6 అడుగుల దూరం.. మాస్కులు తప్పనిసరి | School Education Department Guidelines on School Opening | Sakshi
Sakshi News home page

6 అడుగుల దూరం.. మాస్కులు తప్పనిసరి

Sep 17 2020 5:40 AM | Updated on Sep 17 2020 5:40 AM

School Education Department Guidelines on School Opening - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌ 4 ఆదేశాలను అనుసరించి స్కూళ్లను తెరవడంపై పాఠశాల విద్యా శాఖ తాజాగా మార్గదర్శకాలను ఇచ్చింది. దీంతో ప్రభుత్వ యాజమాన్యాల్లోని ఆయా విభాగాలు తమ పరిధిలోని స్కూళ్లను తెరిపించడంపై దృష్టి సారిస్తున్నాయి. వీటిపై ఎలాంటి చర్యలు చేపట్టాలో విద్యా శాఖ తన మార్గదర్శకాల్లో స్పష్టతనిచ్చింది.

► కంటైన్‌మెంట్‌ జోన్లకు బయట ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలను మాత్రమే తెరవాలి. వాటిలో ఆన్‌లైన్‌ టీచింగ్, టెలీకౌన్సెలింగ్, విద్యావారధి తదితర కార్యక్రమాల కోసం 50 శాతం మంది టీచర్లు హాజరుకావచ్చు. 
► కోవిడ్‌–19 నుంచి విద్యార్థులు, సిబ్బందిని రక్షించడానికి అన్ని ప్రజారోగ్య చర్యలను పాఠశాలల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు చేపట్టాలి.
► ఒకరికొకరు కనీసం ఆరడుగుల దూరం పాటించేలా చూడాలి. ప్రతి ఒక్కరూ ఫేస్‌మాస్కు ధరించడం తప్పనిసరి.
► దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివారు వినియోగించే టిష్యూ పేపర్లు, కర్చీఫ్‌లను నిర్దేశిత ప్రదేశంలో దూరంగా పడేసేలా చూడాలి.

పరిశుభ్రంగా ఉంచాలి
► తరగతి గదులు, లేబొరేటరీలు, ఇతర వినియోగ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి. 
► నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, వాటర్‌బాటిళ్లు ఇచ్చిపుచ్చుకోవడాన్ని అనుమతించరాదు.
► 1–8 తరగతుల విద్యార్థులు ఇళ్ల వద్దనే అభ్యసనం కొనసాగించాలి. వారెవరినీ స్కూళ్లకు రప్పించకూడదు.  అవసరమైతే వారి తల్లిదండ్రులు, సంరక్షకులను పిలిచి మాట్లాడాలి.
► ఆన్‌లైన్, విద్యావారధి, విద్యామృతం వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు అభ్యసనం కొనసాగించాలి. అక్టోబర్‌ 5 వరకు ఇవి కొనసాగుతాయి.

యాప్‌లో వర్క్‌షీట్లు
► 1–8 తరగతుల పిల్లలకు సంబంధించిన వర్క్‌షీట్లను అభ్యాస యాప్‌లో పొందుపరిచారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని అభ్యసనం కొనసాగించేలా మార్గనిర్దేశం చేయాలి.
► ఈ నెల 21 నుంచి కంటైన్‌మెంట్‌ జోన్ల బయట తెరిచే స్కూళ్లు, కాలేజీల్లోకి 9–12 తరగతుల పిల్లలను మాత్రమే సందేహాల నివృత్తికి అనుమతించాలి. ఇందుకు తల్లిదండ్రుల అనుమతి ఉండాలి.
► ఈ తరగతులు బోధించే టీచర్లు.. విద్యార్థుల స్థాయిని అనుసరించి హైటెక్, లోటెక్, నోటెక్‌గా విభజించాలి. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకొని మార్గనిర్దేశం చేయాలి. 
► గురుకుల స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల విషయంలో టీచర్లు వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేయించి గైడెన్స్‌ ఇవ్వాలి. ఈ విద్యార్థులు తమకు సమీపంలోని జెడ్పీ హైస్కూల్‌కు వెళ్లి సూచనలు తీసుకోవచ్చు. 
► ఈ నెల 21 నుంచి 30 వరకు 9–12 తరగతుల విద్యార్థుల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను కూడా విద్యా శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement