శ్రీకాకుళం, విజయనగరం అధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష

SEC review with Srikakulam and Vizianagaram authorities - Sakshi

అరసవల్లి/సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘నేనెప్పుడూ వివాదాల జోలికి వెళ్లను.. 40 ఏళ్లలో ఎక్కడా వివాదాలకు పోలేదు. కనీసం ఏ వ్యక్తిని, ఏ రాజకీయ పార్టీనుద్దేశించి కూడా ఇంతవరకు మాట్లాడలేదు.. మాట్లాడే వ్యవహార శైలి నాది కాదు..’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ అన్నారు. తాను రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తున్నానని, తనకు అన్ని రాజకీయ పార్టీలు సమానమేనని చెప్పారు. ఆయన సోమవారం శ్రీకాకుళం, విజయనగరం కలెక్టరేట్‌లలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోను, విజయనగరంలోను నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అని, అలాంటి వ్యవస్థలోకి ఇంకో వ్యవస్థ చొరబడేలా ప్రయత్నించడం, భయభ్రాంతులకు గురిచేయాలనుకుంటే.. అలాంటి అనుభవాలే కచ్చితంగా ఆ వ్యవస్థలకు కూడా ఎదురవుతాయని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఎన్నికల కమిషన్‌ వ్యతిరేకం కాదని, అయితే బలవంతపు ఏకగ్రీవాలను మాత్రం అంగీకరించేది లేదని చెప్పారు. 2013, అంతకుముందు ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు అధికంగానే జరిగాయన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా, అలాగే ఎలాంటి ఫిర్యాదులైనా స్వీకరించేందుకు ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, బుధవారం ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో తొలివిడతలో 321 పంచాయతీల్లో ఎన్నికల ఏర్పాట్లు అద్భుతంగా చేశారంటూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్, ఎస్పీ అమిత్‌ బర్దార్‌లను ప్రశంసించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఆదివారం నామినేషన్ల స్వీకరణ సమయంలో జరిగిన ఘటనపై విలేకరులు అడిగినా ఆయన ఏమాత్రం స్పందించకుండా వెనుదిరిగారు.  

రేపు తిరుపతికి నిమ్మగడ్డ 
చిత్తూరు కలెక్టరేట్‌: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతి రానున్నారు. సాయంత్రం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌కు ఉత్తర్వులు అందాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top