బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం | A small earthquake in the Bay of Bengal | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం

Aug 25 2021 4:06 AM | Updated on Aug 25 2021 4:06 AM

A small earthquake in the Bay of Bengal - Sakshi

బంగాళాఖాతంలో భూకంప కేంద్రం ఉన్న ప్రాంతం

సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ సిటీ)/చెన్నై: బంగాళాఖాతంలో సముద్రం అడుగు భాగాన స్వల్ప భూకంపం సంభవించింది. కాకినాడకు 296 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం 12.35 గంటలకు సముద్ర గర్భం నుంచి పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం ఏర్పడింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.1గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.

మూడు సెకన్లపాటు స్వల్ప ప్రకంపనలు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో రెండు, మూడు సెకన్లపాటు ప్రకంపనలు వచ్చినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. రాజమహేంద్రవరానికి 312 కిలోమీటర్లు, గుంటూరుకు 339 కి.మీ, తిరుపతికి 386 కి.మీ, చెన్నైకి 320 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం సమీపంలోని ఇళ్లలోని కొన్ని వస్తువులు, ఫ్యాన్లు స్వల్పంగా కదిలాయని స్థానికులు పేర్కొన్నారు. చెన్నైలోని ఆద్యర్, తిరువన్మియూర్, నన్గనల్లూర్‌ పరిసర ప్రాంతాల్లో భూమి రెండు సెకన్లపాటు స్వల్పంగా కంపించినట్లు కొందరు ప్రజలు తెలిపారు.

మయన్మార్‌లో కంపనలకు కొనసాగింపుగా..
తొలుత మంగళవారం ఉదయం మయన్మార్‌లోని సముద్రంలో భూమి కంపించగా, దానికి కొనసాగింపుగా బంగాళాఖాతంలో ఈ ప్రకంపనలు వచ్చినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రకంపనల తీవ్రత స్వల్పంగా ఉండడంతో ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ–ఎన్‌సీఎస్‌) తెలిపింది.

రిక్టర్‌ స్కేలుపై 6 దాటితేనే ప్రభావం..
రిక్టర్‌ స్కేల్‌పై 6 దాటితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ ఎన్‌జీఆర్‌ఐ (నేషనల్‌ జియోగ్రాఫికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌) శాస్త్రవేత్తలు తెలిపారు. ఇండొనేసియా సముద్ర గర్భంలో భూమి కంపించి దాని తీవ్రత 6 దాటితే మన దేశం, రాష్ట్రంపై ప్రభావం ఉంటుందని చెప్పారు. భూకంపం తీవ్రతను బట్టి సునామీ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మామూలుగా బంగాళాఖాతంలో భూకంపాలు రావడం చాలా అరుదని, రిక్టర్‌ స్కేల్‌పై 3లోపు తీవ్రత ఉన్న ప్రకంపనలు అప్పుడప్పుడు వస్తుంటాయన్నారు. అవి సహజం కావడంతో వాటి గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదని ఎన్‌జీఆర్‌ఐ తెలిపింది. కానీ 5.1 తీవ్రతతో ఏపీకి దగ్గరగా రావడం ఇదే మొదటిసారి కావడంతో వాతావరణ శాఖ ముందుజాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేసింది.

కాకినాడకు ముప్పు లేదు
విపత్కర పరిస్థితులు రాకుండా కాకినాడను మడ అడవులు, కోరంగి అభయారణ్యం 80 శాతం కాపాడతాయి. పెరుగుతున్న భూ వాతావరణం, వేడి, గాలి కాలుష్యం తదితర కారణాలతో ఇటువంటి ప్రకంపనలు వస్తున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ఎక్కువ వస్తున్నాయి. కాకినాడకు విపత్తు వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు.
– ప్రొఫెసర్‌ కేవీసీఎస్‌ మురళీకృష్ణ, పర్యావరణవేత్త, జేఎన్టీయూకే ప్రొఫెసర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement