కారును ఢీకొన్న బొగ్గు లారీ | Road Accident in East Godavari District | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న బొగ్గు లారీ

May 27 2025 4:49 AM | Updated on May 27 2025 4:49 AM

Road Accident in East Godavari District

నలుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం 

రెండు కుటుంబాల్లో విషాదం 

తూర్పుగోదావరి జిల్లా గామన్‌ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం

రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం, దివాన్‌చెరువు శివారు గామన్‌ బ్రిడ్జి హైవేపై కొంతమూరు కేశవస్వామి ఆస్పత్రి వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన నార్త్‌ జోన్‌ డీఎస్పీ వై. శ్రీకాంత్‌ తెలిపిన వివరాలిలా వున్నాయి.. రాజానగరం నుంచి కొవ్వూరు వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి కేశవస్వామి ఆస్పత్రి సమీపంలో ఉన్న జంక్షన్‌లో రోడ్డు అవతలి వైపునకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

అదే సమయంలో కొవ్వూరు నుంచి వస్తున్న కారును ఈ లారీ ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను కొవ్వూరుకు చెందిన ఉప్పులూరి ప్రసాద్‌ (60), అతని భార్య లీలావతి (56), చాగల్లు మండలం మార్కొండపాడుకు చెందిన ఇమ్మని వీరవెంకటసత్యవతి (75), ధారవరానికి చెందిన లక్కంసాని బిందు (34)గా గుర్తించారు. బిందు భర్త లక్కంసాని ప్రసాద్‌ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇమ్మని వీరవెంకట సత్యవతి, ఆమె అల్లుడు ఉప్పులూరి ప్రసాద్, కూతురు లీలావతి ముగ్గురూ ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

ప్రమాదంపై భిన్న వాదనలు.. 
ఇక ఈ ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియడంలేదు. టైరు పంక్చర్‌ కావడంతో లారీ అదుపు తప్పి రోడ్డు అవతలి వైపునకు దూసుకుపోయిందని, అదే సమయంలో అటు నుంచి కారు రావడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, స్థానికులు చెప్పే కారణం మరోలా వుంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలో ఆర్టీఏ ఇన్‌స్పెక్టర్‌ వాహనాలను తనిఖీ చేస్తున్నారని.. అది చూసి లారీ డ్రైవర్‌ ఉన్నఫళంగా ‘యూటర్న్‌’ తీసుకోవడంవల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement