ఉచిత బియ్యం పంపిణీతో రూ.2,100 కోట్ల భారం 

Rs 2100 crore burden on AP Govt with free rice distribution - Sakshi

సార్టెక్స్‌ బియ్యం సరిపడా లేనందున ఎఫ్‌సీఐ నుంచి కొనుగోలు 

పీఎంజీకేఏవై పథకం కింద ప్రతి నెలా 15 నుంచి ఉచిత బియ్యం పంపిణీ 

రేషన్‌ షాపుల ద్వారా నవంబర్‌ నెల వరకే అందజేత 

ఇప్పుడున్న డోర్‌ డెలివరీ విధానం యథావిధిగా కొనసాగింపు 

సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కింద జూలై నుంచి నవంబర్‌ వరకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.2,100 కోట్ల భారం పడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యం నిల్వలు సరిపడాలేవని.. ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఎఫ్‌సీఐ నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సిందిగా కేంద్రం సూచించింది. అయితే, సార్టెక్స్‌ బియ్యం, ఎఫ్‌సీఐ నుంచి నాన్‌ సార్టెక్స్‌ బియ్యం ఒకేసారి డోర్‌ డెలివరీ సాధ్యం కాదని కమిషనర్‌ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే సార్టెక్స్‌ బియ్యం, పంచదార, కందిపప్పు ఇంటి వద్దకే డోర్‌ డెలివరీ జూలై 1 నుంచి యథావిధిగా జరుగుతుందని.. ఏ మార్పు ఉండదన్నారు. అలాగే, ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేసిన నాన్‌ సార్టెక్స్‌ బియ్యాన్ని నెలలో 15 నుంచి రేషన్‌ దుకాణాల వద్ద ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ విధానం నవంబర్‌ వరకు కొనసాగుతుందన్నారు. ఇక పీఎంజీకేఏవై పథకం కింద ఉచిత బియ్యం పంపిణీ పూర్తయిన తర్వాత రేషన్‌ దుకాణాల వద్ద ఎటువంటి సరుకుల పంపిణీ జరగదని స్పష్టంచేశారు.  గతేడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,100 కోట్ల వ్యయాన్ని భరించి పీఎంజీకేఏవై, ప్రజాపంపిణీ పథకాల ద్వారా బియ్యం, కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ చేసిందన్నారు. ఈ ఏడాది మే, జూన్‌లో ఆహార భద్రతా చట్టం కార్డుల్లో ఒక్కొక్కరికి 5 కేజీలు చొప్పున ఉచితంగా బియ్యమివ్వాలని కేంద్రం ఆదేశించిందని.. ఇందుకు రాష్ట్రం రూ.789 కోట్లు వ్యయం చేసిందన్నారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top