పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల | Sajjala Ramakrishna Reddy on Irregularities in Local Body Elections | Sakshi
Sakshi News home page

పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల

Oct 19 2026 6:48 PM | Updated on Oct 19 2026 7:29 PM

Sajjala Ramakrishna Reddy on Irregularities in Local Body Elections

తాడేపల్లి: స్టేట్‌ టెర్రరిజం ఎలా ఉంటుందో చంద్రబాబు మూడు రోజులుగా చూపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ పాల్పడుతున్న అక్రమాలపై సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు.

‘‘చంద్రబాబు అప్రజాస్వామ్యయుతంగా వ్యహరించారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయి. టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. స్క్రూటినీలో కూడా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్లలోనే కాదు.. స్క్రూటినీలో కూడా అరాచకం. పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?

వైఎస్సార్‌సీపీ అభ్యర‍్థుల నామినేషన్లను అకారణంగా రిజెక్ట్‌ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే పోటీకి మేము దిగుతున్నాం. ప్రొద్దుటూరులో పోలీసులే మా అభ్యర్థిని టీడీపీ వాళ్లకు అప్పగించారు. స్క్రూటినీ కోసమని తీసుకెళ్లి టీడీపీ వాళ్లకు అప్పగించారు. స్క్రూటినీలో కూడా టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారు.

చేసేదంతా చేసి తనకేమీ తెలియనట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు. టీడీపీ గూండాలకు పోలీసులు రక్షణ కవచంలా నిలబడ్డారు.  ఏపీలో జరుగుతున్నవి ఎన్నికలు కాదు.. ప్రజాస్వామ్యం ముసుగులో వ్యవస్థీకృత దౌర్జన్యాలు. ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేయడమే నేరంగా మార్చింది చంద్రబాబు ప్రభుత్వం. పోలీసులే రక్షణ కవచంగా నిలబడితే టీడీపీ మూకలు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నాయి. నామినేషన్లలో అడ్డుకున్నారు.. ఇప్పుడు స్క్రూటినీలో మా పార్టీ అభ్యర్థులను కొట్టి పత్రాలు తిరస్కరిస్తున్నారు.

ప్రొద్దుటూరులో పోలీసులే భద్రత పేరుతో వైఎస్సార్‌సీపీ ఛైర్మన్ అభ్యర్థిని టీడీపీ మూకలకు అప్పగించారు. పోలీసుల సమక్షంలోనే అభ్యర్థిపై దాడి చేసి, చొక్కా చించి, బంగారు గొలుసు లాక్కున్నారు. దాడులకు నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై తిరిగి పోలీసులు లాఠీచార్జీ చేశారు. కనిగిరిలో స్క్రూటినీ సందర్భంగా నామినేషన్ పత్రాలను చించేశారు. నగరిలో మధ్యాహ్నం ఆమోదించిన వైఎస్సార్‌సీపీ నామినేషన్‌ను సాయంత్రానికి తిరస్కరించారు’’ అని తెలిపారు. 

రసీదును లాక్కుని చించేశారు..
రాజంపేటలో ఆమోదించిన నామినేషన్ రసీదును లాక్కుని చించేశారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ‘‘డిపాజిట్ చెల్లించిన రసీదు ఉన్నా.. డిపాజిట్ కట్టలేదంటూ నామినేషన్ల తిరస్కరించారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఐటీ రిటర్నుల్లో రూ.400 తేడా వంటి చిన్న కారణాలతో నామినేషన్ల తిరస్కరించారు. కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు రానివ్వని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో టీడీపీ మూకలు దాడులు చేస్తుంటే చంద్రబాబు ప్రజాస్వామ్యంపై నీతులు చెబుతున్నారు.

తాము చేసిన దౌర్జన్యాలన్నింటినీ వైఎస్సార్‌సీపీపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మద్దతు ఉందనే నమ్మకం ఉంటే ప్రతిపక్ష అభ్యర్థులను పోటీ చేయనివ్వరా? ఎన్నికల్లో గెలుస్తామనే ధైర్యం లేకనే నామినేషన్ల దశలోనే ప్రతిపక్షాన్ని అడ్డుకుంటున్నారు. పోటీ లేకుండా చేసుకుని ఏకగ్రీవాల పేరుతో విజయాలు ప్రకటించుకోవడం ప్రజాస్వామ్యమా?

