అయ్యో.. గోమాతలారా..

Rescue Team Trying To Find 100 Cows Wash Away In VBR Reservoir - Sakshi

వీబీఆర్‌లో వంద ఆవుల గల్లంతు

అడవి పందులను చూసి బెదిరిన ఆవుల మంద

రిజర్వాయర్‌లో దూకిన 450 గోవులు

350 ఆవులను రక్షించిన మత్స్యకారులు

సహాయ చర్యలను సమీక్షించిన అధికారులు 

వెలుగోడు: నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నీటిలో మునిగి వంద ఆవులు గల్లంతయ్యాయి. మేతకు వెళ్తున్న ఆవుల మందను అడవి పందులు బెదిరించడంతో రిజర్వాయర్‌లోకి దూకాయి. వెంటనే అప్రమత్తమైన వాటి యజమానులు, మత్స్యకారులు రిజర్వాయర్‌లో చిక్కుకున్న 350 గోమాతలను రక్షించగా, మరో 100 ఆవుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగోడుకు చెందిన శంకర్, సుంకన్న, కురుమన్న, బాలలింగం, వెంకటరమణతో పాటు మరో ఐదుగురికి చెందిన వెయ్యి ఆవులు వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పరిధిలోని డీఎల్‌బీ రెగ్యులేటర్‌ వద్ద గట్టు వెంట శుక్రవారం ఉదయం మేతకు వెళ్లాయి.

అదే సమయంలో ఎదురుపడిన అడవి పందుల గుంపు ఆవుల మందను బెదిరించాయి. దీంతో భయపడిన ఆవులు (దాదాపు 450) వెలుగోడు జలాశయంలోకి పరుగులు తీశాయి. బానకచెర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి 9 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోయాయి. దిక్కు తోచని స్థితిలో ఆవుల కాపరులు బిగ్గరగా కేకలు వేయడంతో రిజర్వాయర్‌ వద్ద ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై పుట్టీల సాయంతో నీటిలో ఉన్న 350 ఆవులను రక్షించారు. గల్లంతయిన ఆవుల కోసం గాలిస్తున్నారు. ఆవులను రక్షించటానికి గ్రామస్తులు జాలరులను రంగంలోకి దింపారు. మర బుట్టలతో జాలరులు ఆవుల కోసం శుక్రవారం సాయంత్రం వరకు గాలించారు. ఘటనా స్థలానికి ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ జగన్‌మోహన్, తహసీల్దార్‌ మహమ్మద్‌ రఫీ, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీను, ఆర్‌ఐ రామాంజనేయులు, వీఆర్‌వోలు చేరుకొని సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో వంద ఆవుల ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top