YS Rajasekhara Reddy: మరపురాని మహానేత

Sakshi Special Story On YS Rajasekhara Reddy

మండుటెండలో 1,475 కిలోమీటర్ల పాదయాత్ర

రైతుకు ఉచిత విద్యుత్‌ ఫైల్‌పైనే తొలి సంతకం

రూ.1,100 కోట్ల కరెంట్‌ బకాయిలు రద్దు

అన్నదాతల్ని రుణ విముక్తుల్ని చేసిన రైతు నేస్తం

పేదోడికి ప్రాణం పోసిన ‘ఆరోగ్యశ్రీ’ రూపకర్త

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో నిరుపేదకు సరస్వతీ కటాక్షం

మాట తప్పని నైజం.. మడమ తిప్పని ధైర్యం ఆయన సొంతం

వైఎస్సార్‌ మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు.. కానీ, తనదైన పాలనతో ప్రతి ఒక్కరి హృదయాల్లో మాత్రం చెరగని ముద్ర వేశారు. ఆయన రూపకల్పన చేసిన సంక్షేమం రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి బాటలు వేసింది. ఆయన పేరు తలుచుకోగానే స్వచ్ఛమైన చిరునవ్వు కళ్ల ముందు మెదలుతుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. నమస్తే.. నమస్తే.. అన్న మాటలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్‌’.. తెలుగువాడి హృదయాల్లో చెక్కు చెదరని పేరు.. ఆ అక్షరాలు వింటే తెలుగు నేల పులకిస్తుంది.. పచ్చని పైరు నాట్యం చేస్తుంది.. పేదోడి మనసు ఉప్పొంగుతుంది.. అక్క చెల్లెమ్మల్లో కొత్త ఆనందం కనిపిస్తుంది.. రైతు మోములో తొలకరి సాక్షాత్కరిస్తుంది.. బడుగు బలహీనులకు కొండంత ధైర్యం వస్తుంది.. దగాపడ్డ గుండె గొంతుకకు భరోసా దక్కుతుంది.. ప్రజల గుండెల్లో ‘రాజ’న్నగా ముద్రవేసుకున్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతీక్షణం ప్రజలకే అంకితం చేశారు. ప్రజల పక్షాన్నే పోరాడారు. ప్రజాసంక్షేమమే పునాదిగా పనిచేశారు. ‘రాజన్న’ మాట చెబితే తప్పడు.. ఎన్ని అడ్డంకులెదురైనా మడమ తిప్పడు.. అన్నది ప్రజలు చెప్పే మాట. ఢిల్లీని సైతం ధిక్కరించి తన జనం కోసం నిలబడ్డ ధీరుడు. 

ఆయనే ఓ ధైర్యం
రాష్ట్రంలో వెన్నుపోటు రాజకీయాలు రాక్షస క్రీడ ఆడుతున్న తరుణంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో విపక్ష నేతగా జనం వాణి గట్టిగా వినిపించారు. అప్పటి టీడీపీ దోపిడీ పాలనపై నిప్పులు చెరిగారు. ఆ చీకటి పాలనతో నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు రాజన్న జనం బాటపట్టారు. మండుటెండలో ఆయన సాగించిన 1,475 కిలోమీటర్ల పాదయాత్రలో జనం గుండె తలుపుతట్టారు. నేనున్నానని కొండంత భరోసా కల్పించారు. అలాగే, ‘వ్యవసాయం దండగ’ అని పరిహసించిన ఆనాటి పాలకుల చేష్టలకు దిగాలు పడ్డ రైతును ఓదార్చారు. జబ్బు చేస్తే ఇల్లూ వాకిలీ అమ్ముకునే సామాన్య జనం దయనీయ స్థితికి చలించిపోయారు. చదువు కోసం అప్పులపాలయ్యే కుటుంబాల దీనగాధలు విన్నారు. ఇలా నడిచొచ్చిన నాయకుడికి యావత్‌ తెలుగు జాతి నీరాజనాలు పట్టింది. 2004లో అత్యధిక మెజారిటీతో అక్కున చేర్చుకుని అందలం ఎక్కించింది.

