Andhra Pradesh: మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం.. మాఫీ.. రాష్ట్ర వ్యాప్తంగా..!

Sector ready for loan waiver up to 1 lakh in SC land acquisition - Sakshi

ఎస్సీల భూమి కొనుగోలు పథకంలో రూ.లక్ష వరకు రుణమాఫీకి రంగం సిద్ధం

ఈ మేరకు 2009లో జీవో ఇచ్చిన దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్సార్‌ 

వైఎస్సార్‌ మృతితో ఆ జీవోను అటకెక్కించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు

తండ్రి ఇచ్చిన జీవోను అమలు చేస్తున్న తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

18,235.37 ఎకరాల వ్యవసాయ భూములకు తనఖా నుంచి విముక్తి

రాష్ట్రవ్యాప్తంగా 17,189 మంది లబ్ధిదారులకు ప్రయోజనం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిరుపేదలైన ఎస్సీల మూడు దశాబ్దాల నిరీక్షణకు మోక్షం లభించింది. భూమి కొనుగోలు పథకం ద్వారా లబ్ధిపొందిన ఎస్సీలను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రుణ విముక్తులను చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 17,189 మంది ఎస్సీ లబ్ధిదారులకు సంబంధించిన 18,235.37 ఎకరాల వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ శాఖలో ఉన్న తనఖా నుంచి విముక్తి కానున్నాయి. ప్రకాశం జిల్లాలో అమలైన ఈ రుణమాఫీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రత్యేకంగా తీసుకున్న చొరవే ఈ పథకం వేగంగా అమలు కావటానికి దోహదపడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకం అమలులో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు ఉత్తర్వులు జారీచేసింది. 

తొలుత ప్రకాశం జిల్లాలో లబ్ధిదారుల గుర్తింపు
రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఇచ్చిన జీవోను అమలు చేస్తే భూమి కొనుగోలు పథకంలో లబ్ధిపొందిన ఎస్సీలకు ప్రయోజనం కలుగుతుందని సీఎంకు వివరించారు. ఈ అంశంపై వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హర్షవర్దన్‌ను సీఎం ఆదేశించారు. దీంతో జిల్లాల వారీగా లబ్ధిదారులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొదటగా ప్రకాశం జిల్లాలో లబ్ధిదారులను ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తూతిక శ్రీనివాసవిశ్వనాథ్‌ గుర్తించారు. భూములకు తనఖా నుంచి విముక్తి కలిగించేందుకు రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులతో సంప్రదిస్తున్నారు.

1988–89 నుంచి లబ్ధిదారులకు ఊరట
రాష్ట్రంలోని ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకంలో 1988–89 నుంచి భూములు కొనుగోలు చేసిన లబ్ధిదారులకు రుణమాఫీ ద్వారా ఊరట కలుగనుంది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు భూమి కొనుగోలు పథకంలో రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీచేస్తూ 2009 జూలై 7వ తేదీన జీవోఆర్‌టీ నంబరు–492 విడుదల చేశారు. ఆ మహానేత అకాల మరణంతో తరువాత ఆ జీవోను కాంగ్రెస్, టీడీపీ పాలకులు అటకెక్కించారు. ఆ మహానేత ఇచ్చిన జీవోకు మోక్షం కల్పిస్తున్న ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఎస్సీ లబ్ధిదారులకు జిల్లాల్లోని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో తాకట్టులో ఉన్న భూములకు విముక్తి కలిగించనున్నారు.  

ఎస్సీ లబ్ధిదారులకు రుణమాఫీ 
ఎస్సీ కార్పొరేషన్‌ కింద భూమి కొనుగోలు పథకంలో లబ్ధి పొంది.. 2008లోపు రూ.లక్ష లోపు రుణం ఉన్నవారందరికీ రుణమాఫీ చేసేలా చర్యలు చేపట్టనున్నామని ఎస్సీ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. అంతేకాకుండా ఆ భూములపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీల భూమి కొనుగోలు పథకంలో రుణమాఫీకి సంబంధించి రాష్ట్రస్థాయి తొలి సమీక్ష సమావేశం ఆదివారం ఒంగోలులోని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్‌ చైర్మన్లు.. కొమ్మూరి కనకారావు మాదిగ, పెదపాటి అమ్మాజీ, వడ్డాది మధుసూదనరావు, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా–సంక్షేమం) జి.కృష్ణవేణి, జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ ఎన్‌.లక్ష్మానాయక్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 17 వేలకుపైగా ఎస్సీ లబ్ధిదారులున్నారని, వారందరికీ రుణమాఫీ చేసేలా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. అయితే 2009లో నాటి సీఎం వైఎస్సార్‌ ఇచ్చిన జీవో ప్రకారం రుణమాఫీ 2008లోపు ఉన్న లబ్ధిదారులకు మాత్రమేనని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2008 తర్వాత రుణాలు తీసుకొని.. తిరిగి చెల్లించని వారి వివరాలను కూడా బయటకు తీస్తున్నామన్నారు. వారికి కూడా రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ.. 2009 జూలైలో ఎస్సీ లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తానని వైఎస్సార్‌ జీవో ఇచ్చారని.. ఆ తర్వాత రెండు నెలలకే ఆయన మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఆ జీవోను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు వైఎస్సార్‌ తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ ఆ జీవోను అమలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top