‘సిట్‌’ తీరు మోసపూరితం | SIT investigating illegal liquor policy case | Sakshi
Sakshi News home page

‘సిట్‌’ తీరు మోసపూరితం

Sep 25 2025 5:47 AM | Updated on Sep 25 2025 5:47 AM

SIT investigating illegal liquor policy case

కోర్టును వంచిస్తూ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోంది

తప్పులు చేసిన సిట్‌.. ఏసీబీ కోర్టుపై నెపం వేస్తోంది

ఇప్పటి వరకు దర్యాప్తులో నిర్దిష్ట ఆధారాలు సేకరించలేదు

అందుకే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టుల గురించి ప్రస్తావిస్తోంది

ప్రతీసారి ఉద్దేశపూర్వకంగానే 89వ రోజునే చార్జిషీట్లు దాఖలు చేస్తూ వస్తోంది

నిందితులను బయటకు రాకుండా చేయడమే సిట్‌ ఉద్దేశం

రాజ్యాంగం ప్రకారం అన్నింటికన్నా వ్యక్తిగత స్వేచ్ఛే సర్వోత్కృష్టమైంది

ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం పలు తీర్పుల్లో చెప్పింది

సిట్‌ నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తోంది

డీఫాల్ట్‌ బెయిల్‌ రద్దు కోసం సిట్‌ వేసిన పిటిషన్లు కొట్టేయండి

హైకోర్టుకు నివేదించిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి

సందేహాల నివృత్తి కోసం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా 

సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో దర్యాప్తు చేస్తున్న ‘సిట్‌’.. సాక్షాత్తూ కోర్టు పట్ల మోసపూరితంగా వ్యవహరించిందని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కాల్వ ధనుంజయరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన సిట్‌ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలోనూ ఇలా అసాధారణంగా వ్యవహరించలేద­న్నారు. చార్జిషీట్‌లో పలు లోపాలను ప్రస్తావిస్తూ, వాటిని సరిదిద్దాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించినా సిట్‌ ఆ పని చేయకుండా తప్పును కోర్టుపై నెట్టేస్తోందని నివేదించారు. 

ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో నిందితుల పాత్రపై నిర్దిష్ట ఆధారాలు సేకరించలేకపోయిన సిట్, ఇప్పుడు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టుల గురించి చెబుతూ బెయిల్‌ను అడ్డుకుంటోందన్నారు. చట్ట ప్రకారం 90 రోజుల్లోపు చార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో బెయిల్‌ పొందేందుకు నిందితులకు అవకాశం ఉంటుందన్నారు. అయితే సిట్‌ ఉద్దేశపూర్వకంగా ప్రతిసారీ 89వ రోజునే చార్జిషీట్లు దాఖలు చేస్తోందని తెలిపారు. 

దర్యాప్తు పూర్తి కానప్పటికీ నిందితుల బెయిల్‌ను అడ్డుకునేందుకే ఇలా చేస్తూ వస్తోందని కోర్టుకు నివేదించారు. ఒకే కేసులో వేర్వేరుగా, ఎంపిక చేసుకున్న విధంగా, కావాల్సిన సమయంలో చార్జిషీట్లు దాఖలు చేస్తూ వస్తోందన్నారు. ఏ ఒక్కరూ బెయిల్‌పై బయటకు రాకుండా చేసేందుకే సిట్‌ ఇలా అనుచితంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 

ఆధారాల్లేకపోయినా జైల్లోనే ఉంచాలని చూస్తోంది...
నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛే కోర్టుల పరమావధి అవుతుందని నిరంజన్‌రెడ్డి వివరించారు. దర్యాప్తు సంస్థలు దర్యాప్తును నిరాటంకంగా కొనసాగించుకోవచ్చునని, అయితే దర్యాప్తు పూర్తయ్యేంత వరకు నిందితులను జైల్లోనే ఉంచాలని కోరడానికి వీల్లేదన్నారు. సిట్‌ ప్రస్తుత కేసులో నిందితులను జైల్లోనే ఉంచాలన్న దురుద్దేశంతో వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటి వరకు కేవలం 16 మందిపై మాత్రమే చార్జిషీట్‌ దాఖలు చేసిందని తెలిపారు. దర్యాప్తులో కొత్తగా తేల్చేది ఏమీ లేకపోయినా, ఆధారాలు ఏమీ లేకపోయినా మిగిలిన నింది­తులకు బెయిల్‌ రాకుండా చేసేందుకు పలు చార్జి­షీట్లు దాఖలు చేస్తోందన్నారు. 

సిట్‌ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందన్నారు. సాంకే­తిక కోణంలో ఈ కేసును చూడరాదని నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ధనుంజయరెడ్డికి ఏసీబీ కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. అనంతరం సిట్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, దర్యాప్తు పూర్తయినంత వరకు ఆ వివరాలతో చార్జిషీట్లు దాఖలు చేస్తూ వస్తున్నా­మన్నారు. 

తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సందేహాల నివృత్తి నిమిత్తం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రోజున తీర్పు రిజర్వ్‌ చేసే అవకాశం ఉంది. 

అన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే డీఫాల్ట్‌ బెయిల్‌...
వాస్తవానికి ఏసీబీ ప్రత్యేక కోర్టు తమ ముందున్న అన్ని ఆధారాలను పరిగణనæలోకి తీసుకున్నాకే ధనుంజయరెడ్డి తదితరులకు డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసిందన్నారు. డీఫాల్ట్‌ బెయిల్‌ను ఎందుకు మంజూరు చేస్తుందో కూడా చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. ఈ కేసులో వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ ముడిపడి ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్నింటి కంటే వ్యక్తిగత స్వేచ్ఛే సర్వోత్కృష్టమైందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా సిట్‌ వ్యవహరిస్తోందని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛను పణంగా పెట్టడానికి రాజ్యాంగం అంగీకరించదన్నారు. 

వ్యక్తిగత స్వేచ్ఛకున్న ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసినప్పుడు పోలీసులు 24 గంటలకు మించి తమ కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదని, నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలగరాదన్నదే చట్టం ఉద్దేశమ­న్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు న్యాయస్థానాలు పరిరక్షకులుగా ఉంటాయన్నారు. పోలీసు కస్టడీ ముగిసిన వెంటనే నిందితుడు బెయిల్‌ కోసం దాఖలు చేసుకోవచ్చునని, అయితే దర్యాప్తు పెండింగ్‌లో ఉంటే కోర్టులు సహ­జంగా బెయిల్‌ను తిరస్కరిస్తుంటాయన్నా­రు.

 దర్యాప్తు పేరుతో నిందితులను అలా జైల్లోనే ఉంచేస్తామంటే కుదరదని, అందుకే చట్టం 60, 90 రోజుల గడువును విధించిందని నివేదించారు. ఈ గడువులోపు చార్జిషీట్‌ దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. చార్జిషీట్‌ దాఖలు చేసిన తరువాత నిందితులను జైల్లో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం ఉండదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement