విశాఖలో గోవా తరహా పర్యాటక సంస్కృతిని తీసుకురావాలి
జూదాన్ని ప్రోత్సహిస్తేనే రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి
క్యాసినో, పబ్‌కల్చర్ పెరిగేలా ప్రభుత్వం లిబరల్‌గా వ్యవహరించాలి
శాసనసభ స్పీకర్ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
ఎంవీపీ కాలనీ: రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నెరెడ్కో నిర్వహించిన ‘వైజాగ్ ప్రోపర్టీ ఫెస్ట్–2025’లో సంచలన వ్యాఖ్యలు చేశారు. జూదాన్ని ప్రోత్సహించకుండా పర్యాటకం ఎలా అభివృద్ధి చెందుతుందని సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీ తాగడానికి పర్యాటకులెవరైనా విశాఖ బీచ్‌కు వస్తారా? అంటూ ప్రశ్నించారు. విశాఖ బీచ్‌లో భార్యాభర్తలు రెండు పెగ్గులేసుకునే కల్చర్ ఉండాలని, భర్త బీచ్‌లో కూర్చుని రెండు పెగ్గులేసుకుంటే భార్య ఐస్‌క్రీం తింటూ ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.
అవేం లేకుండా ప్రభుత్వం పర్యాటకులను విశాఖ రమ్మంటే ఎందుకొస్తారని ప్ర«శ్నించారు. క్యాసినో, పబ్‌కల్చర్ విశాఖలో అభివృద్ధి కావాలంటే లిబరల్‌గా ఉండాలన్నారు. ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ పెడితే పర్యాటకం ఎప్పటికీ అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు. విశాఖలో ఇవేం లేకపోవడంతోనే ఏపీ, తెలంగాణ పర్యాటకులు గోవా, శ్రీలంక వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారన్నారు. ఇటీవల గోవా గవర్నర్‌ను కలవడానికి వెళ్లినప్పుడు అక్కడి కల్చర్ తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు.
రిస్ట్రిక్షన్స్ లేని గోవా తరహా పర్యాటక సంస్కృతిని విశాఖలో తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు. ఈ దిశగా కృషి చేయాలని వేదికపై ఉన్న ఎంపీ శ్రీభరత్, మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు సూచించారు. విశాఖలో కొంత కాలంగా రియల్ ఎస్టేట్ దోపిడీ పెరిగిపోయిందన్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లే అవుట్‌లు పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నాయన్నారు. వాటి సమాచారం ప్రభుత్వం దగ్గర లేకపోతే తాను ఇస్తానన్నారు.


