బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌ సంగతి తేలుస్తాం | SIT arrests Balaji Govindappa | Sakshi
Sakshi News home page

బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌ సంగతి తేలుస్తాం

May 14 2025 5:02 AM | Updated on May 14 2025 7:57 AM

SIT arrests Balaji Govindappa

మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోంది..

ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చొద్దు

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘సుప్రీం’ ఘాటు వ్యాఖ్యలు

గోవిందప్ప అరెస్ట్‌ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నిరర్థకమన్న 

రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై అసహనం

మద్యంపై అక్రమ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణ్ణమోహన్‌రెడ్డిలకు ఊరట

శుక్రవారం వరకు వారిని అరెస్ట్‌ చేయవద్దని ఏసీబీకి ఆదేశం

కేసు దర్యాప్తునకు సహకరించాలన్న న్యాయస్థానం

గోవిందప్ప ముందస్తు బెయిల్‌పై సుప్రీం విచారణ జరుపుతోందని తెలిసి కూడా అరెస్ట్‌ చేశారు 

దర్యాప్తు సంస్థ తీరును ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలన్న గోవిందప్ప న్యాయవాది సిద్ధార్థ దవే

సాక్షి, అమరావతి: మద్యం కేసులో వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గోవిందప్ప ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణలో ఉండగానే ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈమేరకు స్పందించింది. గోవిందప్ప అరెస్ట్‌ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నిరర్థకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధా్దర్థ అగర్వాల్‌ వాదనలు వినిపిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌ అయ్యారని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నిరర్థకమవుతుందని పేర్కొన్నారు. దీనిపై న్యాయ­స్థానం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని మరింత మురి­కిగా మార్చవద్దంటూ హితవు పలికింది. కాగా అగ­ర్వాల్‌ వాదనను బాలాజీ గోవిందప్ప తరఫు న్యాయ­వాది సిద్ధా్దర్థ దవే తీవ్రంగా వ్యతిరేకించారు. తమ వ్యాజ్యం నిరర్థకం కాదన్నారు. గోవిందప్ప అరెస్ట్‌ అక్రమమని నిరూపిస్తామన్నారు. గోవిందప్ప ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని తెలిసి కూడా అరెస్ట్‌ చేశారన్నారు. దర్యాప్తు సంస్థ తీరును ఈ కోర్టు పరిగణలోకి తీసుకో­వాలని అభ్యర్థించారు.

      సిద్ధార్థ దవే

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌ సంగతి కూడా తదుపరి విచారణ సమయంలో తేలుస్తామని ప్రకటించింది. అయితే మీరు (సుప్రీంకోర్టు) ఇలాంటి అభి­ప్రా­యం వ్యక్తం చేస్తే కింది కోర్టులో బాలాజీ గోవిందప్ప.. ఏసీబీ రిమాండ్‌ రిపోర్ట్‌ను వ్యతిరేకిస్తారని సిద్ధా్దర్థ అగర్వాల్‌ పేర్కొన్నారు. అరెస్ట్‌ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి రిమాండ్‌కు ఇవ్వవద్దని అడుగుతారన్నారు. అగర్వాల్‌ వాదనపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మీరు మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. 

ఇద్దరికీ ఊరట..
ఇదే సమయంలో కె.ధనుంజయరెడ్డి, కృష్ణ­మోహన్‌రెడ్డిలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. తదుపరి విచారణ వరకు వీరిద్దరిని అరెస్టు చేయరాదని ఏసీబీని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని వారిద్దరినీ ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అదే రోజు గోవిందప్ప అరెస్ట్‌తో సహా అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రకటించింది.

ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జంషేడ్‌ బుర్జోర్‌ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహ­దేవన్‌లతో కూడిన ధర్మా­సనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలతో పాటు భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఏసీబీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరుకి సైతం నిరాకరించింది. ఈ నేపథ్యంలో వారు ముగ్గురూ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థించారు.

సమావేశాల్లో పాల్గొంటే నిందితుడిని చేసేస్తారా...?
ధనుంజయరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది వికాశ్‌సింగ్, కృష్ణమోహన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. హైకోర్టు కనీస స్థాయిలో కూడా తమ వాదనలు వినలేదని వికాశ్‌ సింగ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తమకు హైకోర్టు అవకాశం ఇచ్చి ఉంటే పిటిషనర్లపై ఏసీబీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని నిరూపించేవారిమన్నారు.

కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రాన నిందితునిగా చేర్చడం సరికాదన్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో ఇదే సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రాన నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని ఆ తీర్పులో పేర్కొన్నారని వికాశ్‌ సింగ్‌ నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రముఖ మద్యం తయారీ కంపెనీలను పక్కకు నెట్టేసి ఎవరికీ తెలియని కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేశారన్నారు. 

బాలాజీ గోవిందప్ప అక్రమ అరెస్టు
కర్ణాటకలో అదుపులోకి తీసుకున్న సిట్‌ అధికారులు 
ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తరలింపు
సాక్షి,అమరావతి: వికాట్‌ గ్రూప్‌ భారత దేశ వ్యవహారాల డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్‌ అధికారులు కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా యలందూర్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. ప్రకృతి వైద్యం చేయించుకుంటున్న గోవిందప్పను అదుపులోకి తీసుకుని అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడ తీసుకొస్తున్నారు. బుధవారం ఉదయం విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తారని తెలుస్తోంది. అనంతరం బాలాజీ గోవిందప్పను న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశాలున్నాయి. 

హైదరాబాద్‌లో సోదాల పేరుతో వేధింపులు 
కేసు దర్యాప్తు పేరిట హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నివాసాల్లో సోదాల పేరిట సిట్‌ అధికారులు హల్‌చల్‌ సృష్టించి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. సిట్‌ బృందాలు హైదరాబాద్‌లో బాలాజీ గోవిందప్ప నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను హడలెత్తించారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలకు ప్రశ్నలతో వేధించారు.

ఇంట్లో పత్రాల తనిఖీ పేరిట మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు హల్‌చల్‌ చేశారు. కృష్ణమోహన్‌రెడ్డి నివాసంలోనూ సిట్‌ అధికారులు సోదాల పేరిట వేధింపులకు పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి దాటేవరకు సోదాలు చేస్తూనే ఉన్నారు. మరో ప్రాంతంలో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డిని పిలిపించి మరీ ఆయనకు సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ధనుంజయ్‌రెడ్డి నివాసంలోనూ సోదాల పేరిట సిట్‌ అధికారులు అదే రీతిలో బెదిరింపులకు పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement