నాటి సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం రెన్యూ పవర్ చైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా ‘ఎక్స్’లో పెట్టిన పోస్టు
వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రాష్ట్రానికి రెన్యూ పవర్ ప్రైవేట్ లిమిటెడ్
అయినా తామే తెచ్చినట్లు చంద్రబాబు, లోకేశ్ నాటకాలు
నెటిజన్ల ట్రోల్స్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులను తమవిగా చెప్పుకుంటూ అభాసుపాలవుతున్నా.. రోజురోజూకూ మరింత దిగజారి కీర్తి చౌర్యానికి పాకులాడుతున్నారు. తాజాగా రెన్యూ పవర్ ప్రైవేటు లిమిటెడ్ పెట్టుబడులు తామే తెచ్చామంటూ గొప్పలు పోతున్నారు. అయితే ఈ పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. రె
న్యూ పవర్ సీఈఓ సుమంత్‌సిన్హా గత ప్రభుత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం అప్పటి సీఎం వైఎస్ జగన్ దార్శనికతను కొనియాడారు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు
‘‘పెట్టుబడులను ఆకర్షించడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడంపై వంటి అనుకూలమైన వ్యాపార వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. 2050 నాటికి ఆగ్నేయాసియాలో ప్రవేశించే పెట్టుబడిదారులకి ఏపీ తొలి ప్రాధాన్యంగా మారాలని, పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చే ప్రపంచ గమ్యస్థానంగా ఎదగాలని రాష్ట్రం ఒక దార్శనికతను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్‌లో నిన్న జరిగిన చర్చకు సంబంధించి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ధన్యవాదాలు.’’
» ఇవి రెన్యూ పవర్ చైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్సెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం, గత ప్రభుత్వంతో ఒప్పందాల అనంతరం సామాజిక మాధ్యమం(లింక్డ్‌ఇన్) వేదికగా చెప్పిన మాటలు ఇవి.
తండ్రీ కొడుకుల తీరు సిగ్గు..సిగ్గు
వైఎస్ జగనే రెన్యూ పవర్‌ని తీసుకొస్తే.. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఆ సంస్థను గెంటేసిందని, తామే ఆ సంస్థ నుంచి పెట్టుబడులు తీసుకువస్తున్నామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు చెబుతున్నారు. క్రెడిట్ చోరీ నాటకంలో తండ్రీకొడుకులు పోటీ పడుతున్నారు. కానీ నెటిజన్లు వాస్తవాలను బయటపెట్టి సోషల్ మీడియాలో వారిని ట్రోల్స్ చేస్తున్నారు.


