
2025లో దేశీయంగా 4 శాతం పెరుగుతుందని అంచనా
ఐఈఏ నివేదిక
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో వేసవి ఉష్ణోగ్రతలు మరీ తీవ్రంగా లేకపోవడంతో విద్యుత్‌కి డిమాండ్ అంతగా ఉండకపోవచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేస్తోంది. 2025లో విద్యుత్ వినియోగం 4 శాతం స్థాయిలో పెరగవచ్చని ఒక నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే 2025–26 వ్యవధిలో, దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్‌కి డిమాండ్ పెరగనున్నప్పటికీ భారత్, చైనాలో మాత్రం ఇది ఓ మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని వివరించింది.
ఐఈఏ ప్రకారం భారత్‌లో గతేడాది విద్యుత్ వినియోగం 6 శాతం పెరగ్గా ఈసారి 4 శాతం స్థాయిలో ఉండనుంది. అలాగే చైనాలో 2024లో వినియోగం 7 శాతం పెరగ్గా ఈ ఏడాది 5 శాతానికి పరిమితం కానుంది. డిమాండ్ నెమ్మదించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎలక్ట్రిసిటీ వినియోగ వృద్ధిలో ఈ రెండు దేశాల వాటా, గతేడాది తరహాలోనే, 50 శాతానికి పైగా ఉంటుందని ఐఈఏ తెలిపింది. ‘అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల వల్ల భారత్‌లో పారిశ్రామిక కార్యకలాపాలపై ప్రభావం పడింది.
అలాగే వేసవి తీవ్రత కూడా పెద్దగా లేకపోవడం వల్ల 2024తో పోలిస్తే 2025 ప్రథమార్ధంలో విద్యుత్ వినియోగం 1.4 శాతమే పెరిగింది. వేసవి ముగిసిపోయినందున, ఇక సెప్టెంబర్‌లో డిమాండ్ మెరుగుపడితే, వార్షికంగా సుమారు 4 శాతం మేర వృద్ధి నమోదు కావచ్చు‘ అని ఐఈఏ తెలిపింది. పరిశ్రమలు, సేవల కార్యకలాపాలు పుంజుకుని, ఏసీల అమ్మకాలు కూడా పెరగడం వల్ల 2026లో ఎలక్ట్రిసిటీ డిమాండ్ 6.6 శాతం పెరగవచ్చని పేర్కొంది.