
ఏపీఎండీసీ బాండ్ల జారీలో చివరి క్షణం వరకు పెట్టుబడిదారులకు కీలక సమాచారమివ్వకుండా గోప్యత
కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా నిధుల జమ విషయం చివరి వరకు రహస్యమే
తమవారికి మాత్రమే లబ్ధి చేకూరాలి.. ఇతర ఇన్వెస్టర్లు బాండ్లు కొనకుండా ఉండేందుకే ఈ ఎత్తుగడ
ఆ తర్వాత సెకండరీ మార్కెట్‌లో మరింత ఎక్కువ వడ్డీకి అమ్ముకునే వ్యూహం
ఎక్కువ మంది పోటీ పడితే వడ్డీ రేటు తగ్గుతుంది.. ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది.. అయినా తమవారికే లబ్ధి చేకూర్చే ప్రణాళిక
కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేట్ వారికి పెత్తనం ఇవ్వడమే రాజ్యాంగ ఉల్లంఘన
ఇప్పుడు ఆ విషయం కూడా దాచిపెట్టి ఇతర ఇన్వెస్టర్లకి తెలియకుండా కుట్రలు
అటు ఇతర ఇన్వెస్టర్లకు.. ఇటు ప్రభుత్వానికి మేలు జరగకుండా సొంత వారి కోసమే ముఖ్యనేత ఆరాటం
రాష్ట్రంలో 436 గనుల్లో విలువైన ప్రకృతి సంపదను దోచి పెట్టడమే లక్ష్యం..
నిర్భీతిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రైవేట్ వ్యక్తులకు ఖజానాపై పెత్తనం
నేడు రూ.9 వేల కోట్ల ఎన్‌సీడీ బాండ్లు జారీ చేసేందుకు ఏపీఎండీసీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: అప్పులు మీద అప్పులు చేసుకుంటూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం అందులోనూ సొంత లాభం చూసుకుంటోంది! ఎందులోనైనా సరే తన వ్యక్తిగత ప్రయోజనం ఉండాలని ఆశిస్తూ అందుకు తగ్గట్టుగా పథకాలు రచిస్తోంది.
తాజాగా ఏపీఎండీసీ ద్వారా జారీ చేస్తున్న ఎన్‌సీడీ బాండ్ల వ్యవహారంలో ఒకపక్క దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. రూ.లక్షల కోట్ల విలువైన ఖనిజాలను తాకట్టు పెట్టి ఏపీఎండీసీ ద్వారా ప్రభుత్వం రూ.9 వేల కోట్ల విలువైన బాండ్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులివ్వడంపై ఆర్థిక నిపుణులు నివ్వెరపోతున్నారు.
దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలా బరి తెగించి రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించలేదని పేర్కొంటున్నారు. ఎడాపెడా అప్పులు చేస్తున్న కూటమి సర్కారు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బడ్జెట్ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్‌సీడీ బాండ్లు జారీ చేసి నిధులను సమీకరిస్తోంది. లాభాల్లో ఉన్న ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు చేయడం వల్ల రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతా రహస్యమే..
ఎన్‌సీడీ బాండ్ల జారీకి సంబంధించి అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇన్వెస్టర్లకు తెలియకుండా గుట్టుగా ఉంచి కేవలం తమవారే లాభపడేలా ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. బాండ్లు కొనుగోలు చేసిన వారు నేరుగా ప్రభుత్వ సంచిత నిధి నుంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్న విషయాన్ని రహస్యంగా ఉంచడం ద్వారా రుణ మార్కెట్‌లో పోటీ లేకుండా పోతుంది. వాస్తవానికి పోటీ ఉంటే వడ్డీ తగ్గి ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది.
అదే పోటీ లేకుండా చేస్తే ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నప్పటికీ తాము ఎంపిక చేసిన వారికి ఎక్కువ వడ్డీకి బాండ్లు విక్రయించి, వారికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సర్కారు వ్యవహరిస్తోంది. సెకండరీ మార్కెట్‌లో ఆ బాండ్లను ప్రీమియం ధరలకు విక్రయించడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చి క్విడ్‌ప్రోకో ద్వారా లబ్ధి పొందాలన్నది ప్రభుత్వ పెద్దల ప్రణాళిక.
కీలక సమాచారాన్ని తొక్కిపెట్టి..
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేట్ వారికి హక్కులు కల్పించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆర్థిక నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా సర్కారు పెడచెవిన పెడుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా లెక్క చేయకుండా బాండ్ల జారీకి సిద్ధమైంది. ఈమేరకు బాండ్ల జారీ ప్రక్రియను ఏపీఎండీసీ గురువారం ప్రారంభించనుంది. ఇందుకోసం ఇటీవలే సెబీలోని ఇబీపీ (ఎలక్ట్రానిక్ బుక్ ప్రొవైడర్) ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించింది.
ఈ బాండ్ల జారీలో నిబంధనలు, షరతుల గురించి తెలిపే జీఐడీ (జనరల్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్), కేఐడీ (కీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్) పత్రాలను ఆ పోర్టల్‌లో పెట్టింది. అయితే బాండ్లు కొన్న వారికి ఆర్‌బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్‌పై హక్కులు ఉంటాయనే కీలకమైన సమాచారాన్ని ఆ డాక్యుమెంట్లలో పొందుపరచలేదు.
చివరి నిమిషంలో..
బుధవారం సాయంత్రం 4.30 గంటలకు మాత్రమే కన్సాలిడేటెడ్ ఫండ్‌పై హక్కుల విషయాన్ని ఈబీపీ ప్లాట్‌ఫామ్‌లో పొందుపరిచారు. అదే ఈ విషయం ముందే తెలిసి ఉంటే పెద్ద ఇన్వెస్టర్లు చాలామంది ఈ బాండ్ల కోసం పోటీ పడేవారు. ఎందుకంటే.. కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా తాము పెట్టిన సొమ్ముకు కచ్చితమైన భరోసా ఉంటుంది కాబట్టి. ఇది ఏ ప్రభుత్వమూ ఇవ్వని బంపర్ ఆఫర్ లాంటిది. ఏ ప్రభుత్వమైనా సరే, ఎంత అప్పు చేసినా దానికోసం ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు అధికారం కల్పించదు.
కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అప్పులు చేయడమే ధ్యేయంగా రాజ్యాంగ విరుద్ధమైన పనులకు సిద్ధమైంది. అయితే ఆ సమాచారం ఇన్వెస్టర్లకు తెలియకుండా రహస్యంగా ఉంచి కేవలం తమకు అనుకూలమైన వారు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేలా వ్యూహం రూపొందించింది. అంటే వారు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసి సెకండరీ మార్కెట్‌లో వాటిని ఎక్కువ వడ్డీకి అమ్ముకునే అవకాశం కల్పించింది. తద్వారా ఏపీఎండీసీ నుంచి నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వానికి సన్నిహితులైన వ్యక్తులు లాభపడతారు.
సమయం ఇవ్వకుండా..
నిజానికి ఈ ప్రయోజనం ప్రభుత్వానికి దక్కాలి. కానీ కుట్రపూరితంగా కన్సాలిడేటెడ్ ఫండ్ విషయాన్ని కేవలం తమ అనుయాయులకు మాత్రమే లీక్ చేసి ఇతర ఇన్వెస్టర్లకు తెలియనివ్వలేదు. దీంతో పెద్ద ఇన్వెస్టర్లు వీటిని సాధారణ బాండ్లుగానే పరిగణించి పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే కన్సాలిడేటెడ్ ఫండ్ విషయం తెలిసి ఉంటే చాలామంది బిడ్డింగ్‌లో పాల్గొనేవారని నిపుణులు చెబుతున్నారు.
కానీ ఇతరులు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సర్కారు ఆ విషయాన్ని జీఐడీ, కేఐడీ డాక్యుమెంట్లలో కావాలనే పొందుపరచలేదు. ఏపీఎండీసీ ఎండీ జారీ చేసిన డాక్యుమెంట్లలో అత్యంత కీలకమైన ఈ విషయం గురించి వెల్లడించకపోవడం తెలిసి చేసిన తప్పిదంగానే కనిపిస్తోంది. ఆఖరి నిమిషాల్లో ఈ విషయాన్ని బయటపెట్టడంతో అర్హత ఉన్న ఇన్వెసర్లు బాండ్లు కొనేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఇన్వెస్టర్లు బాండ్లు కొనాలంటే తమ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీల నుంచి అనుమతి తీసుకోవడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. అలాంటి అవకాశం వారికి ఇవ్వకుండా చివరి నిమిషంలో అసలు విషయాన్ని బహిర్గతం చేశారు. తద్వారా ప్రభుత్వ పెద్దలు తమ అనుయాయులు మాత్రమే బాండ్లు కొనుగోలు చేసేలా కుట్ర పన్నారు.