‘తేనె’తుట్టెను కదిలించిన ఓటీపీ | Shocking facts in the honeytrap case | Sakshi
Sakshi News home page

‘తేనె’తుట్టెను కదిలించిన ఓటీపీ

Oct 8 2026 4:52 AM | Updated on Oct 8 2026 4:54 AM

Shocking facts in the honeytrap case

హనీట్రాప్‌ కేసులో విస్తుగొల్పుతున్న వాస్తవాలు 

పాక్‌ ఏజెంట్ల చేతుల్లోనే ప్రదీప్‌ ముఖర్జీ వాట్సాప్‌ ఖాతాలు 

హనీట్రాప్‌ చేసిన మహిళకు వాట్సాప్‌ లాగిన్‌ ఓటీపీ పంపించిన ముఖర్జీ  

తనిఖీల్లో వాట్సాప్‌ లాగిన్‌ పాక్‌లో ఉన్నట్లు గుర్తించిన నిఘా బృందాలు 

హనీట్రాప్‌ బెదిరింపులతో పాక్‌కు స్పైగా వ్యవహరించిన నిందితులు  

ప్రదీప్‌ ల్యాప్‌టాప్, మొబైల్‌ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌  

సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం (ఈఎన్‌సీ) విశాఖపట్నం కేంద్రంగా మొదలైన హనీట్రాప్‌ కేసు తీగలాగితే.. దేశవ్యాప్తంగా లింకుల డొంక కదులుతోంది. ఆపరేషన్‌ ఫైర్‌వాల్‌ పేరుతో ఈ భారీ స్పై నెట్‌వర్క్‌ని ఛేదించిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌.. ఈ కేసుని మరింత లోతుగా విచారిస్తోంది. నేవీ బేస్‌గా సాగిన ఈ హనీట్రాప్‌ నెట్‌వర్క్‌ని కేవలం ఒకే ఒక్క ఓటీపీ పట్టించినట్లు తెలుస్తోంది. అందమైన యువతుల పేరుతో పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్లు నేవీ సెయిలర్‌ ప్రదీప్‌ ముఖర్జీకి వల వేశారు. 

హనీట్రాప్‌లో పడిన ప్రదీప్‌ తొలుత తన పేరుతో సిమ్‌కార్డులు తీసుకున్నారు. ఆ నంబర్ల వాట్సాప్‌ ఖాతాలు సదరు పాక్‌ ఏజెంట్లు హ్యాండిల్‌ చేసేవారు. అందులోనే సమాచారమార్పిడి జరగగా.. చివరికి ప్రదీప్‌ పర్సనల్‌ నంబర్‌ వాట్సాప్‌ని కూడా తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఇదే సమయంలో పాక్‌ ఏజెంట్ల ఒత్తిడితో.. ప్రదీప్‌ తన నంబర్‌ లాగిన్‌ కోసం వచ్చిన ఓటీపీని వారికి షేర్‌ చేశారు. అప్పటి నుంచి ప్రదీప్‌ వాట్సాప్‌ ఖాతా పాక్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. సాధారణ భద్రత తనిఖీల్లో ప్రదీప్‌ నంబరు పాక్‌లో లాగిన్‌ అయినట్లు గుర్తించిన అధికారులు.. దీనిపై సెపె్టంబర్‌ 2వ తేదీ నుంచి ఆరా తీశారు. వాట్సాప్‌ ఓటీపీ పాక్‌కు షేర్‌ చేసినట్లు గుర్తించి.. నిఘా కట్టుదిట్టం చేయడంతో భారీ హనీట్రాప్‌ కుట్ర బట్టబయలైనట్లు సమాచారం.  

పాక్‌కు స్పైగా వ్యవహరించిన నిందితులు  
భారత్‌లోని కొందరు వ్యక్తులు నేరుగా పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనే పక్కా సమాచారం సేకరించిన ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌.. ఆపరేషన్‌ ఫైర్‌వాల్‌కు శ్రీకారం చుట్టింది. ఈ గూఢచర్య మాడ్యూల్‌లోని 18 మంది అనుమానితుల్లో 13 మంది నౌకాదళ సిబ్బంది అని గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌ మూలాలను ఛేదించేందుకు ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో విస్తృత ఆపరేషన్‌ నిర్వహించారు. 

వాస్తవానికి ప్రదీప్‌ని ముందుగా అరెస్ట్‌ చేయలేదని, నేవీలో కాంట్రాక్ట్‌ డ్రైవర్‌ సాయివరప్రసాద్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు బండారం బయటపడిందని నిఘావర్గాల సమాచారం. సాయివరప్రసాద్‌ తరచు ప్రదీప్‌తో మాట్లాడుతున్న కాల్‌ రికార్డులు సేకరించి.. వలపన్ని పట్టుకున్నారు. ఈ హనీట్రాప్‌లో చిక్కుకున్న నేవీ బృందమంతా.. పాక్‌కు స్పైటీమ్‌గా వ్యవహరించినట్లు గుర్తించారు.  

అసోంలో మరో ఇద్దరు 
ఇదిలా ఉండగా.. పాక్‌ స్పై నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనా దర్యాప్తుసంస్థలు దృష్టి సారించాయి. పాక్‌ ఏజెంట్లకు బ్యాంకు ఖాతాలు అందించి, నిధులు సమకూర్చారనే ఆరోపణలతో అసోంలో ఇద్దరు వ్యక్తులను భద్రతాసంస్థలు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌కు నేవీలో జరిగిన హనీట్రాప్‌ గ్యాంగ్‌ కేసుకి ఆర్థిక సంబంధాలున్నాయా? రెండు కేసులకు ఎలాంటి సంబంధాలున్నాయనే దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు.  

ఎన్‌ఐఏ చేతికి కేసు 
ఈ కేసుకు అంతర్‌రాష్ట్ర, అంతర్జాతీయ లింకులు బలంగా ఉండటంతోపాటు దేశరక్షణకు సంబంధించిన వ్యూహాత్మక రహస్యాలు లీక్‌ కావడంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాథమిక విచారణ అనంతరం ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించేందుకు కేంద్ర హోంశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రదీప్‌ వాడిన ల్యాప్‌టాప్, మొబైల్‌ ఫోన్లని అధికారులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కి పంపించినట్లు సమాచారం. 

పాక్‌ హ్యాండ్లర్లతో చేసిన చాటింగ్‌ వివరాలు, డిలీట్‌ చేసిన ఫైళ్లని రికవరీ చేస్తున్నట్లు తెలిసింది. పాక్‌ ఏజెంట్లు వాడిన నకిలీ సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ ఏ దేశపు ఐపీ అడ్రస్‌ల ద్వారా ఆపరేట్‌ అయ్యాయో ట్రేస్‌చేసే పనిలో నిఘావర్గాలు నిమగ్నమయ్యాయి. మిగిలిన అనుమానితుల పాత్రపైనా విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 18 మందిని అదుపులోకి తీసుకున్న నిఘా బృందాలు.. గురువారం వివిధ ప్రాంతాలకు చెందిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement