సాక్ష్యాలను తుడిచేసి, మృతదేహాన్ని మాయం చేశారు
పోలీస్ స్టేషన్‌లో 18 నెలల సీసీటీవీ ఫుటేజీ లభించలేదు
అసలు హార్డ్ డిసు్కలను దొంగిలించారు
వాటి స్థానంలో వేరే హార్డ్ డిసు్కలను ఉంచారు
సిట్ విచారణలో నిందితులు మౌనంగా ఉన్నారు.. కాపు యువకుడు లాకప్‌డెత్ కేసులో తాజాగా ఇద్దరు కానిస్టేబుళ్లకు రిమాండ్
వీరి రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న పోలీసులు
విజయవాడలీగల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు కైతేపల్లి బాబురావు (ఏ–5), గొరిపర్తి సాంబయ్య (ఏ–6)కు ఈనెల 15వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీకాంత్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. అనంతరం బాబురావును అవనిగడ్డ సబ్‌జైలుకు, సాంబయ్యను గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.
విజయవాడలోని సిటీ పోలీసుగెస్ట్‌హౌస్ వద్ద మంగళవారం ఉదయం వీరిరువురినీ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజర్ మెమో ద్వారా జప్తుచేశారు. సిట్ అధికారుల విచారణలో నిందితులు ఇరువురు ఎలాంటి సహకారం అందించకుండా మౌనంగా ఉండిపోయారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
రిమాండ్ రిపోర్ట్‌లో అంశాలు..
‘సాయికృష్ణను చట్టవిరుద్ధంగా నిర్బంధించి, కస్టడీలో ఉండగా తీవ్రంగా కొట్టడం వల్ల అతడు మరణించాడు. అనంతరం నిందితులంతా కలిసి నేరాన్ని దాచడానికి సాక్ష్యాలను తుడిచివేసి, మృతదేహాన్ని మాయం చేశారని దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఈ కేసులో ఏ–1 సీఐ నాగరాజు, ఎ–2 పొట్లంక అశోక్‌కుమార్, ఏ–3 జంగం నానిని నిందితులుగా చేర్చారు. కృష్ణలంక పోలీసుస్టేషన్‌లో సీఐతోపాటు నలుగురు నిందితుల సమక్షంలో సాయికృష్ణను విచారించినట్లు సీడీఆర్ డేటాలో స్పష్టంగా ఉంది. అంతేకాకుండా కృష్ణలంక పోలీసుస్టేషన్‌లోని నెట్‌వర్క్ వీడియో రికార్డును పరిశీలించగా, అందులో గత 18 నెలల సీసీటీవీ ఫుటేజీ లభించలేదు.
నిందితులు తమ చట్టవిరుద్ధ నిర్బంధాన్ని, కస్టడీ హింసను దాచడానికి ప్రభుత్వ ఆస్తి అయిన అసలు హార్డ్ డిస్కులను దొంగిలించి, వాటి స్థానంలో వేరే హార్డ్ డిస్కులను ఉద్దేశపూర్వకంగా మార్చారు’’ అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యవాణి వాదనలు వినిపిస్తూ నిందితులు పోలీసు శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ హోదాల్లో ఉన్నందున, వారు బయట ఉంటే సాక్షులను (సహచర సిబ్బందిని) బెదిరించే లేదా ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అత్యంత కీలకమైన, సున్నితమైన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ దశలో ఉందని, ఈ నేపథ్యంలో నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరారు.
సీఐ నాగరాజు కస్టడీపై తీర్పు వాయిదా
విజయవాడ లీగల్: కాపు యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజును కస్టడీ కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం వాదనలు పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ సత్యవాణి వాదనలు వినిపించారు. కీలకమైన ఈ కేసుకు సంబంధించి సీఐ నాగరాజు విచారణలో సిట్ అధికారులకు పూర్తిగా సహకరించలేదన్నారు. పూర్తి వివరాలు రాబట్టేందుకు 12 రోజులపాటు పోలీసు కస్టడీ కోరారు.
నాగరాజుకు పూర్తి భద్రత కల్పించామని ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదించగా, న్యాయమూర్తి దీనికి సంబంధించి అఫిడవిట్‌ను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం డిఫెన్స్ తరఫు న్యాయవాదులు దిట్టకవి రామ్‌చంద్, గుడిశేవ సాంబశివరావు వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితుడు పోలీసులకు పూర్తిగా సహకరించాడన్నారు. పోలీసు కస్టడీకి కేవలం రెండు రోజుల సమయం సరిపోతుందన్నారు.
రోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని, వీడియో, ఆడియో రికార్డులను భద్రపరచి న్యాయస్థానంలో సమర్పించాలని, న్యాయవాది సమక్షంలోనే నిందితుని విచారణ చేయాలని న్యాయమూర్తిని కోరారు. నాగరాజుకు ప్రాణహాని ఉందని, అందుచేత రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ జరపాలని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. రెండు పక్షాల వాదనల అనంతరం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి శ్రీకాంత్ తీర్పును గురువారానికి వాయిదా వేశారు.


