‌కావడంతో లక్షల్లో సబ్‌స్రై్కబర్లు వచ్చారు.  కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో తన దృష్టిని యూట్యూబ్‌పై మళ్లించాడు.  

ఇష్టపడి పనిచేయడం వల్లే ఈ స్థాయికి.. 
ఏ పనైనా ఇష్టపడి చేయాలని నేను భావిస్తా. నేను ఇలా వీడియోలు చేయడాన్ని మొదట్లో స్నేహితులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తప్పుబట్టారు. కానీ సక్సెస్‌ సాధించి వారితోనే అభినందనలు అందుకున్నా. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, కుటుంబంలో ఉండే సంతోషాలు, సరదాలు, సమస్యలే ఇతివృత్తంగా ఎక్కువ వీడియోలు రూపొందించా. ఇవి భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్‌ అయ్యాయి. ఇదే ఉత్సాహంతో మరింత మంచి కంటెంట్‌ అందివ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా. ముఖ్యంగా వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెడుతున్నా.  – ప్రశాంత్‌   

Advertisement
Advertisement