జంగిల్‌ సఫారీ.. ఆనందాల సవారీ

Redwood Jungle With Name Of Vanaviharam - Sakshi

ఎర్రచందనం చెట్ల నడుమ పర్యటన

కీకారణ్యంలో అతిథిగృహం, చిల్డ్రన్‌పార్కు

రూ.10లక్షలతో పర్యాటకాభివృద్ధికి ప్రతిపాదన

రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతమైన రాజంపేట–రాయచోటి అటవీ మార్గంలోని తుమ్మలబైలులో రెడ్‌ఉడ్‌ జంగిల్‌ సఫారీని 2010లో ఏర్పాటుచేశారు. ఇపుడు వనవిహారం పేరుతో రూ.10లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులకు అనువుగా మారుస్తున్నారు. వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించే విధంగా హోర్డింగ్స్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఎర్రచందనం చెట్ల సముహంలో వనవిహారం ఆద్యంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. సేద తీరేందుకు ఏర్పాటు చేసిన అతిథి గృహం, పిల్లలు ఆడుకోవడానికి నెలకొల్పిన పార్కు అదనపు ఆకర్షణగా ఉంటాయి. 

తెల్లదొరల కాలం నుంచే....
తెల్లదొరల కాలం నుంచి తుమ్మలబైలు అతిథిగృహాన్ని పర్యాటకపరంగా ఏర్పాటు చేసి ఉన్నారు. వేసవి విడిదిగా అక్కడే కాలం గడిపేవారు. అటవీ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా తెల్లదొరలు సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అవి కాలగర్భంలో కలిసిపోయాయి. తర్వాత అటవీశాఖ తుమ్మలబైలు ప్రాంతాన్ని రెడ్‌వుడ్‌ జంగిల్‌ సఫారీ పేరుతో అభివృద్ధి చేసి తొలిసారిగా శేషాచలం అటవీ అందాలను పర్యాటకులకు చూపించనున్నారు. 

శేషాచలం ఇలా..
రాజంపేట డివిజన్‌లో అరుదైన జంతువులకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతం విస్తీర్ణం 82,500 ఎకరాల్లో ఉంది. ఎర్రచందనం విస్తారంగా కలిగి ఉన్న దీనిని కేంద్రంఇప్పటికే బయోస్పెయిర్‌గా ప్రకటించింది..ఈ ప్రాంత అందాలను పర్యాటకులు వీక్షించేలా ఎకో టూరిజం కింద రెడ్‌వుడ్‌ జంగిల్‌ సఫారీని రూపుదిద్దారు. ప్రధానంగా రెడ్‌వుడ్‌ జంగిల్‌ సఫారీలో చిరుత, ఎలుగుబండ్లు, నెమళ్లు, రోసికుక్కలు, అడవిపందులు, జింకలు, కొండగొర్రెలు, కణితులు ఉంటాయి. డిసెంబరు మాసంలో ఏనుగులు సంచరిస్తాయి. 

పర్యాటకులకు అనుకూలంగా..
అటవీ అందాలను వీక్షించేందుకు అనుకూలంగా రెడ్‌వుడ్‌ జంగిల్‌ సఫారీలో ఏర్పాట్లు చేశారు. దీని ముఖద్వారం నుంచి తుమ్మలబైలు బంగ్లా, చిల్డ్రన్స్‌ పార్కు, ఐరన్‌వాచ్‌టవర్, సేదతీరేందుకు సౌకర్యాలు, వాచ్‌టవర్‌ను ఏర్పాటుచేశారు. జంగిల్‌ సఫారీ వాహనం కూడా సిద్ధం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్డును బాగు చేస్తున్నారు. రెడ్‌వుడ్‌ జంగిల్‌ సఫారీలో 30 కిలోమీటర్ల మేర అటవీ ప్రయాణం ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. మల్లాలమ్మ కుంట సాకిరేవు ఏరియాలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. 

ఉన్నతాధికారులు సైతం సేదతీరే..సఫారీ
నిత్యం బిజీగా విధులు నిర్వహించే జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి ఊరటపడుతుంటారు. జిల్లా కలెక్టర్లు, వివిధ జిల్లా అధికారులు జంగిల్‌ సఫారీలో పర్యటించి ఆహ్లాదకర అటవీ అందాలను వీక్షించి మానసిక ఉల్లాసాన్ని గడుపుతున్నారు. పర్యాటకులకు అనుమతితో సఫారీకి వెళుతుంటారు. ఇందుకోసం గతంలో వాహనాలను కూడా అందుబాటులో ఉంచేది. 

వనవిహారం స్కీం..
వనవిహారం స్కీం కింద గత ఏడాది రూ.5లక్షలతో అతిథిగృహం పునరుద్ధరించారు. ట్రీమచ్, రోడ్లు, మల్లెలమ్మ కుంట వద్ద అభివృద్ధి చేశారు. ఈ ఏడాది కూడా రూ.10లక్షలతో అభివృద్ధి చేసేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగులు రాకుండా కంచెను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యాలు, సోలార్‌ విద్యుత్‌ను ఏర్పాటుచేస్తున్నారు. పర్యాటకులు రూ.10 లు ప్రవేశ రుసుంతో సఫారీలో పర్యటించవచ్చు. అది కూడా సాయంత్రం 5గంటల వరకు తిరిగి బయటికిరావాల్సి ఉంటుంది. రాత్రి వేళలో ఉండేందుకు వీలులేని పరిస్థితి. జంగిల్‌ సఫారీ వాహనం రూ.2 లక్షలతో మరమ్మతులు చేసి పర్యాటకుల తిరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రెడ్‌వుడ్‌ జంగిల్‌ సఫారీ అభివృద్ధికి చర్యలు
రూ.10లక్షలతో తుమ్మలబైలు అటవీ ప్రాంతంలో రెడ్‌వుడ్‌ జంగిల్‌ సఫారీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రీమచ్‌లు ఏర్పాటుచేశాం. ఏనుగులు రాకుండా కంచెను బలోపేతం చేస్తున్నాం. సోలార్‌ వెలుగులు తీసుకొచ్చాం. పర్యాటకులకు వసతి సౌకర్యాలు పునరుద్ధరిస్తున్నాం. రూ.3లక్షలతో జంగిల్‌ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఎర్రచందనం, జంతువుల గురించి పర్యాటకులకు తెలిసే సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.    
–నరసింహారావు,   ఇన్‌చార్జి డీఎఫ్‌ఓ, రాజంపేట 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top