ఉద్యోగం లేకున్నా 8 గంటలు ఆఫీసుకు వెళ్లినట్లు నటన | Why China Unemployed Maintain a 9 to 5 Routine to Fake Going to Work | Sakshi
Sakshi News home page

ఉద్యోగం లేకున్నా 8 గంటలు ఆఫీసుకు వెళ్లినట్లు నటన

Oct 20 2026 11:00 PM | Updated on Oct 20 2026 11:00 PM

Why China Unemployed Maintain a 9 to 5 Routine to Fake Going to Work

చైనాలో ఉద్యోగాలు కోల్పోయిన కొందరు యువత రోజూ ఉదయం ఉద్యోగానికి వెళ్తున్నట్లు ఇంటి నుంచి బయటకు బయలుదేరుతున్నారు. అయితే వారు వెళ్లేది కార్యాలయాలకు కాదు.. గ్రంథాలయాలు, పార్కులు, కేఫ్‌లు, షాపింగ్‌ మాల్స్‌కు. ఉద్యోగం లేదనే విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా ఉండేందుకు, బంధువుల ప్రశ్నలను తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారు. చైనాలో ఉద్యోగ అవకాశాల కొరత, కుటుంబ ఒత్తిడి, నిరుద్యోగంపై సమాజంలో ఉన్న చిన్నచూపు ఈ కొత్త ధోరణికి కారణాలుగా నిలుస్తున్నాయి.

చైనాలో ఈ విధంగా ఉద్యోగం ఉన్నట్లు నటించే వారి గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఉద్యోగం లేకున్నా రోజువారీ పనివేళలను పాటిస్తూ, ఉదయం ఇంటి నుంచి బయలుదేరి సాయంత్రం తిరిగి వస్తున్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే తమ పరిస్థితిని కుటుంబ సభ్యులకు తెలియకుండా ఉంచుతున్నారు.

కుటుంబ సభ్యులకు తెలియకుండా..
కోకో లీ (32) గతంలో చైనాలోని ప్రభుత్వ రంగ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో పనిచేశారు. అధిక పని భారం, తగిన గుర్తింపు లేకపోవడంతో ఆరు నెలలకు పైగా క్రితమే ఉద్యోగాన్ని వదిలేశారు. అయితే తాను ఉద్యోగం మానేసిన విషయాన్ని కుటుంబానికి చెప్పలేదు. ఇంట్లో తయారు చేసిన భోజనం ఫొటోను కుటుంబ సభ్యుల గ్రూపులో పంచుకోవాలనుకున్నప్పుడు, అది చూసి తల్లి తాను పనికి వెళ్లలేదని ప్రశ్నిస్తారేమోనని వెనక్కి తగ్గారు.

తల్లి ఆందోళన గురించి మాట్లాడుతూ.. “ఆమె అంతులేని ఆందోళనలోకి వెళ్లి, చివరకు ఆ ఆందోళనను నా బుర్రలోకీ ఎక్కిస్తారు” అని లీ తెలిపారు. ఆమె ఆందోళన తన సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నారు. ఈ ధోరణిపై చైనాలోని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెడ్‌నోట్‌లో ఈ అంశానికి సంబంధించిన పోస్టులకు 7 కోట్లకు పైగా వ్యూస్‌ రాగా, చైనాకు చెందిన టిక్‌టాక్‌ తరహా వేదిక డౌయిన్‌లో 61 కోట్ల వ్యూస్‌ నమోదయ్యాయి. వీబోలో సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లకు 32 కోట్ల వరకు వ్యూస్‌ వచ్చాయి.

ఉద్యోగ మార్కెట్‌పై ఆర్థిక ఒత్తిళ్లు
చైనాలో ఉద్యోగాల కోసం పోటీ పెరుగుతోంది. తయారీ రంగంలో తీవ్ర పోటీ కారణంగా కొన్ని సంస్థలు ధరలను తగ్గించడంతోపాటు ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంక్షోభం, స్థానిక ప్రభుత్వాల ఆర్థిక ఇబ్బందులు, కృత్రిమ మేధ వినియోగం పెరగడం కూడా ఉపాధిపై ప్రభావం చూపుతున్నాయి.

సుసాన్‌ సన్‌ (28) గత ఏడాది చివర్లో ఇంటర్నెట్‌ సంస్థలో ఉద్యోగం కోల్పోయినా ఆ విషయాన్ని కుటుంబానికి చెప్పలేదు. మే నెలలో తల్లి, సవతి తండ్రి చోంగ్‌కింగ్‌ నగరానికి వచ్చి ఆమెతో కలిసి ఉండటంతో రోజూ ఉదయం 9 గంటలలోపు ఇంటి నుంచి బయలుదేరి, సాయంత్రం 6 గంటల తర్వాత తిరిగి రావాల్సి వస్తోంది. ఆమెకు నెలకు 1,864 యువాన్ల నిరుద్యోగ భృతి అందుతోంది. ఉద్యోగం లేకపోవడం కంటే తన ఆర్థిక పరిస్థితిపై తల్లిదండ్రుల ఆందోళనే ఎక్కువ ఒత్తిడికి గురిచేస్తోందని ఆమె తెలిపారు.

కార్నెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన చైనా రాజకీయాల అధ్యాపకురాలు డయానా ఫు అభిప్రాయం ప్రకారం, ఉద్యోగం ఉన్నట్లు నటించడం వల్ల నిరుద్యోగులు సామాజికంగా ఎదురయ్యే ఇబ్బందులను తప్పించుకోవచ్చు. అదే సమయంలో సామాజిక అసంతృప్తి పెరగకుండా ఉండేందుకు కూడా ఇది దోహదపడవచ్చు.

అయితే, బఫెలో విశ్వవిద్యాలయానికి చెందిన సామాజిక శాస్త్ర అధ్యాపకురాలు యిగే డాంగ్‌ చైనాలో నిరుద్యోగులకు అందుబాటులో ఉన్న సామాజిక భద్రతా వ్యవస్థ జపాన్‌, దక్షిణ కొరియాలతో పోలిస్తే పరిమితంగా ఉందని పేర్కొన్నారు. నిరుద్యోగాన్ని దాచిపెట్టడం తాత్కాలికంగా కుటుంబ ఒత్తిడిని తగ్గించినా, ఆదాయం తగ్గిన కొద్దీ ఈ నటనను కొనసాగించడం కష్టమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement