
బాధితుడు బాలకృష్ణారెడ్డికి పెండ్లిమర్రి ఎస్‌ఐ వేధింపులు
పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి ఎన్‌కౌంటర్ చేస్తానంటూ బెదిరింపులు
పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు సిద్ధమవుతున్న బాధితుడి భార్య, బంధువులు
హైకోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయని ఎస్సై మధుసూదన్‌రెడ్డి
వైఎస్సార్: ‘నా మీద హైకోర్టులో పిటిషన్ వేస్తావా.. నీ అంతు చూస్తా.. నిన్ను ఎన్ కౌంటర్ చేస్తా.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు..నీ మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తా.. నిన్ను సబ్ జైలుకు పంపించేంతవరకూ నేను నిద్రపోను‘ అంటూ పెండ్లిమర్రి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తనదైన శైలిలో ఫిర్యాదుదారుడిపై విరుచుకుపడ్డాడు. మంగళవారం సాయంత్రం పెండ్రిమర్రి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేయడంతో ఈ సంఘటన కలకలం సష్టించింది.
వ్యక్తిగతంగా, శారీరకంగా మానసిక వేదనకు గురిచేయడంతో అతడి భార్య, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మండలంలోని రాళ్లపల్లి గ్రామానికి చెందిన బాలకష్ణారెడ్డిని మంగళవారం మధ్యాహ్నం సమయంలో నీ మీద కేసులు ఉన్నాయి.. మీకు నోటీసు ఇవ్వాలి.. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి స్టేషన్‌కు రమ్మంటున్నారు అంటూ హెడ్‌కానిస్టేబుల్ పుల్లారెడ్డి వచ్చి తీసుకెళ్లారు. ఎస్సై మధుసూదన్‌రెడ్డి అప్పటి నుంచి స్టేషన్‌కు వచ్చిన బాలకృష్ణారెడ్డిని నిర్బంధించారు.
తనకు నోటీసులు ఇవ్వమని బాలకృష్ణారెడ్డి అడిగారు. వెంటనే ఎస్‌ఐ కోపోద్రిక్తుడై నీకు ఎందిరా నోటీసులు ఇచ్చేది. ఇప్పుడే నీ మీద గంజాయి, సారాయి స్మగ్లింగ్ తప్పుడు కేసులు పెట్టి నిన్ను సబ్ జైల్లో పెట్టేంత వరకూ నేను నిద్రపోను అంటూ బెదిరించడంతో బాలకృష్ణారెడ్డి పరిస్థితి అయోమయంగా మారింది. తప్పుడు సమాచారం.. నోటీసుల నెపంతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఎస్సై ప్రవర్తించేలా కాకుండా రౌడీ తరహాలో ఎస్సై మధుసూదన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పోలీసు వ్యవస్థకే కళంకం తెస్తోందని బాలకష్ణారెడ్డి భార్య లక్ష్మీదేవి కన్నీటి పర్యంతమయ్యారు.
తమ కుటుంబంలో చిన్నపాటి ఆస్తుల వివాదాలకు సంబంధించి ఎస్సై మధుసూదన్ రెడ్డి స్టేషన్లో వేసి పోలీసు కోటింగ్ ఇవ్వడానికి ప్రయతి్నంచగా బాలకష్ణారెడ్డిని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బాలకష్ణారెడ్డి కుటుంబ ఆస్తుల వివాదం విషయంలో ఎస్సై జోక్యం చేసుకోవద్దని ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ ఎస్సై మధుసూదన్ రెడ్డి తన తీరు మార్చుకోకపోగా, హైకోర్టుకు వెళ్లాడనే ఉద్దేశంతో బాలకష్ణారెడ్డిని మంగళవారం మధ్యాహ్నం సమయంలో నోటీసుల నెపంతో స్టేషన్‌కు రప్పించారు. అనంతరం అక్కడే ఎస్సై మధుసూదన్ రెడ్డి నిర్బంధించడం ఎంతవరకు న్యాయమో జిల్లా ఉన్నతాధికారులే నిర్ణయించాలని బాధితుడి బంధువులు కోరుతున్నారు.
అక్రమ నిర్బంధంపై ఎస్పీ కి ఫిర్యాదు
పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్‌లో బాలకష్ణారెడ్డిని ఎస్సై మధుసూదన్ రెడ్డి అక్రమంగా నిర్బంధించిన విషయమై బాధితులు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారించి తాను తగిన చర్యలు తీసుకుంటానని ఎస్పీ వివరించినట్లు సమాచారం.