వైఎస్సార్‌సీపీ నామినేషన్లు వేయలేదని కాదు.. వేయకుండా అడ్డుకున్నారన్నదే అసలు నిజం. ఎనిమిది చోట్ల ఏకగ్రీవాలంటూ ఎల్లో మీడియా ప్రచారం చేయడం సిగ్గుచేటు. టీడీపీ దౌర్జన్యాలకు బాధితులైన వైయస్సార్‌సీపీ నేతలనే నిందితులుగా చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థలా కాకుండా సీఎంవో అనుబంధ విభాగంలా మారింది. ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నామినేషన్ కేంద్రాల లోపల టీడీపీ మూకలకు ప్రవేశం.. వైయస్సార్‌సీపీ అభ్యర్థులకు మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నారు.

అభ్యర్థులను రక్షించాల్సిన పోలీసులే టీడీపీ మూకలకు సహకరిస్తున్నారు. పోలీసులపై నమ్మకం లేక చట్టబద్ధంగా ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకుంటే హైర్డ్ కిల్లర్స్ అంటారా? లోకేశ్‌ పాదయాత్రలో ప్రైవేట్ బౌన్సర్లు ఉంటే తప్పులేదు.. వైఎస్సార్‌సీపీ నేతలు భద్రత పెట్టుకుంటే తప్పా? ఒక ముఖ్యమంత్రి ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని హైర్డ్ కిల్లర్స్ అనడం ఆయన స్థాయికి తగునా? రెడ్‌బుక్ పాలనతో పోలీసు వ్యవస్థను రాజకీయ మాఫియాగా మార్చారు’’ అని చెప్పారు.

ఎన్నికలకు తొందర ఎందుకు?
ఎస్ఐఆర్ తుది ఓటర్ల జాబితా వచ్చేలోపే పాత జాబితాలతో ఎన్నికలకు ఎందుకు తొందరని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. ‘‘రూ.44 లక్షలకు పైగా అనుమానాస్పద ఓట్లను గుర్తించినా పాత జాబితాలతోనే ఎన్నికలు నిర్వహిస్తారా? రూ.15 లక్షలకు పైగా మృతుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని గుర్తించినా వాటితోనే పోలింగ్ జరుపుతారా? పాత ఓటర్ల జాబితాలతో ఎన్నికలు నిర్వహించడం దొంగ ఓట్లకు అవకాశం కల్పించడమే. తుది జాబితా విడుదల తేదీ మార్పు ముందుగానే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎలా తెలిసింది? ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల జాబితా విడుదల తేదీల వ్యవహారంలో ఎన్నికల సంఘాల స్వతంత్రతపైనా అనుమానాలు ఉన్నాయి. మార్చిలోనే మున్సిపాలిటీల పదవీకాలం ముగిసినా ఇన్నాళ్లు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?

దసరా పండుగ సమయంలో హడావుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? మున్సిపల్ ఎన్నికల్లోనే ఇంత హింస జరిగితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల పరిస్థితి ఏమిటి? గ్రామస్థాయిలో ఇదే దౌర్జన్యాలు కొనసాగితే తీవ్ర హింసకు, ప్రాణనష్టానికి దారితీసే ప్రమాదం. అందుకే ఎన్నికలను కేంద్ర పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. నామినేషన్లు వేయకుండా అడ్డుకుని సాధించిన ఏకగ్రీవాలు ప్రజాస్వామ్య విజయాలు కావు.

పోటీలేని చోట్ల వైఎస్సార్‌సీపీకి అభ్యర్థులు లేరని కాదు.. పోటీ చేసే అవకాశమే ఇవ్వలేదు. ప్రజల తీర్పుపై నమ్మకం ఉంటే చంద్రబాబు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలి.  రెండున్నరేళ్ల పాలనలో మోసపోయిన రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎన్నికల ప్రచారానికి వచ్చే టీడీపీ నేతలను ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు నిలదీయాలి. ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కాకపోయినా.. చంద్రబాబు పాలనపై తీర్పు ఇచ్చే అవకాశం ప్రజలకు వచ్చింది. ప్రజల తీర్పుకు భయపడే పాలకులే ఎన్నికల్లో పోటీని అడ్డుకుంటారు.. చంద్రబాబు భయానికి నిదర్శనమే ఈ దౌర్జన్యాలు’’ అని తెలిపారు. 

ఇదీ చదవండి: కూటమి రాజకీయాలకో దండం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement