విదేశాల్లోనూ ఉపాధికి ‘స్కిల్‌’ శిక్షణ | 'Skill' training for employment abroad | Sakshi
Sakshi News home page

విదేశాల్లోనూ ఉపాధికి ‘స్కిల్‌’ శిక్షణ

Mar 24 2023 5:16 AM | Updated on Mar 24 2023 5:16 AM

'Skill' training for employment abroad - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర యువత విదేశాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ముందడుగు వేసింది. మిడిల్‌ ఈస్ట్, యూరప్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, అమెరికా తదితర దేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా గురువారం తాడేపల్లిలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ కార్యాలయంలో టీఏకేటీ గ్రూప్‌తో ఏపీఎస్‌ఎస్‌డీసీ, ఏపీఎన్‌ఆర్టీ ఎస్‌ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ సత్యనారాయణ, ఏపీఎన్‌ఆర్టీ ఎస్‌ సీఈవో వెంకట్‌ ఎస్‌ మేడపాటి, టీఏకేటీ గ్రూప్‌ ఎండీ రాజ్‌సింగ్‌ సమక్షంలో పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా వైద్యం, నిర్మాణం, ఆతిథ్య రంగాల్లోని విదేశీ అవకాశాలపై టీఏకేటీ గ్రూప్‌ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తొలి దశలో జర్మనీలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు 15 మంది నర్సింగ్‌ అభ్యర్థులను ఇంటర్వూ్యల ద్వారా ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు.

వీరికి జర్మనీ భాషపై 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. వీసా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్‌లో జర్మనీకి పంపిస్తారు. అలాగే సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు 192 స్కిల్‌ హబ్స్, 26 స్కిల్‌ కాలేజీలు, స్కిల్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement