విద్యుత్‌ నగదు బదిలీకి రూ.8,353 కోట్లు

Rs 8353 Crore For Electricity Cash Transfers - Sakshi

రైతు ఖాతాలకే రొక్కం.. జిల్లాల వారీగా సబ్సిడీ లెక్కలు

ఎక్కువ సబ్సిడీ పొందే జిల్లాల్లో మొదటి రెండు స్థానాల్లో చిత్తూరు, అనంతపురం

ప్రభుత్వానికి విద్యుత్‌శాఖ క్షేత్రస్థాయి నివేదిక

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలవుతున్న వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన రైతు ఖాతాల్లోకే నగదు బదిలీ ప్రక్రియ వేగవంతమైంది. క్షేత్రస్థాయిలో సేకరించిన వ్యవసాయ విద్యుత్‌ లోడ్‌ లెక్కల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,353.7 కోట్ల మేర విద్యుత్‌ సబ్సిడీని రైతులకు ఇవ్వాలని లెక్కించారు. ఇప్పటివరకు విద్యుత్‌ సబ్సిడీ లెక్కకు శాస్త్రీయత కొరవడింది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. జిల్లాలు, రైతుల వారీగా పొలంలోని పంపుసెట్‌ సామర్థ్యం, విద్యుత్‌ వినియోగం, ఇవ్వాల్సిన సబ్సిడీ వివరాలతో ప్రభుత్వానికి సమరి్పంచేందుకు ఇంధనశాఖ అధికారులు నివేదిక రూపొందించారు. 

చిత్తూరు జిల్లాకు రూ.1,421 కోట్లు 
► రాష్ట్రవ్యాప్తంగా 17,54,906 వ్యవసాయ పంపుసెట్లున్నాయి. ఇవి 1,15,55,553 అశ్వశక్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ మొత్తానికి ఏటా రూ.8,353.7 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఇంతకాలం ఈ మొత్తాన్ని డిస్కమ్‌లకు అందించేవాళ్లు. ఇకనుంచి ఈ సొమ్ము రైతుల ఖాతాల్లోకి వెళుతుంది. 
► చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18,52,479 హెచ్‌పీ విద్యుత్‌ లోడ్‌ ఉంది. ఈ జిల్లాలో మొత్తం 2,89,544 పంపుసెట్లున్నాయి. ఈ జిల్లాకు సంవత్సరానికి రూ. 1421 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుంది.  
► తర్వాత స్థానంలో అనంతపురం జిల్లా ఉంది. ఇక్కడ 2,72,607 పంపుసెట్లు 18,20,367 అశ్వశక్తి సామర్థ్యంతో ఉన్నాయి. వీటికి రూ.1,396.4 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం చెల్లించబోతోంది.  

 శ్రీకాకుళంలో ఇప్పటికే చెల్లింపులు 
► వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ఏప్రిల్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇందుకోసం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారు. పథకం ఉద్దేశాన్ని రైతులకు వివరిస్తున్నారు. 
► శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 31,526 పంపుసెట్లలో 25వేల పంపుసెట్లకు మీటర్లు బిగించారు. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమచేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top