అంగన్‌వాడీల్లో 5,905 పోస్టుల భర్తీ | Replacement of 5905 posts in Anganwadi | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో 5,905 పోస్టుల భర్తీ

Oct 6 2020 3:11 AM | Updated on Oct 6 2020 4:06 AM

Replacement of 5905 posts in Anganwadi - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఖాళీ పోస్టులకు జిల్లాలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి ప్రభుత్వం భర్తీ చేస్తోంది. 5,905 పోస్టుల భర్తీకి దశలవారీగా దరఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు. ప్రధానంగా అంగన్‌వాడీలు, మినీ అంగన్‌వాడీల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతోంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్‌లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు చేపట్టారు. 4,007 అంగన్‌వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్‌వాడీ వర్కర్లు, 1,468 మెయిన్‌ అంగన్‌వాడీల్లో వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. 

“అనంత’లో 654 పోస్టులకు 3,102 దరఖాస్తులు
అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి పోస్టుల భర్తీకి కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 2019 ఖాళీల ఆధారంగా జిల్లాలో 654 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేయగా 3,102 దరఖాస్తులు అందాయి. అభ్యర్ధుల కనీస విద్యార్హతను 10వ తరగతిగా ప్రభుత్వం నిర్ణయించింది. మెయిన్‌ అంగన్‌వాడీల్లో వర్కర్లకు రూ.11,500, మినీ అంగన్‌వాడీల్లో వర్కర్లుకు రూ.7 వేల చొప్పున వేతనాన్ని చెల్లించనున్నారు. హెల్పర్లకు కూడా రూ.7 వేల చొప్పున వేతనాన్ని అందచేస్తారు. 

పారదర్శకంగా పోస్టుల భర్తీ
రాష్ట్రంలో మెయిన్‌ అంగన్‌వాడీల్లో 48,770 వర్కర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం 47,302 మంది మాత్రమే ఉన్నందున 1,468 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. మెయిన్‌ అంగన్‌వాడీల్లో 48,770 హెల్పర్లకు బదులుగా 44,763 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 4,007 హెల్పర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. మినీ అంగన్‌వాడీల్లో 6,837 వర్కర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం 6,407 మంది మాత్రమే ఉన్నందున 430 పోస్టుల భర్తీ జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పోస్టుల భర్తీ చేపట్టి అర్హుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement