నిందితుల మధ్య లావాదేవీలన్నీ ఈ తరహాలోనే విచారణలో వెల్లడవుతున్న నిజాలు
ప్రదీప్ ముఖర్జీ, వరప్రసాద్ మధ్య క్రిప్టో వ్యవహారాల వివరాలు వెల్లడి
ఈ కేసుతో మరో 10 మందికి సంబంధం ఉందన్న కోణంలో విచారణ
వాట్సాప్ మాత్రమే కాదు.. సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా సమాచార మార్పిడి
మిడిల్ ఈస్ట్ దేశాల ప్రాక్సీ సర్వర్ల ద్వారా రూట్ అయినట్లు గుర్తింపు
దీనివెనుక అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్ ఉందన్న అనుమానాలు
ఈఎన్‌సీలో ఆపరేషన్ ప్రొటోకాల్స్, సీక్రెట్ కోడ్స్ మార్పు.. అంతర్గత ఆడిట్ !
సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళం (ఈఎన్‌సీ) కేంద్రంగా వెలుగుచూసిన హనీట్రాప్.. గూఢచర్యం కేసు దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కేవలం సాధారణ హవాలా లావాదేవీలే కాకుండా, క్రిప్టోకరెన్సీ ద్వారా నిధుల మార్పిడి జరిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు.. మిడిల్ ఈస్ట్ దేశాల ప్రాక్సీ సర్వర్లు, మల్టీ–లేయర్ వీపీఎన్‌లని ఉపయోగించి వ్యవహారం నడిపినట్లు విచారణలో తేలింది. ఈ భారీ కుట్ర వెనుక అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్ ఉన్నట్లుగా దర్యాప్తు బృందం అనుమానిస్తోంది.
మరోవైపు నేవల్ బేస్‌కు చెందిన వ్యూహాత్మక సమాచారం లీక్ అయిన నేపథ్యంలో అప్రమత్తమైన ఈస్ట్రన్ నేవల్ కమాండ్.. సీక్రెట్ కోడ్స్ మార్చేయడంతో పాటు కట్టుదిట్టమైన అంతర్గత భద్రత ఆడిట్‌ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తవ్వుతున్న కొద్దీ.. ఈ కేసులో అనుమానితుల జాబితా పెరుగుతోంది. ఈ కేసుతో మరో పదిమందికి సంబంధం ఉందన్న కోణంలో విచారణను వేగవంతం చేశారు. ఈ హనీట్రాప్ కేసులో నిందితులైన ప్రదీప్ ముఖర్జీ, కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయివరప్రసాద్‌ల మధ్య ఆర్థిక లావాదేవీలన్నీ ప్రధానంగా క్రిప్టోకరెన్సీ రూపంలోనే జరిగినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా వెల్లడైంది.
పాకిస్థాన్ ఏజెంట్ల నుంచి వీరికి అందిన నగదు సాధారణ బ్యాంకు ఖాతాల్లోకి కాకుండా.. డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌కు దొరక్కుండా విదేశీ థర్డ్ పార్టీ గేమింగ్ యాప్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్, డిజిటల్ వాలెట్ల ద్వారా రూట్ అయినట్లు గుర్తించారు. ఈ క్రిప్టో వ్యవహారాలకు సంబంధించిన కీలక వివరాలతో అధికారులు మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు. నిందితుల కాల్, చాట్ డేటా ఆధారంగా ఈ వ్యవహారంతో మరో పదిమందికి సంబంధం ఉన్నట్లుగా గుర్తించి.. వారిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మిడిల్ ఈస్ట్ సర్వర్లు.. వీపీఎన్ వలయాలతో..
ఆపరేషన్ ఫైర్‌వాల్–2026లో భాగంగా.. కౌంటర్ ఇంటెలిజిజెన్స్ సైబర్ బృందాలు జరిపిన డిజిటల్ విశ్లేషణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. పాక్ ఏజెంట్లు ప్రదీప్‌ను ట్రాప్ చేయడానికి వాడిన ఫేక్ సోషల్ మీడియా ఐడీలు నేరుగా పాక్ నుంచి కాకుండా.. మిడిల్ ఈస్ట్ దేశాల ప్రాక్సీ సర్వర్ల ద్వారా ఆపరేట్ అయినట్లు తెలుస్తోంది. నిఘాసంస్థల ట్రాకింగ్ నుంచి తప్పించుకునేందుకు కేరళ, ముంబై, దుబాయ్ సర్వర్ల ద్వారా ఐపీ అడ్రస్‌లు మారుస్తూ మల్టీ–లేయర్ వీపీఎన్ నెట్‌వర్క్‌ని ఉపయోగించినట్లు సైబర్ నిపుణులు గుర్తించారని సమాచారం.
వాట్సాప్ మాత్రమే కాదు
సమాచార మార్పిడి కోసం నిందితులు కేవలం వాట్సాప్‌కి మాత్రమే పరిమితం కాకుండా అత్యంత ఎన్‌క్రిప్టెడ్ అయిన సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌లను కూడా వినియోగించినట్లు గుర్తించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల నుంచి డిలీట్ చేసిన అంతర్గత సంభాషణలను రక్షణశాఖకు చెందిన ప్రత్యేక డిజిటల్ ఫోరెన్సిక్ బృందాలు సాంకేతిక నిపుణుల సాయంతో పునరుద్ధరించే పనిని ముమ్మరం చేశాయి. బేస్ పరిసరాల్లో భద్రత నిబంధనలు ఉల్లంఘించి యాక్టివ్‌గా ఉన్న మొబైల్ సిగ్నల్స్ డేటాని క్రాస్ వెరిఫై చేస్తున్నారు.
అప్రమత్తమైన ఈస్ట్రన్ నేవల్ కమాండ్
హనీట్రాప్‌లో విశాఖ నేవల్ బేస్‌కు చెందిన అత్యంత రహస్య వ్యూహాత్మక సమాచారం, షెడ్యూల్స్ లీక్ అయ్యాయన్న అనుమానాలతో ఈఎన్‌సీ పూర్తిగా అప్రమత్తమైంది. భద్రతాపరమైన ముందస్తు చర్యల్లో భాగంగా అంతర్గత కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల భద్రతను అప్‌గ్రేడ్ చేసింది. రోజువారీ నిర్వహణ ఆపరేషన్ ప్రొటోకాల్స్‌తో పాటు కీలకమైన సీక్రెట్ కోడ్స్‌ని సైతం మార్చేసినట్లు తెలుస్తోంది. యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు.. బేస్ కేంద్రాన్ని అనుసంధానించే అంతర్గత వైర్‌లెస్, శాటిలైట్ నెట్‌వర్క్‌లలో కొన్ని ప్రత్యేకమైన క్రిప్టోగ్రాఫిక్స్ కోడ్స్ ఆధారంగా పనిచేస్తాయి.
నిందితుడి ద్వారా శతృదేశానికి పాత సిగ్నల్ లాగ్స్ లేదా ఫ్రీక్వెన్సీల వివరాలు తెలిసి ఉంటాయనే అనుమానంతో.. ఆ పాత కోడ్‌లన్నింటినీ రద్దుచేసి, కొత్త సురక్షితమైన సాంకేతిక కోడ్స్‌ని రక్షణ వ్యవస్థల్లోకి అప్‌లోడ్ చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల శతృదేశం నెట్‌వర్క్‌ని హ్యాక్ లేదా ట్యాప్ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా యుద్ధనౌకల ప్రయాణమార్గాలు, పెట్రోలింగ్ సమయాలు, సిబ్బంది డ్యూటీ షెడ్యూల్స్‌కు సంబంధించి అంతర్గతంగా వాడే ప్రత్యేక కోడ్‌వర్డ్స్‌ని కూడా మార్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంకా సైబర్ ఇంటెలిజెన్స్ ఐడెంటిటీస్ కూడా మారుస్తున్నట్లు రక్షణవర్గాలు చెబుతున్నాయి.
అణువణువు డేగకన్ను
కాంట్రాక్ట్ డ్రైవర్ సాయివరప్రసాద్ ద్వారా సమాచారం లీకయిన నేపథ్యంలో విశాఖ నేవీ బేస్‌లో భారీస్థాయిలో అంతర్గత భద్రత ఆడిట్ ప్రారంభమైందని తెలిసింది. రక్షణ సమాచారానికి లేదా అధికారుల కదలికలకు యాక్సెస్ ఉంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లు, క్యాంటీన్ స్టాఫ్, సప్లైచైన్ కార్మికులు, డ్రైవర్ల బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్‌ని అధికారులు మరింత కఠినతరం చేసినట్లు సమాచారం. అనుమానితుల కదలికలపై అదనపు నిఘా పరిమితులు విధించినట్లు చెబుతున్నారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి శనివారం నాటికి మరిన్ని అరెస్టులు లేదా అధికారిక కోర్టు కస్టడీల వివరాలు వెలువరించే అవకాశం ఉందని దర్యాప్తువర్గాల సమాచారం.