రాజన్నే ‘గుండె’బలం
పేదోడికి జబ్బొస్తే ఇల్లూ వాకిలీ అమ్ముకోవడమే రాజన్న సీఎం అయ్యే వరకూ ఉన్న పరిస్థితి. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్‌ వైద్యం దక్కే విప్లవాత్మక పథకం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. లక్షల మంది జీవితాల్లో ఈ పథకం వెలుగు నింపింది. క్యాన్సర్, గుండె జబ్బులు, న్యూరో, గర్భకోశ వ్యాధులు.. ఇలా 942 జబ్బులను ఈ పథకంలో చేర్చారు. రూ.1,400 కోట్లు పథకానికి వెచ్చించారు. చిన్నారుల్లో వినికిడి లోపం సరిచేసేందుకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ కోసం ఒక్కొక్కరికీ రూ.6.5 లక్షలు వెచ్చించిన ఘనత ఆయనదే. కాల్‌ చేస్తే ‘కుయ్‌.. కుయ్‌.. కుయ్‌..’ మంటూ ప్రత్యక్షమయ్యే 108 అంబులెన్స్‌లు.. 104 వైద్య సేవలు.. ఇవన్నీ ఆయన తెచ్చిపెట్టినవే.

పేదోడి ఇంట్లో మహానేత ముద్ర
సొంతిల్లు కల వైఎస్‌వల్లే సాధ్యమైందని చాలామంది చెప్పుకుంటారు. 2004 వరకూ కేవలం రూ.500 కోట్లున్న గృహ నిర్మాణ బడ్జెట్‌ను 2009 నాటికి ఆయన రూ.5వేల కోట్లకు తీసుకెళ్లారు. కేవలం ఐదేళ్లలోనే 47 లక్షల ఇళ్లు నిర్మించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. వృద్ధాప్యం భారమన్న వాదనను వైఎస్‌ దూరం చేశారు. పెన్షన్‌ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని మార్చారు. 16 లక్షలున్న పెన్షన్లను 71 లక్షలకు పెంచి అర్హులందరికీ అందేలా చేశారు.

అక్షర భిక్ష పెట్టిన నేత
డాక్టర్, ఇంజనీర్‌ వంటి పెద్ద చదువులు పేదవాడి సొంతమైతేనే ఆర్థిక దుస్థితి మారుతుందని వైఎస్‌ బలంగా నమ్మారు. ఈ నేపథ్యంలోనే విప్లవాత్మకమైన ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారు. 11 లక్షల మంది బీసీలకు, 5 లక్షల ఎస్సీ, 1.8 లక్షల ఎస్టీలకు, 7.5 లక్షల మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం పెద్ద చదువులకు అవకాశం కల్పించింది. ఈ పథకంవల్ల ఎంతోమంది పెద్ద చదువులకు వెళ్లారు. ఇదే కాదు.. అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ నిజమైన అన్నగా నిలబడ్డారు. ఆర్థిక స్వావలంబన దిశగా పావలా వడ్డీ రుణ పథకాన్ని దిగ్విజయంగా అమలుచేశారు. ఆయన హయాంలో 85 లక్షల మందికి రూ.7 వేల కోట్లు అందాయి. ఫలితంగా స్వయం సహాయ సంఘాలు వైఎస్‌ కాలంలో బలమైన శక్తులుగా అవతరించాయి. 

స్వర్ణయుగానికి నాంది
మే 14, 2004న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరుక్షణమే రైతు పక్షపాతిగా ముద్ర వేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై సంతకం చేశారు. అప్పటి నుంచి దాదాపు 35 లక్షల పంపుసెట్లకు పైగా ఉచిత విద్యుత్‌ అమలైంది. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ సబ్సిడీ క్రమంగా ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచితం హామీ చెక్కుచెదరలేదు. కరెంట్‌ చార్జీలు కట్టలేమన్న రైతుపై టీడీపీ ప్రభుత్వం పాశవికంగా పెట్టిన కేసులన్నీ ఎత్తేశారు. రూ.1,100 కోట్ల రైతు విద్యుత్‌ బకాయిలు ఒక్క సంతకంతో మాఫీ చేశారు. అప్పులపాలైన రైతన్నను రుణ విముక్తుల్ని చేశారు. నాణ్యమైన విత్తు, ఎరువు కోసం దిగ్గజ కంపెనీలతో రైతు కోసం పోరాడిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. రాజన్న పాలనలో మద్దతు రేటు పెరిగింది. తక్కువ వడ్డీ రుణాలతో దళారుల చెర నుంచి రైతు విముక్తి పొందాడు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top