
వ్యవసాయ యంత్ర పరికరాల కాంట్రాక్టులో భారీ అవినీతికి స్కెచ్
రేట్లు పెంచి రూ.కోట్ల కమీషన్ల వసూలుకు పన్నాగం
కంపెనీతో డీల్ కుదర్చమని ఆగ్రోస్ జీఎంపై మంత్రి ఒత్తిడి
ఈ పని చేయలేనంటూ ప్రభుత్వానికి లేఖరాసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన జీఎం
చర్చనీయాంశంగా మారిన మంత్రి అవినీతి బాగోతం
సాక్షి, అమరావతి: ఆయన వ్యవసాయశాఖ మంత్రి. విత్తనాలతోనే కాదు.. యంత్రాలతో సిరుల పంట పండించుకోవాలని రంగం సిద్ధం చేశారు. ఈ పంట పండించాలన్న ఒత్తిడి తట్టుకోలేక ఒక అధికారి ఈ బండారాన్ని బయటపెట్టారు. దీంతో మంత్రి, ఆయన ఓఎస్డీ తేలుకుట్టిన దొంగల్లా మారారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీ కేంద్రంగా అవినీతి యథేచ్చగా సాగుతోంది. మంత్రి అచ్చెన్న అవినీతికి వత్తాసు పలకలేక, వేధింపులు తట్టుకోలేక రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆగ్రోస్) జనరల్ మేనేజర్ (జీఎం) మునెల్లి చంద్రరాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు.
వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని కామధేనువుగా మార్చుకుని భారీ దోపిడీకి తెగబడుతున్నారని ఆయన స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. యంత్ర పరికరాల తయారీ కంపెనీతో డీల్ కుదర్చమని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారని ఆయన ఓఎస్డీ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి వేధించారని ఆయన ఆ లేఖలో వివరించారు. అచ్చెన్నాయుడి అవినీతి బాగోతంలో తాజా వ్యవహారం ఇది.
రూ.240 కోట్ల కాంట్రాక్టులో అడ్డగోలు అవినీతికి స్కెచ్
ఆగ్రోస్ ఆధ్వర్యంలో గత ఏడాది రూ.60.14 కోట్ల సబ్సిడీతో 25 వేల పరికరాలు పంపిణీ చేయగా.. 2025–26లో రూ.240 కోట్ల విలువైన కిసాన్ డ్రోన్లతోపాటు యంత్ర పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కొనుగోలులో కమీషన్ల పేరిట సొమ్ము చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు స్కెచ్ వేశారు. ఆ బాధ్యతను తన ఓఎస్డీ పోలినాయుడుకు అప్పగించారు. రంగంలోకి దిగిన పోలినాయుడు ఆగ్రోస్ జీఎం రాజమోహన్‌ను సంప్రదించారు. యంత్రపరికరాల కంపెనీలతో మాట్లాడి భారీ కమీషన్లు వసూలు చేయాలని చెప్పారు.
అందుకు సమ్మతించిన కంపెనీలకే కాంట్రాక్టు కట్టబెట్టాలని మంత్రి అచ్చెన్న ఆదేశించారని కూడా స్పష్టం చేశారు. భారీ కమీషన్ల డిమాండ్‌తో యంత్ర పరికరాల కంపెనీలు వెనుకంజ వేశాయి. దీంతో కమీషన్ల వ్యవహారం తేల్చకుండా కాలయాపన చేస్తున్నారంటూ ఓఎస్డీ పోలినాయుడు రెండు, మూడుసార్లు జీఎం రాజమోహన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్న పేరుతో ఓఎస్డీ వేధింపుల్ని తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు.
వెళ్లేముందు మంత్రి అచ్చెన్న, ఆయన ఓఎస్డీ తనను ఏవిధంగా వేధించింది, కమీషన్ల కోసం ఎంతగా ఒత్తిడి తెచ్చింది వివరిస్తూ ఆగ్రోస్ చైర్మన్ ఎం.సుబ్బనాయుడు, ఎండీ ఢిల్లీరావు, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌లకు లేఖ రాశారు. ఆ లేఖ కాపీనీ సీఎం కార్యాలయానికి కూడా పంపారు. ఈ లేఖ మీడియాకు లీక్ కావడంతో మంత్రి అచ్చెన్నాయుడి అవినీతి బండారం బట్టబయలైంది. మీడియాలో వైరల్ అయిన ఈ లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పరికరాల ధరలు పెంచి..
గత ఏడాది రూ.60.19 కోట్ల యంత్రపరికరాల కాంట్రాక్టులోనూ చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకోసం యంత్ర పరికరాల ధరలను భారీగా పెంచింది. గత ప్రభుత్వం రోటోవేటర్‌ను రూ.90వేల నుంచి రూ.లక్ష మధ్య కొనుగోలు చేసింది. ప్రస్తుతం అదే రోటోవేటర్‌కు రూ.1.45 లక్షల ధర నిర్ణయించారు. ఇదొక్కటే కాదు.. 2024–25 సీజన్‌లో పంపిణీచేసిన యంత్రపరికరాల ధరలన్నీ మార్కెట్ ధరల కంటే ఎక్కువ రేటు కోట్‌చేసి అవినీతికి పాల్పడ్డారు. తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన నెప్ట్యూన్ బ్యాటరీ స్ప్రేయర్ తయారీ సంస్థను సింగిల్ టెండర్ విధానంలోఎంపిక చేయడమే మంత్రి అచ్చెన్న దోపిడీకి నిదర్శనం.
ట్రాక్టర్ల కొనుగోలులో ఎల్–1 టెండర్ ప్రక్రియను పాటించకుండా బాక్స్ టెండర్ పద్ధతిని అనుసరించడం, కేవలం రూ.10 లక్షల గ్యారంటీ ఉన్న కంపెనీలకు ఏకంగా రూ.23 కోట్ల వరకు అడ్వాన్సులు చెల్లించడం, డిస్‌క్వాలిఫై అయిన ఓ ట్రాక్టర్ల కంపెనీని ఎంప్యానెల్ జాబితాలో చేర్చడం వంటి వాటితో అవినీతికి రంగం సిద్ధం చేశారు. ఆ అవినీతికి వత్తాసు పలకలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఆగ్రోస్ జీఎం స్థానంలో తమకు విధేయుడైన ఓ జూనియర్ అధికారిని నియమించి అవినీతి దందా సాగించేందుకు మంత్రి అచ్చెన్న సిద్ధపడుతున్నట్టు చెబుతున్నారు.