APSRTC Cargo Mango Service: మామిడితో కాసులు.. ఆర్టీసీకి ఏ దిల్‌ ‘మ్యాంగో’ మోర్‌

Revenue From Mango Transportation To APSRTC Cargo - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీకి మామిడి కాసులు తెచ్చి పెడుతోంది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు మామిడి కాయలు/పండ్లను పార్శిల్‌ ద్వారా పంపే వారి సంఖ్య పెరుగుతోంది. ఆర్టీసీ కార్గో, కొరియర్‌ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటికి డోర్‌ డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పించడంతో మంచి ఆదరణ లభిస్తోంది. పార్శిల్‌ బుక్‌ చేసిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని నిర్దేశిత ప్రాంతాలకు సరకును అందజేస్తోంది. ఇది వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది.
చదవండి: కేశినేని కుటుంబంలో కుంపటి!  

మామిడికి ప్రత్యేక కౌంటర్‌.. 
విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌)లో కార్గో బుకింగ్‌ కౌంటర్‌ అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితం నుంచి మామిడి సీజను మొదలైంది. మామిడిని పార్శిల్‌ ద్వారా పంపే వారి కోసం ప్రత్యేకంగా పీఎన్‌ బస్టాండులోని 60వ నంబరు ప్లాట్‌ఫాం వద్ద కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక ర్యాక్‌లను కూడా అమర్చారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే మ్యాంగో బాక్సుల డెలివరీకి 57వ నంబరు ప్లాట్‌ఫాం వద్ద మరో ప్రత్యేక కౌంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల కార్గో బుకింగ్‌ కౌంటర్‌ వద్ద రద్దీ తగ్గడంతో పాటు వేగంగా పార్శిళ్లను బుక్‌ చేసుకునే వీలుంటోంది. ఇలా ఈ మ్యాంగో బుకింగ్‌ కౌంటర్‌లో నెలకు 600 నుంచి 800 వరకు బాక్సులు/పార్శిళ్లు బుక్‌ అవుతున్నాయి.

గతేడాది కంటే మిన్నగా.. 
గత ఏడాది ఏప్రిల్‌లో 400 మ్యాంగో పార్శిళ్లు, మే నెలలో 600, జూన్‌లో 600 చొప్పున పీఎన్‌ బస్టాండు నుంచి వేర్వేరు ప్రాంతాలకు బుక్‌ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 600, మే నెలలో ఇప్పటివరకు 800 వరకు పార్శిళ్లను పంపించారు. అంటే గత ఏడాదికంటే ఈ సీజనులో మామిడి పండ్ల/కాయల పార్శిళ్ల సంఖ్య పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఆర్టీసీ ఒక్కో బాక్సుకు (5–15 కిలోల బరువు వరకు) రూ.100–120 వరకు రవాణా చార్జీ వసూలు చేస్తోంది. ఈ లెక్కన మామిడి రవాణా ద్వారా ఏప్రిల్‌లో రూ.60 వేలు, మే నెలలో (ఇప్పటి దాకా) రూ.80 వేల వరకు కార్గో ఆదాయం సమకూరింది. జూన్‌లోనూ 800 వరకు మ్యాంగో పార్శిళ్లు బుక్‌ అవుతాయని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్, విశాఖలకు అధికం.. 
విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నంలకు అధికంగా మ్యాంగో పార్శిళ్లు బుక్‌ చేస్తున్నారు. ఆ తర్వాత తిరుపతి, రాజమండ్రిలకు బుక్‌ అవుతున్నాయని ఆర్టీసీ కార్గో విభాగం అధికారులు చెబుతున్నారు. ఒకే వినియోగదారుడు నాలుగైదుసార్లు పార్శిళ్లను పంపుతున్న వారు కూడా ఉంటున్నారని వివరిస్తున్నారు.

మామిడి తర్వాత..
విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు కార్గో రవాణాలో మామిడి తర్వాత మందులు, ఫ్యాన్సీ సరుకులు, వ్రస్తాలు, ఎలక్ట్రికల్‌ వస్తువులు, పుస్తకాలు వంటివి ఉంటున్నాయి. ఇలా వీటి ద్వారా విజయవాడ కార్గో కౌంటర్‌కు రోజుకు రూ.2.50 నుంచి 3 లక్షల వరకు ఆదాయం సమకూరుతోందని ఆర్టీసీ కార్గో విభాగం డెప్యూటీ సీటీఎం (కమర్షియల్‌) రాజశేఖర్‌ ‘సాక్షి’కి చెప్పారు.  

డోర్‌ డెలివరీ కూడా..
మరోవైపు పది కిలోమీటర్లలోపు డోర్‌ డెలివరీకి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ఇది కూడా వినియోగదారులకు వెసులుబాటుగా ఉంటోంది. బుక్‌ చేసిన సరకును వెళ్లి తీసుకురావడానికి సమయాన్ని వెచ్చించడంతో పాటు ఆటో, బస్సు, వాహన చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. డోర్‌ డెలివరీ వెసులుబాటు ఉండడం వల్ల వీరికి డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. దీంతో పలువురు ఈ డోర్‌ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.  

విడిపించని సరకులకు నేడు వేలం..
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పార్శిళ్లను కొంతమంది విడిపించుకోరు. అలాంటి వాటిని ఆర్టీసీ అధికారులు కొన్నాళ్ల పాటు వేచి చూసి ఎవరూ రాకపోతే వేలం వేస్తుంటారు. ఇలా పీఎన్‌ బస్టాండులో 2–3 నెలలుగా విడిపించుకోని 80 వరకు పార్శిళ్లు ఉన్నాయి. వీటిలో మందులు, దుస్తులు, స్టేషనరీ, స్పేర్‌ పార్టులు వంటివి ఉన్నట్టు గుర్తించారు. వీటికి శనివారం ఉదయం 11 గంటల నుంచి వేలం వేస్తామని  పార్శిల్‌ విభాగం అధికారులు తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top