ఏపీ ప్రజలు రాక్షసులా? తెలంగాణ మంత్రిపై రోజా ఆగ్రహం​

RK Roja Fire On Telangana Minister Vemula Prashanth Reddy Comments - Sakshi

ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గం.. ప్రాంతాల మధ్య చిచ్చు సరికాదు 

ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, రవీంద్రనాథరెడ్డి మండిపాటు

8 ప్రాజెక్టుల ద్వారా తెలంగాణనే 178 టీఎంసీలు అక్రమంగా

తరలించుకుపోతోందంటూ ఆరోపణ

సాక్షి, అమరావతి: కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు సరికాదని.. ప్రాంతాలు విడిపోయినా, తెలుగు వారంతా ఒక్కటేనని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి గుర్తించాలని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను రాక్షసులంటూ మాట్లాడటం దారుణం అని, దుర్మార్గం అని మండిపడ్డారు. కలిసి మెలిసి ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు రేపేలా మాట్లాడటం ఎంత మాత్రం సరికాదన్నారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతూ మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. కేటాయింపులు లేకుండా చుక్క నీటిని కూడా వాడుకోవడం లేదని పేర్కొన్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌ కేటాయింపుల్లో రాష్ట్ర విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ (రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌) కుడి కాలువ పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులను ఆపాలని, అక్రమ ప్రాజెక్టులనీ మాట్లాడటం సరికాదన్నారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే.. 

విభజన చట్టాన్ని గౌరవించాలి..:
తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని గౌరవించడం లేదు. కేటాయింపులే లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో పాటు పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుతోంది. 8 అక్రమ ప్రాజెక్టుల ద్వారా 178 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతోంది. ప్రాంతాలకు, కులాలకు అతీతంగా ప్రజల మనసుల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన వైఎస్సార్‌ను తూలనాడటం తెలంగాణ మంత్రులు, నాయకులను తగదు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మహానేత ప్రాజెక్టులు చేపట్టారు. అందుకే ఆయన్ను అన్ని ప్రాంతాల ప్రజలు గుండెల్లో పెట్టుకొని దేవుడిగా కొలిచారు. ముఖ్యమంత్రి జగన్‌ పారదర్శకతతో వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి లేని కేటాయింపులను వాడుకోవాలని భావించడం లేదు. పొరుగు రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకొనే యోచన మా రాష్ట్రానికి లేదు.

కొత్త ప్రాజెక్టులు కడుతున్నది తెలంగాణే 
కొత్త ప్రాజెక్టులను అనుమతులు లేకుండా నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఫిల్మ్, ఐటీ ఇండస్ట్రీ తదితర పరిశ్రమలతో హైదరాబాద్‌ను ఆర్థిక పరిపుష్టి గల కేంద్రంగా తయారు చేశాం. విభజన వల్ల ఆ ప్రాంతాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. మంచి వాతావరణంలో ఇరువురం కలిసి ఉండి కర్ణాటక, మహరాష్ట్రతో పోరాడి సాగునీటిని తెచ్చుకోవాల్సింది పోయి స్థానికంగా ప్రజలను కించపరిచేలా మాట్లాడటం తగదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఎంతో సంయమనంగా వ్యవహరిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top