నవ చరిత్ర : చెప్పాడంటే. చేస్తాడంతే | Sakshi
Sakshi News home page

నవ చరిత్ర : చెప్పాడంటే. చేస్తాడంతే

Published Wed, Aug 16 2023 4:39 AM

Revolutionary changes in six major sectors in four years: CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో వందేళ్లుగా సాధ్యం కాని భూముల సర్వే లాంటి బృహత్తర కార్య­క్రమాలను సైతం నాలుగేళ్లలోనే సాకారం చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలి­పారు. నవరత్నాల పథకాల ద్వారా గత 50 నెలల్లో డీబీటీతో పేదలకు రూ.2.31 లక్షల కోట్లను ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా అందించినట్లు చెప్పారు.

పలు రంగాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. మంగళవారం విజ­యవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌ గత నాలుగేళ్లలో ఆరు ప్రధాన రంగాల్లో తెచ్చిన మార్పులను వివరించారు. 

వ్యవసాయం..
రాష్ట్రంలో 52 లక్షల మంది రైతన్నలకు ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. ఆర్బీకే స్ధాయిలో ఈ క్రాప్, ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నాం. పంట నష్ట­పోతే సీజన్‌ ముగిసేలోగానే రైతులకు పరిహారం అందిస్తున్నాం. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్‌తోపాటు ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కే ఇస్తున్నాం.

పాలవెల్లువ ద్వారా అదనంగా ఆదాయాన్ని సమకూర్చాం. మూతపడిన చిత్తూరు డెయిరీ సహా సహకార సంఘాలకు జీవం పోశాం. వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టి భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపుతున్నాం. అసైన్డ్‌ భూములపై సాగుదారులకు పూర్తి హక్కులు కల్పించాం. వీరిలో ఎస్సీ, బీసీ వర్గాల వారే ఎక్కువగా ఉన్నారు.

1.54 లక్షల మంది ఎస్టీ రైతులకు 3.23 లక్షల ఎకరాలను డీకేటీ, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలుగా ఇచ్చాం. చుక్కల భూముల జాబితా నుంచి 1.07 లక్షల రైతులకు చెందిన 2.06 లక్షల ఎకరాల భూముల్ని తొలగించాం. షరతులు గల పట్టాలు కలిగిన మరో 22 వేల మంది రైతులకు 33 వేల ఎకరాలపై పూర్తి హక్కులు కల్పించాం. 

వడివడిగా ప్రాజెక్టులు..
గత ప్రభుత్వంలో మాదిరిగా ఫలితాలు లేకుండా, ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టకుండా జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నాం. ఇప్పటికే నెల్లూరు బ్యారేజి, సంగం బ్యారేజి, అవుకు టన్నెల్‌ పూర్తి చేశాం. పులిచింతల, గండికోట, చిత్రావతి, పైడిపాలెం, బ్రహ్మం సాగర్‌ రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటిని నింపగలుగుతున్నాం. కాలు­వల సామర్థ్యం పెంచటంతోపాటు రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.

వెలిగొండలో మొదటి టన్నెల్‌ను మనమే పూర్తి చేయగా రెండో టన్నెల్‌ పనులు మరో రెండు నెలల్లో పూర్తికానుంది. ఉత్తరాంధ్రలో వంశధార ఫేజ్‌–2, వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనుల­ను పూర్తి చేసి డిసెంబర్‌ కల్లా ప్రారంభించనున్నాం. తోటపల్లి, తారకరామ తీర్థ సాగర్‌ పనులు 2024­కి పూర్తి చేయనున్నాం. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం  విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, సాంకేతిక సమస్యలన్నింటినీ అధి­గమించి వడివడిగా పనులు చేపట్టాం. ఈ ప్రాజెక్టును 2025 జూన్‌ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
ఏటా దాదాపు 83 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నాం.  నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖల్ని మారుస్తున్నాం. ఇంగ్లిష్‌ మీడియం, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. బైలింగ్యువల్‌ పాఠ్యపుస్తకాలు పిల్లలకు అందజేస్తున్నాం. ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ప్రతి మండలంలో ఒక జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేశాం. 3వ తరగతి నుంచే టోఫెల్‌కు శిక్షణ ఇచ్చేలా ఈటీఎస్‌ ప్రిన్స్‌టన్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యాన­ల్స్‌ (ఐఎఫ్‌ పీ)లను ఏర్పాటు చేస్తున్నాం.

బైజూస్‌ కంటెంట్‌ను ఉచితంగా ఇచ్చాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందజేస్తున్నాం. రోజుకో మెనూతో గోరుముద్ద రుచికరంగా అందిస్తున్నాం.  రూ. 20 వేల వర కు వసతి దీవెన ఇస్తున్నాం. ప్రపంచ స్థాయిలో టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న దాదాపు 330 కాలేజీల్లో, 21 ఫ్యాకలీ్టల్లో సీటు తెచ్చుకున్న పిల్లలకు రూ.1.25 కోట్ల వరకూ విదేశీ విద్యా దీవెన ఇస్తున్నాం. డిగ్రీ కరిక్యులమ్‌ను జాబ్‌ ఓరియంటెడ్‌గా  మార్పు చేశాం. నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులను తీసుకొచ్చాం.

10 నెలల ఇంటర్న్‌షిప్‌ విధానాన్ని తెచ్చాం. వర్సిటీలు, ట్రిపుల్‌ఐటీల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 3,295 టీచింగ్‌ పోస్టుల భర్తీకి శ్రీకా­రం చుట్టాం. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, వర్చువల్‌ రియాల్టీ, ఆగ్‌మెంటెడ్‌ రియాల్టీ సహా ప్రతి మార్పును విద్యారంగంతో అనుసంధానిస్తూ ప్రపంచంతో పాటు అడుగులు వేస్తున్నాం.  

అందరికీ వైద్యం, ఆరోగ్యం
వందేళ్ల చరిత్రలో రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండగా ఈ 50 నెలల్లోనే ఏకంగా 17 కొత్త గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 108, 104 సేవల కోసం మరో 1,514 వాహనాలను కొనుగోలు చేశాం. తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్‌తో కలిపి ఏకంగా 2,204 వాహనాలను నడుపుతున్న ఏకైక రాష్ట్రం మనది మాత్రమే.

రికార్డు స్ధాయిలో 53,126 వైద్య సిబ్బంది నియామకాలు జరిపాం. స్పెషలిస్టు డాక్టర్లు దొరక్క జాతీయ స్థాయిలో 61 శాతం పోస్టులు ఖాళీగా ఉంటే రాష్ట్రంలో స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ల ద్వారా 96.04 శాతం స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులను భర్తీ చేశాం. జాతీయ స్థాయిలో 27 శాతం నర్సులు, 33 శాతం ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేయకుండా వదిలేస్తే మన రాష్ట్రంలో 100 శాతం పోస్టుల్ని భర్తీ చేశాం. గతంలో ప్రమాణాలు లేని 292 రకాల మందులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటే ఈ రోజు ఏకంగా 562 రకాల డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలు కలిగిన నాణ్యమైన ఔషధాలను అందుబాటులోకి తెచ్చాం.

10,032 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, 560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. ప్రతి విలేజ్‌ క్లినిక్‌లో 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు గ్రామస్థాయిలోనే అందిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నాం. ప్రివెంటివ్‌ కేర్‌లో ఇది నూతన అధ్యాయం. 95 శాతం జనాభాను ఆరోగ్య­శ్రీ పరిధిలోకి తేవడంతోపాటు ప్రొసీజర్లను 3255కి విస్తరించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు రూ.5 వేల వరకూ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా సాయం చేస్తున్నాం. 

సామాజిక మార్పులు 
మంత్రి మండలిలో 68 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చాం. శాసన సభ స్పీకర్‌గా బీసీకి, మండలి చైర్మన్‌గా ఎస్సీకి,మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మైనార్టీ మహిళకు అవకాశం కల్పించాం. నామినేటెడ్‌ పోస్టుల్లో ౖచైర్మన్లుగా, డైరెక్టర్లుగా 50 శా తం పదవులను  చట్టం చేసి మరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాం. నామినేషన్‌ కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీల కు దక్కేలా చట్టం చేశాం.

139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించిన తొలి రాష్ట్రంగా నిలిచాం. మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేశాం. గత 50 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో పేదలకు రూ.2.31 లక్షల కోట్లను  పారదర్శకంగా అందించగా, అందులో ఏకంగా 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే లబ్ధి చేకూరింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా 2,06,638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. వీరిలో 80 శాతం ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే.

మూడేళ్లుగా మనమే నంబర్‌ వన్‌
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరసగా మూడేళ్లుగా మన రాష్ట్రమే దేశంలో నంబర్‌ వన్‌ స్ధానంలో ఉంది. రాష్ట్ర విభజన నాటికి కేవలం నాలుగు చోట్ల మాత్రమే పోర్టులు ఉండగా ఈ నాలుగేళ్లలోనే మరో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టాం. మరో 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు నిర్మిస్తున్నాం. విశాఖలో ఇప్పటికే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ప్రారంభించాం. కర్నూలు ఎయిర్‌పోర్టును ప్రారంభించాం. కడప విమానాశ్రయాన్ని విస్తరించాం.

దేశంలో నిర్మిస్తున్న 11 పారిశ్రామిక కారిడార్లలో మూడు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. గతంలో ఏనాడూ మన రాష్ట్రానికి రాని పారిశ్రామిక దిగ్గజాలు ఈ నాలుగేళ్లలోనే వచ్చారు. 2019 జూ న్‌ నుంచి నేటి వరకు రాష్ట్రంలో నెలకొల్పిన భారీ పరిశ్రమలు 127. వచ్చిన పెట్టుబడులు రూ.67, 196 కోట్లు. ప్రత్యక్ష ఉద్యోగాలు 84,607. విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఏకంగా రూ.13.42 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదిరాయి.

తద్వారా రానున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 6 లక్షలు. కొత్తగా ప్రారంభమైన ఎంఎస్‌ఎంఈ యూనిట్లు 2,00,995. ఉద్యోగాలు, ఉపాధి పొందినవారు 12.61 లక్షలు. కో విడ్‌ విసిరిన పెను సవాళ్లను తట్టుకుని మన రాష్ట్ర పారిశ్రామిక ర్యాంకును, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈని రక్షించుకోగలిగాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు, ఎంఎస్‌ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాం.  తమ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలని స్థానికులే ఆహ్వానించేలా,  తద్వారా 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయించింది  మన ప్రభుత్వమే. 

Advertisement
 
Advertisement
 
Advertisement